తెలంగాణ

telangana

'మునుగోడులో ఓటర్లను కొనేందుకు తెరాస, భాజపాల ప్రయత్నాలు'

By

Published : Oct 17, 2022, 6:21 PM IST

Congress Leaders Fires on TRS and BJP Leaders: తెరాస, భాజపా నాయకులపై హస్తం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీభవన్​లో మాట్లాడిన నేతలు.. రాష్ట్రాన్ని తెరాస, దేశాన్ని భాజపా దోచుకుంటున్నాయని ఎంపీ ఉత్తమ్​కుమార్​ మండిపడ్డారు. మునుగోడులో తెరాస, భాజపా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రూ.కోట్లతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నీతీ నిజాయతీ, అభివృద్ది కోరుకునే వారంతా కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని పాల్వాయి స్రవంతి విజ్ఞప్తి చేశారు.

Congress leaders
Congress leaders

Congress Leaders Fires on TRS and BJP Leaders: మునుగోడులో అధికార బలంతో తెరాస, భాజపాలు రూ.కోట్లతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. రాష్ట్రాన్ని తెరాస, దేశాన్ని భాజపా కలిసి దోచుకుంటున్నాయని ఎంపీ ఉత్తమ్​కుమార్​ విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి మాట్లాడిన ఆయన.. తెరాస, భాజపా నేతలు సిగ్గువదిలి బరితెగిస్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం సంతోషకరమన్న ఉత్తమ్​.. తెలంగాణ డెలిగేట్లలో చాలా కొత్త పేర్లు ఉన్నాయని.. వాటిపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కొన్ని రోజులుగా మునుగోడులో తెరాస, భాజపా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. రూ.కోట్లతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రూ.కోట్ల మూటలతో రాష్ట్రానికి భాజపా నాయకులు మిడతల దండులా వస్తున్నారని మండిపడ్డారు.

నోటుకు అమ్ముడుపోకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు. ఎన్నికల సంఘం తెరాస, భాజపా ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలు ధన, అధికార బలంతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంతో సహా కేంద్రమంత్రులు సైతం తనను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆమె.. నీతీ, నిజాయతీ, అభివృద్ధి కోరుకునే వారంతా కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details