తెలంగాణ

telangana

YS Viveka Murder Case : వైఎస్​ వివేకా హత్యకేసులో మళ్లీ మొదలైన విచారణ.. ఆ కోణంలో దర్యాప్తు!

By

Published : Dec 15, 2021, 5:27 PM IST

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దాదాపు నెలరోజుల తర్వాత సీబీఐ విచారణ మళ్లీ మొదలుపెట్టింది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందినభరత్ కుమార్ యాదవ్​ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

YS Viveka Murder Case
YS Viveka Murder Case

YS Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మొదలైంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. పులివెందులకు చెందిన భరత్ కుమార్ యాదవ్​ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యకేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ బంధువైన భరత్ యాదవ్​ను సీబీఐ విచారిస్తోంది.

YS Vivekananda Reddy murder case: వివేకానందరెడ్డి హత్యకేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు చేస్తూ.. గతనెల 21న భరత్ కుమార్ యాదవ్.. సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భరత్ యాదవ్​ను సీబీఐ విచారణకు పిలిచింది. అతని వద్దనున్న ఆధారాలు.. రాజశేఖర్ రెడ్డిపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనే అంశాలపై సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. ఈ కేసులో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీబీఐ అభియోగపత్రంలో..

ys viveka murder case updates: వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పాత్ర ఉందని సీబీఐ తేల్చింది. ఆ నలుగురి ప్రమేయంపై మంగళవారం పులివెందుల న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసింది. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిల నేపథ్యం, ఈ హత్య కేసులో వారి ప్రమేయానికి సంబంధించి సీబీఐ దర్యాప్తులో గుర్తించిన అంశాలు ఇలా ఉన్నాయి.

అంతమొందించేందుకు ప్రణాళిక

గజ్జల ఉమాశంకర్‌రెడ్డి:వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డి సోదరుడు ఉమాశంకర్‌రెడ్డి. ఈయనది కడప జిల్లా సుంకేశుల. పాల డెయిరీ నిర్వహిస్తుంటారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను వివేకాకు పరిచయం చేసింది ఈయనే.

సీబీఐ ఏం తేల్చిందంటే:వివేకాను అంతమొందించేందుకు సునీల్‌తో కలిసి ప్రణాళిక రూపొందించారు. ఇంటి వద్ద ఉండే కుక్కను ఉమాశంకర్‌రెడ్డి కారుతో గుద్దించి చంపేశారు. సేకరించిన శాస్త్రీయ ఆధారాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ డైరెక్టరేట్‌తోపాటు మరికొన్ని ప్రయోగశాలల్లో విశ్లేషించగా... ఈ హత్యలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర తేటతెల్లమైంది. హత్యలో శంకర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సునీల్‌ యాదవ్‌, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.

గొడ్డలిని బైక్‌ సైడ్‌ బ్యాగ్‌లో దాచిపెట్టి

యాదటి సునీల్‌ యాదవ్‌:ఈయనది పులివెందుల మండలం మోట్నూంతలపల్లె. వివేకా హత్యకు కొన్ని రోజుల ముందే ఆయనకు పరిచయమయ్యారు.

సీబీఐ దర్యాప్తు ఏం తేల్చిందంటే:ఉమాశంకర్‌రెడ్డితో కలిసి ప్రణాళిక రూపొందించారు. వివేకాను హత్య చేసిన రోజు రాత్రి ఆయన ఇంటికి చేరుకునేందుకు ఉమాశంకర్‌రెడ్డికి చెందిన పల్సర్‌ బైక్‌నే సునీల్‌ వినియోగించారు. గొడ్డలిని బైక్‌ సైడ్‌ బ్యాగ్‌లో దాచిపెట్టి, దానిపైనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. వివేకా ఇంటివద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలోనూ హత్యలో సునీల్‌ ప్రమేయం గురించి వెల్లడించారు. హత్యకు వినియోగించిన ఆయుధాలు, ఇతర నిందితుల ప్రమేయం గురించి సునీల్‌కు తెలుసు.

ఆధారాలను తుడిచేశారని...

తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో ఈయన పేరు రెండోది.

ఆరోపణలు, అభియోగాలు:‘‘వివేకా హత్య కేసు విషయంలో ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరికేస్తా’’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారంటూ వివేకా వద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న ఈ ఏడాది జులైలో ఆరోపించారు. ‘‘వివేకా హత్య తర్వాత ఘటనా స్థలంలోని రక్తపు మరకలు, ఇతర ఆధారాలన్నింటినీ తుడిచేశారు. మనోహర్‌రెడ్డి చెబితేనే ఆధారాల్ని తుడిచేశానని ఆయన గతంలో కస్టడీలో ఉన్నప్పుడు చెప్పారు. వివేకా మరణించారనే విషయం మా తల్లికి, నాకు కానీ ఫోన్‌ చేసి చెప్పలేదు. మేము లేకుండానే అంత్యక్రియలు జరిపించేందుకు ప్రయత్నించారు. గాయాల ఆనవాళ్లు కనిపించినప్పటికీ గుండెపోటుతో మరణించారంటూ చిత్రీకరించి నమ్మించేందుకు యత్నించారు.’’ అంటూ వివేకా కుమార్తె సునీత ఈయనపై అనుమానాలు వ్యక్తంచేశారు.

దిల్లీలో రెండు నెలలపాటు విచారణ

షేక్‌ దస్తగిరి:వివేకా వద్ద 2017, 2018ల్లో డ్రైవర్‌గా పనిచేశారు. హత్యకు 6నెలల ముందు మానేశారు. ఇతని ప్రమేయానికి సంబంధించి వాచ్‌మన్‌ రంగన్న వాంగ్మూలం ఇవ్వగా... ఉమాశంకర్‌రెడ్డిప్రమేయంపై ఈయన సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. 2 నెలలపాటు ఆయన్ను సీబీఐ అధికారులు దిల్లీలో విచారించారు.

ఇదీ చూడండి:ys viveka murder case: 'రెండు వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details