తెలంగాణ

telangana

తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు.. ఎంతంటే!?

By

Published : Jun 13, 2022, 4:33 PM IST

International company investments in telangana: తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా-4, స్మార్ట్ గ్రీన్ మొబిలిటీ చొరవతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది.

KTR TWEET
తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు.. ఎంతంటే!?

International company investments in telangana: అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ తన సత్తాను చాటుకుంటోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా-4, స్మార్ట్ గ్రీన్ మొబిలిటీ చొరవతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలో పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఇప్పటికే ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.

250 కోట్ల పెట్టుబడులు: తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్‌లో 15 ఎకరాల రాయితీ భూమిని సైతం సంస్థకు అప్పగించింది. 2022-23 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని మేటా-4 యాజమాన్యం తెలిపింది. మెటా-4 ఈ పెట్టుబడులను వాల్ట్రీ ఎనర్జీ ద్వారా పెట్టింది. ద్విచక్ర విద్యుత్ వాహనాల తయారీ కర్మాగార విభాగం నెలకొల్పడానికి మెటా-4 రూ.250 కోట్ల పెట్టుబడి పెడుతుంది.

ప్రభుత్వంతో ఒప్పందం: ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు, ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్‌ రంజన్ సమక్షంలో వాల్ట్రీ ఎనర్జీ యాజమాన్య బృందం ఒప్పందంపై సంతకం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో.. కంపెనీని ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరి నాటికి కర్మాగారం పనిచేసే దశకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మంత్రి కేటీఆర్ హర్షం: కర్మాగారం ప్రారంభం మొదటి దశలో కనీసం 40,000 యూనిట్లను తయారు చేయాలనే లక్ష్యంతో వాల్ట్రీ ఎనర్జీ ముందుకెళ్తోంది. రాబోయే మూడేళ్లలో తయారీ సామర్థ్యం సులభంగా 1,00,000 యూనట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మెటా-4 తెలంగాణ రాష్ట్రాన్ని తమ పెట్టుబడులకు ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

2500 మందికి ఉపాధి: ఈ కర్మాగారము రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధిని, 2000 మందికి పరోక్ష ఉపాధిని కల్పించడానికి సహాయపడుతుందని మెటా-4 గ్రూప్ సీఈఓ ముజమ్మిల్ రియాజ్ పేర్కొన్నారు. వాల్ట్రీ ఎనర్జీ భారత్‌లో తయారీ ఉత్పత్తుల తదుపరి శ్రేణిని విస్తరించాలని కూడా లక్ష్యంగా చేసుకుందని వాల్ట్రీ ఎనర్జీ డైరెక్టర్ ఆదిత్య రెడ్డి తెలిపారు. తాము తయారు చేయబోయే ఉత్పత్తుల్లో బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉంటాయన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details