తెలంగాణ

telangana

Cabinet Decisions: కేబినెట్​లో కీలక నిర్ణయాలు.. ఆ శాఖలపై సుదీర్ఘ చర్చ

By

Published : Jan 18, 2022, 5:44 AM IST

Cabinet Decisions: రాష్ట్రంలో కొవిడ్‌ అదుపులో ఉందన్న ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపింది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనాకట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. గట్టు ఎత్తిపోతల అంచనాల సవరణ సహా వివిధ నీటిపారుదల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం ధాన్యంపూర్తయ్యేవరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని నిర్ణయించింది.

Cabinet Decisions
కేబినెట్​లో కీలక నిర్ణయాలు

Cabinet Decisions: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుధీర్ఘంగా సాగింది. తొమ్మిది గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని మంత్రివర్గానికి వివరించిన వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్‌రావు పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదుకోట్ల వాక్సినేషన్ డోసులు ఇచ్చినట్లు తెలిపిన మంత్రి అర్హులైన వారందరికీ అతి త్వరగా టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల సహాయం తీసుకొని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారులను..... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా కట్టడికి సహకరించాలని సీఎం ప్రజలను కోరారు.

irrigation department: నీటిపారుదలశాఖపై మంత్రివర్గంలో సుధీర్ఘ చర్చ జరిగింది. వివిధ ప్రాజెక్టుల పనులు, వాటి పురోగతిపై చర్చించి పలు ప్రాజెక్టుల పనులకు ఆమోదముద్ర వేసింది. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టుఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయాన్ని 669 కోట్ల రూపాయలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చింది. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుంచి తపాస్‌పల్లి జలాశయానికి 388.20 కోట్లతో లింక్ కాల్వ తవ్వకానికి ఆమోదం తెలిపింది. తపాస్‌పల్లి జలాశయం కింద సిద్దిపేటజిల్లాలో 1.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 44.71 కోట్లతో వనపర్తి జిల్లా బుద్దారం పెద్దచెరువు పునరుద్ధరణ పనులను ఆమోదించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన ఘన్‌పూర్ బ్రాంచి కాల్వ పనులకు 144.43 కోట్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆ కాల్వ ద్వారా ఘన్‌పూర్, అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

కేబినెట్​లో కీలక నిర్ణయాలు

మెదక్ జిల్లాలోని ఘన్‌పూర్ ఆనికట్ కాల్వలవ్యవస్థ ఆధునీకరణలో.. మిగిలిన పనులుచేపట్టేందుకు 50.32 కోట్లతో పరిపాలనా అనుమతులకు పచ్చజెండాఊపింది. ఆదిలాబాద్‌జిల్లాలో పెన్‌గంగపై నిర్మిస్తున్న చనాకా - కొరాటా ఆనకట్ట అంచనా వ్యయాన్ని 795.94 కోట్లకు సవరించింది. ఆ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని.. భీమ్‌పూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి 27.36 కోట్లతో పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది. వనపర్తి జిల్లాలో గోపాలసముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు 10

కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూర్యాపేట జిల్లాలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి, జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి 16.23 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలను ఆమోదించింది. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణ కోసం మంజీరా లిఫ్ట్‌ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. దేవాదులపథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు........ 104.92 కోట్లతో పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గండిరామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులు... గుండ్ల సాగర్ నుంచి లౌక్యతండా వరకు పైప్ లైన్ పనులు, నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

పంటనష్టంపై కేబినెట్ సమావేశంలో చర్చ

crop loss: అకాలవర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. పంటనష్టాన్ని పరిశీలించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదట నిర్ణయించారు. ఐతే తర్వాత సీఎం పర్యటన రద్దైంది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందని అకాల వర్షాలతో కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాలకు వస్తోందని అధికారులు తెలపగా మొత్తం సరకును కొనసాగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details