ETV Bharat / city

AP PRC ORDERS: ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌.. డిమాండ్లు బేఖాతరు!

author img

By

Published : Jan 18, 2022, 8:37 AM IST

AP PRC ORDERS, ap government
ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌.. డిమాండ్లు బేఖాతరు!

AP PRC ORDERS : ఏపీ ప్రభుత్వోద్యోగులకు జగన్‌ ప్రభుత్వం షాకిచ్చింది. పీఆర్సీలోని అంశాలపై స్పష్టత కోసం ఉద్యోగులతో చర్చలంటూనే వేతన సవరణపై ఉత్తర్వులను జారీ చేసేసింది. సోమవారం రాత్రి కొత్త పీఆర్​సీ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది.ఇంటి అద్దె భత్యం విషయంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులు హతాశులయ్యారు. ఉద్యోగసంఘాల డిమాండును ప్రభుత్వం బేఖాతరు చేసింది. అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్ .కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంటి అద్దె భత్యంలో కోత విధించింది. సీసీఏ రద్దు చేసింది. మధ్యంతర భృతి చెల్లింపుల్లోనూ కోత విధించి...డీఏ బకాయిల్లో సర్దుబాటుకు నిర్ణయం తీసుకున్నారు.

AP PRC ORDERS : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు సర్కారు షాకిచ్చింది. ఇంటి అద్దె భత్యం విషయంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులు హతాశులయ్యారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త వేతన సవరణ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది. ప్రధానంగా ఇంటి అద్దె భత్యం విషయంలో ఉద్యోగుల, ఉద్యోగసంఘాల డిమాండును బేఖాతరు చేసింది. అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్‌ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంటి అద్దె భత్యంలో కోత విధించింది.

2019 జులై నుంచి 27% మేర చెల్లించిన మధ్యంతర భృతి విషయంలోనూ ప్రభుత్వం షాకిచ్చింది. అప్పటి నుంచి ఫిట్‌మెంట్‌ 23శాతాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. దీనివల్ల అదనంగా ఇచ్చిన 4% విలువకు సమాన మొత్తాన్ని బకాయిల నుంచి మినహాయించుకోవాలని నిర్ణయించింది. పెండింగులో ఉన్న 5 డీఏలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం 18 నెలల బకాయిలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ బకాయిల నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తుంది. సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్సు) రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక నుంచి పదేళ్లకోసారే వేతన సవరణ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. పింఛనర్లకు అదనపు మొత్తం పింఛను చెల్లించే వయసునూ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేసింది. మరోవైపు 1.7.2019 నుంచి 31.12.2021 వరకు ఉద్యోగులకు, పింఛనర్లకు ఇవ్వాల్సిన 5 పెండింగు డీఏల అమలుకూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే వారికి అదనపు పింఛను లభిస్తుంది.

ఇంటి అద్దెలో ఇంత కోతా?

ప్రస్తుతం కొత్త పీఆర్సీ అమలు వల్ల తమకు వేతనాలు పెరగకపోగా.. తగ్గిపోతున్నట్లే లెక్క అని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన డీఏలు ఇప్పుడు ఇవ్వడం వల్ల కొంతమేర మొత్తం వేతనంలో పెరుగుదల కనిపిస్తుందని, అదే డీఏలన్నీ ముందే ఇస్తే ఈ పీఆర్సీలో జీతాలు తగ్గిన విషయం అందరికీ స్పష్టంగా తెలిసేదని చెబుతున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ తాజాగా ఇంటి అద్దె భత్యంలో కోత పెట్టడం వల్ల తనకు ఇంతకుముందు వచ్చే రూ.12,290 కాస్తా ఇప్పుడు రూ.7,560కు తగ్గిపోనుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పీఆర్సీ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు ఇవీ...

* సవరించిన మాస్టర్‌ స్కేలులో 32 గ్రేడులు ఉంటాయి. 2018 జులై 1 నుంచి నోషనల్‌గా కొత్త పీఆర్సీ అమలవుతుంది. 2022 జనవరి నుంచి కొత్త జీతాల్లో పీఆర్సీ అమలు ప్రభావం ఉంటుంది.

* 2022 సవరించిన వేతన స్కేళ్లు నిర్ణయించే క్రమంలో మధ్యంతర భృతిని పరిగణనలోకి తీసుకోరు.

* సచివాలయ ఉద్యోగులతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఉద్యోగులకు 16% అద్దె భత్యం, మిగిలిన అందరికీ 8% అద్దెభత్యం వర్తిస్తుంది.

* ఆటోమేటిక్‌ అడ్వాన్సుమెంట్‌ స్కీం 6, 12, 18, 24తో 30గా కొనసాగింపు

* గ్రాట్యుటీ పరిమితి రూ.16 లక్షలకు పెంపు

* ఇక రాష్ట్ర పీఆర్సీకి మంగళం. కేంద్ర ప్రభుత్వ తరహాలోనే కొత్త పీఆర్సీ.

బకాయిల చెల్లింపు ఇలా...

* 2004 తర్వాత నియమితులైన సీపీఎస్‌ ఉద్యోగులకు మధ్యంతర భృతి సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో నాలుగు సమాన త్రైమాసిక వాయిదాల్లో చెల్లిస్తారు. 2022 జూన్‌, సెప్టెంబరు, డిసెంబరు, 2023 మార్చి నెలల్లో చెల్లిస్తారు.

* అదే 2004కు ముందు ఓపీఎస్‌ విధానంలో ఉన్న ఉద్యోగులకు మధ్యంతర భృతిని సర్దుబాటు చేసిన తర్వాత బకాయిలను నాలుగు త్రైమాసికాల్లో ఉద్యోగుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాల్లో జమచేస్తారు.

* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్కేళ్ల వర్తింపు. ఆ స్కేళ్లు పేర్కొంటూ ఉత్తర్వుల విడుదల. వివిధ కేటగిరీలకు వివిధ స్కేళ్లు.

ఇదీ చదవండి: 'ఆఖరి నిమిషంలో సీఎం టూర్ రద్దు.. నేడు వరంగల్​కు మంత్రి నిరంజన్​రెడ్డి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.