తెలంగాణ

telangana

'రాష్ట్రంలో మాఫియా శక్తులు స్వైర విహారం'... డీజీపీకి చంద్రబాబు లేఖ

By

Published : Dec 12, 2020, 7:09 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెదేపా నేతలపై జరిగిన దాడి ఘటనపై డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి, మాఫియా శక్తులు స్వైర విహారం చేస్తున్నాయని పేర్కొన్నారు. దాడిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేసిన తమ పార్టీ నేతలను అరెస్టు చేయటమేంటని ప్రశ్నించారు.

letter
'రాష్ట్రంలో మాఫియా శక్తులు స్వైర విహారం'... డీజీపీకి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్​లో అరాచక పాలన సాగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద తెదేపా నేతలపై జరిగిన దాడి ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆయన శనివారం లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు, దౌర్జన్యాలతో వైకాపా నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, మాఫియా శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. పోలీసుల్లో ఒక వర్గం అధికార వైకాపా నాయకులతో కుమ్మక్కై వారి చెప్పుచేతల్లో పని చేయడం దురదృష్టకరమని చంద్రబాబు దుయ్యబట్టారు.

'తంబళ్లపల్లెలో వైకాపా మాఫియా ఈసారి పడగ విప్పింది. కురబలకోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీకి చెందిన తెదేపా నాయకుల వాహనాలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా వారి వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసకర దాడి అంతటితో ఆగకుండా ఒక విలేకరిపై కూడా దాడి చేసి అతని కెమెరాను లాక్కున్నారు. వైకాపా దౌర్జన్యానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అంగళ్లుకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయల్పాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు' అని చంద్రబాబు లేఖలో వివరించారు.

పోలీసులు ప్రజలకు భద్రతగా నిలవాలి..

చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఈ ప్రాంతంలో ప్రజలపై వేధింపులు, చిత్రహింసలు, హత్యల కేసులు అత్యధికం కావడం ఏ మాత్రం యాదృచ్ఛికమైనవి కావని చంద్రబాబు విమర్శించారు. ఎస్సీలపై అక్కడ జరిగిన వరుస దాడులను గమనిస్తే ఎవరికైనా తెలిసిపోతుందన్నారు. ప్రతి సంఘటనలో నిందితులు అధికార వైకాపాకు చెందినవారైతే, బాధితులంతా సామాజికంగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలవారేనన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే అసాంఘిక శక్తుల అడ్డా(డెన్)గా అధికారపార్టీ వైకాపా మారిందని ఆక్షేపించారు. ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఈ అరాచకశక్తులను ఇంకా ప్రోత్సాహిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు, దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీసు వ్యవస్థపై గల నమ్మకం పూర్తిగా నశిస్తుందన్నారు. బాధితులను పోలీసులు వేధించడం కాకుండా భద్రతగా నిలబడాలని లేఖలో చంద్రబాబు కోరారు.

ఇదీ చదవండి:పీసీసీపై ముగిసిన అభిప్రాయ సేకరణ.. అధిష్ఠానానికి నివేదిక

TAGGED:

ABOUT THE AUTHOR

...view details