తెలంగాణ

telangana

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌ కొట్టివేత

By

Published : Nov 24, 2022, 3:10 PM IST

Updated : Nov 24, 2022, 4:59 PM IST

MLAs poaching case
MLAs poaching case

15:07 November 24

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌ కొట్టివేత

TRS MLAs Poaching Case updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల కస్టడీ పిటిషన్​ను అ.ని.శా. ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇదివరకే రెండ్రోజుల కస్టడీకి అనుమతించామని.. మరోసారి కస్టడీకి ఇవ్వడం కుదరని సిట్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి మరింత సమాచారం తెలుసుకోవడానికి సిట్‌ అధికారులకు ఇంతకుముందే రెండ్రోజుల అనుమతిచ్చింది. ఈనెల 10, 11 తేదీల్లో ముగ్గురి నిందితులను కస్టడీలోకి తీసుకొని సిట్‌ అధికారులు పలు విషయాలపై ప్రశ్నించారు. ఇందులో భాగంగా కొంత సమాచారం సేకరించారు. అయితే, ఆ సమాచారం సరిపోదని దర్యాప్తులో భాగంగా కొన్ని ముఖ్య విషయాలు వెల్లడయ్యాయని వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని మరో అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో నిందితులు డబ్బు ఎక్కడ్నుంచి సమీకరించాలనుకున్నారు? సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు స్వాధీనం చేసుకుని.. వాటిలోంచి కొంత సమాచారాన్ని సిట్‌ అధికారులు సేకరించారు. ఈ సమాచారానికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని ప్రశ్నించాల్సి ఉందని సిట్‌ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఇప్పటికే రెండ్రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారని నిందితుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు పూర్తిగా తప్పని.. కేవలం రాజకీయ కారణాలతోనే నిందితులపైన కేసులు నమోదు చేశారని తెలిపారు. వీరిని అనవసరంగా 25రోజులకు పైగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉంచారని.. కస్టడీకి మరోసారి అనుమతించొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వాదనలకు ఏకీభవించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. నిందితులను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించింది.

నిందితులుగా మరో నలుగురు:ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ అ.ని.శా. ప్రత్యేక కోర్టులో సిట్‌ మెమో దాఖలుచేసింది. ఇందులో బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను నాలుగో నిందితుడిగా పేర్కొంది. తుషార్‌ను అయిదో నిందితుడిగా చేర్చిన సిట్‌.. కేరళవాసి జగ్గుస్వామిని 6, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ని 7 నిందితుడిగా చేరుస్తూ సిట్‌ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, సింహయాజి, నందుల స్వర నమూనాపై ఫోరెన్సిక్.. తన నివేదికను సిట్‌కు అందించింది.

ఇవీ చదవండి:ఎమ్మెల్యేలకు ఎర కేసు: 'న్యాయవాది ప్రతాప్‌ సిట్​ విచారణకు హాజరుకావాలి'

'భారత్‌కు అప్పగింతపై సుప్రీంకోర్టుకు వెళ్తా'.. లండన్​ హైకోర్టును అనుమతి కోరిన నీరవ్‌ మోదీ

Last Updated :Nov 24, 2022, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details