తెలంగాణ

telangana

AP EMPLOYEES JAC: 'ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం'

By

Published : Jan 18, 2022, 1:38 PM IST

AP EMPLOYEES JAC: పీఆర్సీ, డీఏ బకాయిలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ పీఆర్సీ, జీవోలు తమకు వద్దే వద్దని, న్యాయం చేయకపోతే.. సమ్మెకైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు.

AP EMPLOYEES JAC
AP EMPLOYEES JAC

'ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం'

AP EMPLOYEES JAC: చల్లారిందని భావించిన ఉద్యోగ సంఘాల ఆందోళన.. ఒక్కసారిగా ఎగసిపడింది. ఏపీ ముఖ్యమంత్రి భేటీతో అంతా సామరస్యమే అనుకున్న తరుణంలో.. సమరమే అని నినదించారు నేతలు. పీఆర్సీ, డీఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ పీఆర్సీ, జీవోలు తమకు వద్దే వద్దని, న్యాయం చేయకపోతే.. సమ్మెకైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు. రేపు, ఎల్లుండి నిర్వహించే సమావేశాల్లో.. నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇంకా నేతలు ఏమన్నారంటే..

రాష్ట్ర చరిత్రలోనే లేదు: బండి శ్రీనివాసరావు

ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే లేవని బండి శ్రీనివాసరావు అన్నారు. తక్కువగా ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను ఐకాసలు వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. జీవోలన్నింటినీ తిరస్కరిస్తున్నామన్న ఆయన.. ఈ పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని కుండ బద్ధలు కొట్టారు. పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ ఇస్తామనడంపైనా మండి పడ్డారు. అలాంటి పద్ధతి అవసరం లేదన్నారు. పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాకా పోరాడతామని చెప్పారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏలో కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న బండి.. దుర్మార్గమైన ప్రభుత్వ ఎత్తుగడను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్న బండి శ్రీనివాసరావు.. అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.

ఇది చీకటిరోజు: బొప్పరాజు

ప్రభుత్వం అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోలను వ్యతిరేకిస్తున్నామని బొప్పరాజు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటిరోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ, పింఛనులపై చర్చే జరగలేదన్న బొప్పరాజు.. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని ఎత్తివేస్తారా? అని సూటిగా నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వర్తింపజేస్తామన్న నిర్ణయంపై ఆగ్రహించారు. 11వ పీఆర్సీని అమలు చేస్తున్నప్పుడు కేంద్ర పీఆర్సీపై చర్చెందుకని ప్రశ్నించారు. తమకు రావాల్సిన డీఏలను అడ్డుపెట్టుకుని పీఆర్సీ ప్రకటించారన్న బొప్పరాజు.. తమకు ఇస్తున్న డబ్బుల్లోనూ కోతలు విధిస్తారా? అని ప్రశ్నించారు.

జీవోలన్నీ రద్దుచేసే వరకు పోరాడతాం..

సానుకూల నిర్ణయం వస్తుందని ఎదురుచూస్తే వ్యతిరేక జీవోలు విడుదల చేశారని బొప్పరాజు అన్నారు. ఈనెల 20న ఇరు ఐకాసల పక్షాన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తమ ఉద్యమాల ద్వారా జరగబోయే అసౌకర్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల్లో కోతలు పడుతున్నాయని అన్నారు. డీఏలతో జీతాలు పెరుగుతున్నాయని చెప్పే కుట్ర జరుగుతోందన్న నేత.. డీఏలనేవి తమ హక్కు అని బొప్పరాజు స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే.. ఉద్యమం తీవ్రమవుతుందని, పోరాటాలకు, సమ్మెలకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: AP PRC ORDERS: ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌.. డిమాండ్లు బేఖాతరు!

ABOUT THE AUTHOR

...view details