తెలంగాణ

telangana

'అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతలను ఎలా నిర్మిస్తున్నారు'

By

Published : Jul 2, 2021, 6:38 PM IST

Updated : Jul 2, 2021, 8:11 PM IST

కృష్ణా నది నీటి పంపిణీలో భాగంగా తెలంగాణకు 500 టీఎంసీల నీటి వాటా రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.

agriculture minister niranjan reddy
నిరంజన్​ రెడ్డి

తెలంగాణకు 500 టీఎంసీలు కేటాయించాలి: నిరంజన్​ రెడ్డి

తెలంగాణలో కృష్ణా నదికి అత్యధికంగా 20 వేల చదరపు మైళ్ల పరివాహక ప్రాంతం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 9 వేల చదరపు మైళ్ల పరివాహక ప్రాంతం ఉందని చెప్పారు. తెలంగాణలోనే అత్యధిక ప్రాజెక్టులు, నీటి వినియోగం జరగాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలు కేటాయించారని.. అందులో రాష్ట్రానికి 500 టీఎంసీలు రావాలని పేర్కొన్నారు. గతంలో ఏపీ ప్రాజెక్టులకే అధికంగా నీటి కేటాయింపులు చేశారని మంత్రి ఆరోపించారు.

జీవో ఇచ్చినపుడే వ్యతిరేకించాం

కొత్త ప్రాజెక్టులపై ఏ రాష్ట్రమైనా అన్ని రకాల అనుమతులు పొందాలని మంత్రి నిరంజన్​ రెడ్డి చెప్పారు. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలపై జీవో ఇచ్చినప్పుడే వ్యతిరేకించామని చెప్పారు. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. కృష్ణా బేసిన్‌లోని అవసరాలు తీర్చకుండా మరో బేసిన్‌కు తరలించకూడదన్నారు. నీటి పారుదల నిపుణులు చెప్పినా ఏపీ పట్టించుకోవట్లేదని మంత్రి విమర్శించారు. తెలంగాణ భూభాగంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఎలాంటి ఆంక్షలు విధించలేదని... విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చెప్పే అధికారం బోర్డుకు లేదన్నారు. న్యాయబద్ధంగా చేస్తోన్న విద్యుత్ ఉత్పత్తిపై అభ్యంతరం చెబుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలు... తెలంగాణ కరవుతో అల్లాడుతోంటే దశాబ్దాలుగా చేసిన నీటిదోపిడీకి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

అవసరమైతే ప్రధానిని కలుస్తాం

రాజ్యాంగం, చట్టాలు, నిపుణులు చెప్పేది ఆంధ్రప్రదేశ్ నేతలకు పట్టదన్న మంత్రి... న్యాయస్థానాలు, చట్టాలను కాదని ఏపీ ఇష్టారాజ్యంగా ఏకంగా నదినే మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తోందని ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరవుతో అల్లాడుతుంటే కృష్ణా డెల్టా సాగు అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి చేయలేదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్.. రాజకీయ భిక్ష కోసం యాచించే వైఖరిని అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు కావాలా... వద్దా... భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు పూర్తి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. 18, 20 టీఎంసీల నికర జలాల కేటాయింపులున్న జూరాల, బీమా నీటి సద్వినియోగం కోసమే జోగులాంబ ఆనకట్ట, బీమా కాల్వ చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ పక్షాన ధర్మం, చట్టం, రాజ్యాంగం ఉన్నాయన్న నిరంజన్ రెడ్డి... ఇప్పటికే కేంద్ర మంత్రితో మాట్లాడిన సీఎం కేసీఆర్ అవసరమైతే ప్రధానిని కలుస్తారని చెప్పారు.

ఎట్లా తప్పవుతుంది?

'శ్రీశైలం ప్రాజెక్టు ప్రాథమికంగా విద్యుత్​ ఉత్పత్తి కోసం నిర్మించారు. 1984 నుంచి కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ శాశ్వతంగా జరగాలి. కాళేశ్వరం ప్రాజెక్టును... పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ను ఒప్పించి న్యాయబద్ధంగా నిర్మించాం. తెలంగాణ ఉద్యమం జరిగింది నీటి కోసమే. మా హక్కను వినియోగించుకుంటే ఎట్లా తప్పవుతుంది. ఏ సమస్య అయినా సమరస్యంగా పరిష్కరించుకోవాలి. కేంద్రం పట్టనట్లు ఉంది. ఇది చాలా బాధకరం. కేంద్రమే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించాలి.'

-నిరంజన్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ఇదీ చదంవండి: TS -AP water war: 'అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది'

Last Updated : Jul 2, 2021, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details