తెలంగాణ

telangana

ఎయిర్‌పోర్టు మెట్రో కోసం ప్రీ బిడ్‌ సమావేశం.. హాజరైన ఇంజినీరింగ్ కన్సల్టెన్సీలు

By

Published : Dec 6, 2022, 1:10 PM IST

Airport Metro Pre Bid Meeting : శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో నిర్మాణం కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బిడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డితో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల నుంచి బిడ్‌లు స్వీకరించనున్నారు.

మెట్రో కోసం ప్రీ బిడ్‌ సమావేశం
మెట్రో కోసం ప్రీ బిడ్‌ సమావేశం

Airport Metro Pre Bid Meeting : రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.6250 కోట్ల అంచనాతో నిర్మించనున్న మెట్రో కోసం ప్రీ బిడ్‌ సమావేశం జరుగుతోంది. ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. 31 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం కోసం నేటి నుంచి ఈ నెల 13 వరకు ప్రీ బిడ్‌ల స్వీకరణ జరగనుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం జరగనుండగా.. ఈ నెల 9న రాయదుర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు.

బయో డైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. రెండో దశలో చేపట్టనున్న 31 కిలోమీటర్ల మార్గం ద్వారా ఎయిర్‌పోర్టుకు 25 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడేళ్లలో ఈ మార్గాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

తొలి దశ ప్రారంభమై ఐదేళ్లు..: మరోవైపు హైదరాబాద్ ప్రజా రవాణాను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లిన మెట్రో రైల్ తొలి దశ ప్రారంభమై ఇప్పటికి 5 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు 12 లక్షల ట్రిప్పులకు గాను 35 కోట్ల మంది ప్రయాణించారు. నాగోల్ నుంచి అమీర్ పేట్‌ వరకు 16.8 కిలోమీటర్లు, అమీర్ పేట్ నుంచి మియాపూర్ వరకు 11.3కిలో మీటర్ల మార్గాన్ని 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. 29 తేదీ నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత అమీర్‌పేట్ - ఎల్బీనగర్ వరకు 16.8 కిలోమీటర్ల మార్గాన్ని 2018 సెప్టెంబర్ 24 న అప్పటి గవర్నర్ నరసింహన్‌ ప్రారంభించారు. అమీర్ పేట్ -హైటెక్ సిటీ వరకు 8.5కిలో మీటర్ల మార్గాన్ని 2019 మార్చి 20న గవర్నర్ నరసింహన్‌ ప్రారంభించారు. హైటెక్ నుంచి రాయదుర్గం వరకు 1.5 కిలోమీటర్ల మార్గాన్ని 2019 నవంబర్ 29న మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు.

రోజుకు 4 లక్షల మంది ప్రయాణం: జేబీఎస్​ నుంచి ఎంజీబీఎస్​ వరకు 11 కిలో మీటర్ల మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ 2020 ఫిబ్రవరి 7న ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం 69.2 కిలో మీటర్ల వరకు సిటిలో మెట్రో అందుబాటులోకి వచ్చింది. 3 మెట్రో కారిడార్లలో 57 స్టేషన్ల ద్వారా మెట్రో రైళ్ల రాకపోకలు సాగుతుండగా.. రోజుకు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

ఇవీ చూడండి..

మెట్రో విస్తరణకు ముహుర్తం ఫిక్స్​.. ఎయిర్​పోర్టుకు వెళ్లే వారికి తీరనున్న కష్టాలు

'రెండో దశ మెట్రో రైలు విస్తరణ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details