తెలంగాణ

telangana

Munugode Bypoll: తెరాస అభ్యర్థిత్వంపై వీడిన సందిగ్ధత.. కూసుకుంట్లకు బీ ఫారం అందజేత

By

Published : Oct 7, 2022, 6:28 PM IST

Updated : Oct 7, 2022, 7:55 PM IST

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిత్వంపై సందిగ్ధత వీడింది. నియోజకవర్గంలో సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయం మేరకు కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డినే అభ్యర్థిగా నిర్ణయించిన కేసీఆర్‌.. బీఫారంను అందజేశారు. టికెట్‌ ఆశించిన నేతలకు నచ్చజెప్పిన సీఎం కేసీఆర్‌.. గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అభ్యర్థిత్వంపై స్పష్టత రావటంతో ప్రచారంలో జోరును పెంచేందుకు గులాబీ దళం సిద్ధమైంది. గత ఎదురుదెబ్బలను విశ్లేషించుకుని ప్రత్యర్థులకు ఎక్కడా అవకాశమివ్వకుండా వ్యూహాలు పన్నుతోంది.

MUNUGODE BY ELECTION
MUNUGODE BY ELECTION

కూసుకుంట్లకు బీ ఫారం అందజేత.. ఎన్నికల ఖర్చు కోసం సీఎం ఎంతిచ్చారంటే..?

Munugode Bypoll: జాతీయ రాజకీయాలు, భారాస ఏర్పాటులో నిమగ్నమైన గులాబీదళం.. ఇక మునుగోడు ఉప ఎన్నికలపై దృష్టి సారించింది. జాతీయ రాజకీయాల్లోకి అడుగులు, మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నిక ప్రస్తుతం అధికార పార్టీకి సవాల్‌గా మారింది. జీహెచ్​ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితాలు నిరాశాజనకంగా రావటంతో గత ఎదురుదెబ్బలను విశ్లేషించుకుని ఈసారి ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది.

ఇందులో భాగంగానే అభ్యర్థిత్వం విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసింది. స్థానిక నేతల అభిప్రాయాలు, సర్వేల ఆధారంగా సీఎం కేసీఆర్‌ మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మునుగోడు తెరాస అభ్యర్థిగా అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం.. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రగతిభవన్​కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్‌లను కలిశారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కూసుకుంట్లకు పార్టీ బీఫారంతో పాటు ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందజేశారు.

మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే: మునుగోడులో గెలిచేది గులాబీ జెండానేనని.. భాజపా డిపాజిట్‌ కోల్పోయి మూడో స్థానంలో నిలుస్తుందని తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ ఇచ్చినందుకు. కేసీఆర్​కు రుణపడి ఉంటానని కూసుకుంట్ల పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనను నమ్మిన మునుగోడు ప్రజలను అమ్ముకొని భాజపాలో చేరారని ఆయన ధ్వజమెత్తారు. తన ఎమ్మెల్యే సీటును రాజగోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నందున మునుగోడును ప్రభుత్వం పట్టించుకోలేదని.. అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. మరి ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నది ప్రతిపక్ష పార్టీ తరఫునే కదా అని ప్రశ్నించారు.

తెరాస ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇస్తోందంటూ భాజపా దుష్ప్రచారం చేస్తోందని కూసుకుంట్ల మండిపడ్డారు. మునుగోడులో ఏ గ్రామం ఎక్కడుందో కూడా తెలియని రాజగోపాల్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. తన అభ్యర్థిత్వంపై తెరాసలో ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పారు. మునుగోడులో ప్రజలు గెలవబోతున్నారని కూసుకుంట్ల అన్నారు.

మరోవైపు ఉపఎన్నికలో కూసుకుంట్లతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్‌ సహా మరికొందరు నేతలు టికెట్‌ ఆశించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ కొందరు స్థానిక నేతలు ఏకంగా కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు సర్వేల ఆధారంగా కూసుకుంట్లనే బరిలోకి దించాలని తెరాస అధినేత నిర్ణయించారు. అసంతృప్తులు చెలరేగకుండా ఆశావహులకు నచ్చజెప్పారు. అభ్యర్థిని ప్రకటించిన వెంటనే.. బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్‌తో భేటీ అయిన కేసీఆర్ పార్టీ విజయానికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు.

ఇవీ చదవండి:మునుగోడు ఉపఎన్నిక.. ప్రచార జోరు పెంచిన భాజపా, కాంగ్రెస్

నేటి నుంచే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ప్రక్రియ

తదుపరి సీజేఐ ఎంపికపై కేంద్రం కసరత్తు.. జస్టిస్​ చంద్రచూడ్​కు అవకాశం

Last Updated : Oct 7, 2022, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details