తెలంగాణ

telangana

రైల్వేకి సంబంధించి కేంద్ర బడ్జేట్​లో తెలంగాణకు 4,418 కోట్లు

By

Published : Feb 4, 2023, 9:00 AM IST

Allotment of funds for various railway lines in TS: కేంద్ర బడ్జెట్‌లో రైల్వేపరంగా రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు ఏవీ మంజూరు కాలేదు. ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం నిధులు పెంచింది. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.3,045 కోట్లతో పోలిస్తే ఈసారి 45శాతం కేటాయింపులు పెంచింది. మొత్తం రూ.4,418 కోట్లు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించింది. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్​ రెండో దశకు బడ్జెట్‌లో ఏకంగా రూ.600 కోట్లు కేటాయించింది. కాజీపేటలో వ్యాగన్‌ తయారీ కర్మాగారం ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Allotment of Railway Budget to the State
రాష్ట్రానికి రైల్వే బడ్జేట్ కేటాయింపు

Allotment of funds for various railway lines in TS: కేంద్ర బడ్జెట్‌ 2023-24లో రైల్వేలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు రూ.12,824 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దిల్లీలో వెల్లడించారు. తెలంగాణకు రూ.4,418 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రానికి కేవలం 886 కోట్లు మాత్రమే కేటాయించారని ఎన్​డీఏ అధికారంలోకి వచ్చాకా ఎన్నో రెట్లు పెంచినట్లు అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఏపీలో 72, తెలంగాణలో 39 రైల్వేస్టేషన్లను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాజీపేటకు వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌, రిపేర్‌ ఫ్యాక్టరీ ఇచ్చామని, త్వరలో వ్యాగన్‌ తయారీ కర్మాగారాన్ని జత చేస్తామని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ ఎంఎంటీఎస్​ రెండోదశకు ఈ ఏడాది 600 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.

రామగుండం-మణుగూరు ప్రాజెక్టుకు రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మార్గం మొత్తం వ్యయాన్ని రైల్వేశాఖ భరించే అవకాశాలున్నాయి. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే మార్గానికి ఈసారి బడ్జెట్‌లో రూ.185 కోట్ల నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చి.. మూడో వంతు ఖర్చు భరిస్తోంది. భూసేకరణ త్వరితగతిన జరగాలని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌ మార్గానికి రూ.345 కోట్లు కేటాయించారు. మాగనూరు-కృష్ణా స్టేషన్ల మధ్య పనులు తాజాగా పూర్తయ్యాయి. మహబూబ్‌నగర్‌ నుంచి కర్ణాటక సరిహద్దు కృష్ణా వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడపడానికి అవకాశం ఏర్పడింది. భద్రాచలం రోడ్‌-కొవ్వూరు మార్గానికి 20 కోట్లు కేటాయించారు. కాజీపేట-విజయవాడ మూడో లైను కోసం రూ.337.52 కోట్లు, కాజీపేట-బల్లార్ష మూడో లైను కోసం రూ.450.86 కోట్లు కేటాయించారు. బీబీనగర్‌-గుంటూరు డబ్లింగ్‌ పనుల కోసం రూ.60 కోట్లు కేటాయించారు.

తెలంగాణలోని త్వరలో వ్యాగన్ తయారీ కర్మాగారం

కాజీపేట-హుజూరాబాద్‌-కరీంనగర్‌ ప్రతిపాదిత రైల్వేలైన్‌ని మంజూరు చేస్తారని భావించగా రైల్వే శాఖ నిరాశపరిచింది. లింగంపల్లి-వికారాబాద్‌ రెండోలైను మంజూరు కాలేదు. యాదాద్రి ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణ గురించి పట్టించుకోలేదు. ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు మూడో లైను నిర్మాణానికి రైల్వేశాఖ ప్రాధాన్యం ఇవ్వలేదు.

"ఎంఎంటీఎస్‌ రెండో దశకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు. నేను వాస్తవాలనే వివరిస్తున్నాను. ఆరోపణలు చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చితే ఎంఎంటీఎస్‌ శరవేగంగా పూర్తి అవుతుంది. ప్రధాని మోదీ రైల్వేలకు భారీగా నిధులు కేటాయించారు. జనం నాడి మోదీకి తెలుసు. రైల్వే ప్రజల జీవితంలో మార్పు తెస్తాయి. 2023-24 బడ్జెట్‌లో రూ.600 కోట్లు ఎంఎంటీఎస్‌కు కేటాయించాం. కేంద్రం వైపు నుంచి చేయాల్సింది చేస్తున్నాం. తెలంగాణ కూడా ముందుకు రావాలి." -అశ్వినీ వైష్ణవ్‌, రైల్వేశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details