తెలంగాణ

telangana

వచ్చే నెలలో గ్రూప్​-4 ప్రకటన!.. పోస్టుల భర్తీపై సీఎస్​ సమీక్ష

By

Published : May 19, 2022, 1:51 PM IST

Updated : May 20, 2022, 6:01 AM IST

CS somesh kumar review on fulfillment of Group-4 posts
గ్రూప్- 4 పోస్టుల భర్తీపై సీఎస్ సమీక్ష

13:49 May 19

గ్రూప్- 4 పోస్టుల భర్తీపై సీఎస్ సమీక్ష

గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించింది. గ్రూప్-4 కేటగిరీలో 9,168 పోస్టులను భర్తీ చేస్తామని బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చేనెలలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటన జారీకి వీలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. గురువారమిక్కడ బీఆర్‌కే భవన్‌లో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ ప్రకటనలపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ విభాగాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే అనుమతించిన వాటితో పాటు మిగతా పోస్టులకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయన్నారు.

గురుకుల నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని గురుకుల నియామక బోర్డుకు సూచించారు. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఉత్తర్వులు త్వరలోనే ప్రభుత్వం జారీచేయనున్నట్లు సీఎస్‌ వివరించారు. ఇప్పటికే గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా విభాగాధిపతులు నోటిఫికేషన్‌ జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రోస్టర్‌ విధానం అనుసరించి, రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ప్రతి ప్రతిపాదనను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోవాలన్నారు. జిల్లాస్థాయి పోస్టులు కావడంతో 33 జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంటుందని, ఈ మేరకు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ విభాగాధిపతులు నోడల్‌ అధికారులుగా వ్యవహరించాలని కోరారు. ఈనెల 29 నాటికి టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు అందించాలని, ఆలోగా ప్రతి విభాగం కమిషన్‌ నుంచి సమయం తీసుకుని ప్రతిపాదనల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో చూసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని తెలిపారు.

ఒక్కపోస్టు కూడా తగ్గడానికి వీల్లేదు...:ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను ఇప్పటికే ఆర్థికశాఖ క్రోడీకరించింది. ఈ సమాచారం ప్రకారం గ్రూప్‌-4 పోస్టులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి, ఆ ప్రతిపాదనల్ని సంబంధిత విభాగాలు ఆర్థికశాఖకు అందించాయి. తొలుత ఇచ్చిన సమాచారంతో పోల్చితే, దాదాపు 10-15 విభాగాల్లో పోస్టులు తగ్గినట్లు సీఎస్‌ గుర్తించారు. ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో విభాగాధిపతుల నుంచి వివరణ అడిగారు. ప్రభుత్వ విభాగాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోస్టులు తగ్గకూడదని, ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

పదోన్నతుల తరువాత ఖాళీలు కలపాలి:ప్రభుత్వ విభాగాల్లో ఆర్థికశాఖ అనుమతించిన జూనియర్‌ అసిస్టెంట్‌, తత్సమాన స్థాయి పోస్టులను ప్రత్యక్ష నియామకం కింద నోటిఫై చేయాలని సీఎస్‌ సూచించారు. సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడే జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలను నోటిఫై చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌ శర్మ, రజత్‌కుమార్‌, అధర్‌సిన్హా, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్‌, ఏసీబీ డీజీ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని సీఎస్ తెలిపారు. గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని ఈ నెల 29వ తేదీలోపు టీఎస్​పీఎస్సీకి అందించాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్, సమాన స్థాయి పోస్టుల ఖాళీలన్నింటి భర్తీ కోసం నోటిఫికేషన్‌లో చేర్చాలని, పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ప్రక్రియ పూర్తికి ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని శాఖల అధిపతులు ప్రత్యేకంగా దృష్టి సారించి పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:లక్షకు చేరువలో గ్రూప్‌-1 దరఖాస్తులు

Last Updated : May 20, 2022, 6:01 AM IST

ABOUT THE AUTHOR

...view details