తెలంగాణ

telangana

భట్టి విక్రమార్క పాదయాత్ర.. 91 రోజులకు షెడ్యూల్ విడుదల

By

Published : Mar 11, 2023, 6:05 PM IST

Bhatti Vikramarka Padayatra: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా.. భట్టి విక్రమార్క తన పాదయాత్ర షెడ్యూల్​ను ప్రకటించారు. మార్చి 16 నుంచి జూన్ 15 వరకు.. 91 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్ర మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka

Bhatti Vikramarka Padayatra: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు.. 91 రోజుల పాటు, 39 మండలాల్లో 1,365 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించనున్నట్లు ప్రకటించారు. హాథ్​ సే హాథ్ జోడో అభియాన్‌ యాత్రకు కొనసాగింపుగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజార్​హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర మొదలవుతుందని వివరించారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్న సంకల్పంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఇచ్చిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ బీఆర్‌ఎస్‌ పాలనలో అవేమీ నెరవేరలేదని ఆరోపించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న ప్రజల్లో ధైర్యం నింపి అండగా నిలుస్తామని చెప్పేందుకే.. తాను పాదయాత్ర చేపడుతానని వివరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు.. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది:రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తన స్నేహితులైన క్రోనీ క్యాపిటల్ లిస్టులకు.. ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం: రాహుల్​గాంధీ ఇచ్చిన సందేశాన్ని హాథ్​ సే హాథ్ జోడో అభియాన్‌ ద్వారా ప్రతి గడపకు తీసుకువెళ్తామని భట్టి విక్రమార్క వివరించారు. కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గమని పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురావడానికి ఏఐసీసీ ఇంఛార్జ్​లు కసరత్తు చేస్తున్నారని వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎల్పీ నాయకుడిగా తెలంగాణలో పాదయాత్ర చేయడానికి సమాయత్తం అయినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

"రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్న సంకల్పంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఇచ్చింది. కానీ బీఆర్‌ఎస్‌ పాలనలో అవేమీ నెరవేరలేదు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న ప్రజల్లో ధైర్యం నింపి అండగా నిలుస్తామని చెప్పేందుకే.. పాదయాత్ర చేపడుతున్నాం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు.. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది."- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

భట్టి విక్రమార్క పాదయాత్ర.. 91 రోజులకు షెడ్యూల్ విడుదల

ఇవీ చదవండి:రాష్ట్రంలో రైతులను బాగు చేయలేని కేసీఆర్‌.. దేశంలో బాగు చేస్తారా?: రేవంత్‌రెడ్డి

చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు

హోలీ రోజు జపాన్ యువతితో అనుచిత ప్రవర్తన.. నిందితులు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details