ETV Bharat / state

తెలంగాణ.. ప్రగతి పథాన.. 8 ఏళ్ల ప్రస్థానంపై ప్రభుత్వ నివేదిక

author img

By

Published : Jun 1, 2022, 5:06 AM IST

సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పిస్తూ.. పెట్టుబడులు ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం సహా.. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ముందుకెళ్తున్నట్లు నివేదించింది. ఆదర్శవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దుతూ.. దేశానికే నమూనాగా రూపొందించినట్లు పేర్కొంది.

తెలంగాణ.. ప్రగతి పథాన.. 8 ఏళ్ల ప్రస్థానంపై ప్రభుత్వ నివేదిక
తెలంగాణ.. ప్రగతి పథాన.. 8 ఏళ్ల ప్రస్థానంపై ప్రభుత్వ నివేదిక

‘‘ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థికప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిరంతర ఉచిత విద్యుత్‌, రైతుబంధు, బీమా, రుణ మాఫీ వంటి వినూత్న పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయరంగం సుసంపన్నమైంది. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది. పారిశ్రామిక రంగం రాష్ట్రానికి జీవగర్రగా మారింది. విద్య, వైద్యరంగాల్లోనూ ముందంజ వేస్తోంది’ అంటూ రాష్ట్ర సర్కారు తన ఎనిమిదేళ్ల ప్రస్థానాన్ని ప్రజల ముందుంచింది. కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం ప్రగతి నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు ఇలా..

.

సంక్షేమానికి ప్రాధాన్యం

ఆసరా పథకం కింద 38 లక్షల మందికి పింఛన్లు అందిస్తోంది. 11.44 లక్షల మంది పేద వధువులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సాయం చేస్తోంది. ఆత్మగౌరవంతో జీవించేందుకు 2.81 లక్షల రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తోంది. తెల్లరేషన్‌ కార్డుపై ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ, 7.3 లక్షల మంది గొల్ల, కురుమలకు యూనిట్ల పంపిణీ, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారులు, గీత, చేనేత, రజక, నాయీ బ్రాహ్మణులు, అర్చకులు, ఇమాం, మౌజన్‌లకు ప్రభుత్వ వేతనాలు, కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ, ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పథకాలు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

సాగుకు సాయం

వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా నిరంతర ఉచిత విద్యుత్‌, రైతుబంధు, బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించడంతో పాటు గోదాముల నిర్మాణం చేపట్టింది. పంట దిగుబడుల పెంపు దిశగా అన్నదాతలను ప్రోత్సహిస్తోంది. కరోనా సమయంలో రైతులు పండించిన పలు ఉత్పత్తులను కొనుగోలు చేసింది. మొదటి దఫా రూ. లక్ష లోపు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేసిన ప్రభుత్వం రెండో దఫాలో రూ. 50 వేలను మాఫీ చేసింది.

ఇతర పట్టణాలకు ఐటీ

వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రభుత్వం ఐటీ పరిశ్రమను విస్తరింపజేస్తోంది. తెలంగాణ ఐటీ ఎగుమతుల మొత్తం విలువ రూ. 1,45,522 కోట్లు. 2020-21 గణాంకాల మేరకు కొత్తగా 46 వేల పై చిలుకు ఉద్యోగాలను ఏటేటా పెంచుతూ దాదాపు 6,28,615 మంది ఈ రంగంలో పనిచేసేందుకు దోహదపడింది.

ఉద్యోగాల వెల్లువ

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ రంగంలో 1.33 లక్షల పోస్టులు భర్తీ అయ్యాయి. పరిశ్రమలు, సేవలు, ఇతర రంగాల ద్వారా ప్రైవేటు రంగంలో ఆ సంఖ్య 25 లక్షలకు పైనే ఉంది. తాజాగా ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది.

పరిశ్రమలు, ఐటీలో మేటి..

.

ఎనిమిదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాలు పరుగులు తీశాయి. ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా నిలిచింది. అంకుర సంస్థల వేదికలైన టీహబ్‌, వీహబ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పేరెన్నికగన్న కంపెనీలైన యాపిల్‌, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తృతపరిచాయి. సేల్స్‌ఫోర్స్‌, ఉబర్‌, మైక్రాన్‌, స్టేట్‌ స్ట్రీట్‌, ఫియట్‌ క్రిజ్లర్‌, మాస్‌, ఇంటెల్‌, ప్రావిడెన్స్‌, యూబీఎస్‌, ఎంఫసిస్‌, పెప్సీ, లిగాటో, ఎఫ్‌5లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం- నాస్కామ్‌ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌హబ్‌గా హైదరాబాద్‌ నిలిచింది. నాస్కామ్‌ అంచనాల ప్రకారం జాతీయస్థాయిలో 2020-21 సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య 1.38 లక్షలు. దీని ప్రకారం.. ఐటీ రంగంలో జాతీయస్థాయిలో 33 శాతం ఉపాధి కల్పనకు తెలంగాణ భాగస్వామ్యాన్ని అందించింది. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులను సమీకరిస్తున్నారు.

ఉద్యమంలా దళితబంధు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం.. ఎస్సీల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుంది. ఉద్యమంలా సాగుతున్న ఈ పథకం రాబోయే రోజుల్లో దేశానికి దారి చూపుతుంది. ఎస్సీలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది.

ఉద్యోగుల సంక్షేమంలోనూ

ఉద్యోగుల సంక్షేమంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కంటే మెరుగైన వేతనాలు అందుతున్నాయి.

విశ్వసనీయ నగరం

హైదరాబాద్‌ విశ్వసనీయ నగరంగా రూపుదిద్దుకుంది. ఎన్నో ప్రామాణికాల్లో అత్యుత్తమ స్థానంలో ఉంది. నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. మురుగునీటి పారుదల మెరుగైంది. అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలను గణనీయంగా తగ్గించాయి.

విద్యుత్‌ వెలుగులు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించింది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, గృహ వినియోగ రంగాలకు నిరంతర విద్యుత్‌ అందుతోంది. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా వాటి రూపురేఖలు మారాయి. రహదారి వ్యవస్థ మెరుగుపడింది. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయి. పర్యాటక రంగంలోనూ తెలంగాణ పురోగమిస్తోంది.

రాష్ట్రం సస్యశ్యామలం..

.

నీటిపారుదల రంగంలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతి పెద్దదైన కాళేశ్వరం బహుళ దశల భారీ ఎత్తిపోతలను ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, దేవాదుల తదితర పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. ఒకప్పటి కరవు జిల్లా పాలమూరు పచ్చలహారంగా మారింది. నాగార్జున సాగర్‌, శ్రీరామ సాగర్‌, నిజాం సాగర్‌ తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. మిషన్‌ కాకతీయతో 46,531 చెరువులను పునరుద్ధరించగా 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. తద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. చేపల పెంపకం ఊపందుకుంది. జీవవైవిధ్యం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు, వంకల పునరుజ్జీవం కోసం రూ. 3,825 కోట్ల వ్యయంతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతోంది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తిపోతల, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం రూ.1.52 లక్షల కోట్లు వెచ్చించి.. సాగునీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచింది.

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం..

.

వైద్య, ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం మరింత అందుబాటులోకి తెచ్చింది. రాజధాని నలుమూలలా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానాలను ప్రారంభించి.. వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగనిర్ధారణ, ఆక్సిజన్‌ పడకలతో పాటు నలభై ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో గుండె శస్త్రచికిత్సల కోసం క్యాథ్‌ ల్యాబ్‌ సేవలు ప్రారంభించింది. జిల్లా ఆసుపత్రుల్లోనూ మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం గరిష్ఠ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు, ప్రసవానంతరం ఇంటికి చేర్చేందుకు 300 అమ్మఒడి వాహనాలు సేవలందిస్తున్నాయి. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, శిశువులకు ప్రతిరోజూ పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారం అందుతోంది. మాతా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 12 వేలు, ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 13 వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు, సమీక్ష సమావేశాల ద్వారా వైద్యసిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

'రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిన రాష్ట్రంగా తెలంగాణ'

రెయిన్‌ అలర్ట్‌.. రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.