తెలంగాణ

telangana

Drugs Control in Telangana: మాదకద్రవ్యాల కట్టడిలో సఫలమైన అబ్కారీ శాఖ

By

Published : Dec 31, 2021, 12:37 PM IST

Drugs Control in Telangana
Drugs Control in Telangana ()

Drugs Control in Telangana: రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిలో అబ్కారీ శాఖ పోలీసులతో కలిసి అమలు చేసిన ప్రణాళిక సత్ఫలితాలిచ్చింది. గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా, విక్రయాలు, వాడకందారులపై మొత్తం 497 కేసులు నమోదు చేసి 830 మందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అరెస్టు చేసింది. పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం 134 వాహనాలను సీజ్‌ చేసింది.

Drugs Control in Telangana: తెలంగాణలో మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్ర అబ్కారీ శాఖ చేపట్టిన ప్రణాళిక ఈ ఏడాది సత్ఫలితాలను ఇచ్చింది. మాదకద్రవ్యాలు, గంజాయి సరఫరా, విక్రయాలు, వాడకందారులను నిలువరించడంలో సఫలీకృతమైంది. గతంలో ఎన్నడు లేనివిధంగా 830మందిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షతో అప్రమత్తమైన శాఖ.. సీఎస్ సోమేశ్​కుమార్ ఆదేశాలతో మాదకద్రవ్యాల దందాను నియంత్రించేందుకు అబ్కారీశాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్ పటిష్ట కార్యాచరణను అమలు చేశారు.

అదనపు సంచాలకుడు అజయ్‌ రావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేశాయి. హైదరాబాద్‌ నగరం మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు.. 449 కేసులు నమోదు చేసి 743 మందిని అరెస్టు చేశారు. 134 వాహనాలను సైతం సీజ్‌ చేసినట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు సంచాలకులు అజయ్‌రావు తెలిపారు. నిందితుల నుంచి మూడున్నరవేల కిలోలు పొడి గంజాయి.. 16,572 గంజాయి మొక్కలు, 490గ్రాములు డైజో ఫాం, 5కిలోలు ఆల్ఫాజోలమ్‌, 5.7 కిలోలు ఎస్‌ఎడీ, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.

రోజురోజుకు పెరుగుతోంది..

హైదరాబాద్‌ నగరంలో గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలు, వాడకందారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక బృందాలు నగర పోలీసులతో కలిసి పని చేస్తున్నాయి. ప్రధానంగా నిఘాను పటిష్ఠం చేసుకోవడంతోపాటు.. అక్రమ కార్యకలాపాలకు కేంద్రబిందువైన దూల్‌పేట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిఘాను పటిష్టం చేయడంతో.. గంజాయిని కట్టడి చేయడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సఫలం అయ్యారు. దూల్‌పేటలో నిందితుల దూలి దులిపారు. ఆంధ్రప్రదేశ్​లోని ఏజన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తరలించే ముఠాల కదలికలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందాలు నిఘా పెట్టాయి. విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం, నిఘాను పటిష్ఠం చేయడంతో కట్టడి చేయగలిగామని... ఎన్‌ఫోర్స్‌మెంటు సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి తెలిపారు. గడిచిన ఆరునెలల్లో పోలీసులతో కలిసి అంజిరెడ్డి బృందం తనిఖీలు నిర్వహించి.. హైదరాబాద్‌ నగరంలో మొత్తం 48 కేసులు నమోదు చేసి 67 మంది మాదకద్రవ్యాల సరఫరాదారులను అరెస్టు చేశాయి. 26 వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు 145కిలోలు గంజాయి, 200గ్రాముల కొకైన్‌, 56గ్రాములు ఎండీఎంఏ, 25ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, 680 గ్రాముల ఎస్టాప్సీ పిల్స్‌, 70గ్రాముల చరాస్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: Ganza seized in Hyderabad: గుప్పుమన్న గంజాయి.. 90 లక్షల విలువైన సరుకు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details