తెలంగాణ

telangana

DRUGS CASE:డ్రగ్స్‌ కేసు మాటున సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్‌!

By

Published : Sep 2, 2021, 5:12 AM IST

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్​లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పేరుకి మత్తుమందుల కేసు అని చెబుతున్నా టాలీవుడ్‌ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరుపుతున్న దర్యాప్తు అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. సినీ పరిశ్రమ మాటున అక్రమ నిధుల మళ్లింపు ఏమైనా జరిగిందా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకే ఈడీ మత్తుమందుల కేసును అవకాశంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

DRUGS CASE:డ్రగ్స్‌ కేసు మాటున సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్‌
DRUGS CASE:డ్రగ్స్‌ కేసు మాటున సినీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్‌

పేరుకి మత్తుమందుల కేసు అని చెబుతున్నా టాలీవుడ్‌ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరుపుతున్న దర్యాప్తు అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. పూరీ జగన్నాథ్‌ విచారణ సందర్భంగా ఆయన ఆర్థిక లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించడం ఇందుకు బలమిస్తోంది. సినీ పరిశ్రమ మాటున అక్రమ నిధుల మళ్లింపు ఏమైనా జరిగిందా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకే ఈడీ మత్తుమందుల కేసును అవకాశంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22 వరకూ జరిగే విచారణలో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. వీరి నుంచి వెల్లడయ్యే సమాచారం ఆధారంగా ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ల నాటి టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో తాజాగా ఈడీ దర్యాప్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మత్తుమందుల మాటున నిధుల మళ్లింపు ఏమైనా జరిగిందా?.. అనే కోణంలోనే ఈడీ దర్యాప్తు జరుపుతుందని భావించారు. ఎందుకంటే నిధుల అక్రమ మళ్లింపు నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) పరిధిలోనే అది దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. మత్తుమందుల వినియోగం దాని పరిధిలోకి రాదు. మొదటిరోజైన మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. ఆయన ఆడిటర్‌ శ్రీధర్‌నీ పిలిచి ప్రశ్నించడం మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది.

ఇంకేదో వెలికితీసేందుకే..

తెలుగు సినీ ప్రముఖులకు మత్తుమందుల ముఠాలతో సంబంధం ఉన్నట్లు గతంలో దర్యాప్తు జరిపిన ఆబ్కారీశాఖ నిరూపించలేకపోయింది. ఒకవేళ మత్తుమందులు వాడినా ఇందుకోసం భారీగా చెల్లింపులేవీ జరిపే అవకాశం లేదు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్‌ మాస్కెరెన్హాస్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గతంలో ఆబ్కారీశాఖ సినీ ప్రముఖులను అనుమానితులుగా చేర్చి విచారణ జరిపింది. ఒకవేళ టాలీవుడ్‌ ప్రముఖులు మత్తుమందులు కొని ఉంటారని భావించినా లావాదేవీలు కెల్విన్‌కు, వారికి మధ్యనే ఉండాలి. కెల్విన్‌ విదేశాల నుంచి మత్తుమందులు దిగుమతి చేసి ఉంటే దానికి సంబంధించి అతనే విదేశాలకు నిధులు మళ్లించి ఉండాలి. కానీ, కెల్విన్‌ ముఠా నుంచి మత్తుమందులు కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆర్థిక లావాదేవీలు పరిశీలించడమే చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ మత్తుమందుల వ్యవహారం కాకుండా సినీ పరిశ్రమలో ఇంకా ఏమైనా నిధుల మళ్లింపు జరిగిందా? అనేదే ఈడీ అనుమానమని, దీన్ని నివృత్తి చేసుకునేందుకే మత్తుమందుల కేసును అడ్డంపెట్టుకొని విచారణ జరుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. పూరీ జగన్నాథ్‌ ఆర్థిక లావాదేవీల గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, ఆయన ఆడిటర్‌ను సైతం పిలిచి అనుమానిత లావాదేవీల గురించి అడగడం ఇందుకు బలం చేకూర్చుతోంది. సినిమాల నిర్మాణానికి అనేక మంది పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇందులో లెక్కల్లో చూపించని డబ్బు కూడా ఉండవచ్చు. దీన్ని నిర్ధారించుకునేందుకే ఇప్పుడు ఈడీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Tollywood Drugs Case: పూరీ జగన్నాథ్​పై ఈడీ ప్రశ్నల వర్షం... మళ్లీ పిలిచే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details