తెలంగాణ

telangana

రెండు భాగాలుగా ఆర్​ఆర్​ఆర్​.. 11 జంక్షన్లు.. 5 ట్రంపెట్​లు

By

Published : Jun 1, 2022, 6:59 AM IST

RRR Junctions: ప్రాంతీయ రింగు రోడ్డు తొలి భాగం కోసం భూమి సేకరించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్​ను 344 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా నిర్మించనున్నారు. 158.645 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. దీన్ని సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగ్​దేవ్​పూర్- చౌటుప్పల్ మీదుగా నిర్మించనున్నారు.

RRR
RRR

RRR Junctions: హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) తొలి భాగం కోసం భూమి సేకరించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను 344 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా నిర్మించనున్న విషయం తెలిసిందే. 158.645 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. దీన్ని సంగారెడ్డి- నర్సాపూర్‌-తూప్రాన్‌- గజ్వేల్‌-జగ్‌దేవ్‌పూర్‌- భువనగిరి-చౌటుప్పల్‌ మీదుగా నిర్మించనున్నారు. ఆరు నెలల్లో భూసేకరణ ప్రక్రియను తుదిదశకు తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నాయి. నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భారత్‌మాల పథకం కింద ఖర్చు చేయనుంది. ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామంటూ ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని భాజపా నాయకులు యోచిస్తున్నట్లు సమాచారం.

ట్రాఫిక్‌ రద్దీ ఆధారంగా:ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో జంక్షన్లు నిర్మించాలని నిర్ణయించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానమయ్యే చోట వీటిని నిర్మించనున్నారు. ఆయా రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ ఆధారంగా జంక్షన్లను ఎంత విస్తీర్ణంలో నిర్మించాలో ప్రతిపాదనలు రూపొందించారు. 10 జంక్షన్లు జాతీయ రహదారులపై రానుండగా, ఒకటి రాష్ట్ర రహదారిపై రానుంది. 11 జంక్షన్ల కోసం 658 నుంచి 792 ఎకరాలను సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఉత్తర భాగం ప్రారంభ ప్రాంతమైన గిర్మాపూర్‌ వద్ద, చివరి భాగమైన చౌటుప్పల్‌ వద్ద భారీస్థాయిలో జంక్షన్లను నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. అయిదు ప్రాంతాల్లో రెండేసి ట్రంపెట్‌లను నిర్మించాలని నిర్ణయించారు. రహదారులను ఒక మార్గం నుంచి మరో మార్గానికి అనుసంధానించేందుకు వేర్వేరు జంక్షన్లు నిర్మించటాన్ని సాంకేతికంగా ట్రంపెట్‌గా వ్యవహరిస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉత్తర భాగం మొదలు, చివరన ఒక ట్రంపెట్‌ను నిర్మించాలనుకుంటే 658 ఎకరాలు, రెండు ట్రంపెట్‌లు నిర్మించాలనుకుంటే 792 ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు వాటి విస్తీర్ణం ఆధారపడి ఉంటుందని సమాచారం. కేంద్రం ఆమోదం తెలిపితే గిర్మాపూర్‌, చౌటుప్పల్‌ వద్ద డబుల్‌ ట్రంపెట్‌ జంక్షన్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఒకవేళ అంగీకరించకపోతే సింగిల్‌ ట్రంపెట్‌ నిర్మిస్తారు. నాలుగు ప్రాంతాల్లో జంక్షన్‌లతోపాటు ఫ్లైఒవర్లను నిర్మించనున్నారు.

జంక్షన్లు ఎక్కడెక్కడంటే:సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్‌(హైదరాబాద్‌-పుణె జాతీయ రహదారి) వద్ద తొలి జంక్షన్‌ రానుంది. శివంపేట(హైదరాబాద్‌-నాందేడ్‌ జాతీయ రహదారి), పెద్ద చింతకుంట(హైదరాబాద్‌-మెదక్‌ జాతీయ రహదారి), ఇస్లాంపూర్‌(హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారి), నెంటూరు(తూప్రాన్‌-గజ్వేల్‌ జాతీయ రహదారి), ప్రజ్ఞాపూర్‌(హైదరాబాద్‌-మంచిర్యాల రాష్ట్ర రహదారి), పీర్లపల్లి(ప్రజ్ఞాపూర్‌-భువనగిరి జాతీయ రహదారి), దత్తాయిపల్లి(యాదాద్రి-కీసర జాతీయ రహదారి), రాయిగిరి(హైదరాబాద్‌ వరంగల్‌ జాతీయ రహదారి), రెండ్లరేపాక(భువనగిరి-నల్గొండ జాతీయ రహదారి), చౌటుప్పల్‌(హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి)పై జంక్షన్లను నిర్మించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details