తెలంగాణ

telangana

Mirchi farmers problems: మిర్చి రైతుల ఆవేదన.. తామర జాతి పురుగుతో బెంబేలు

By

Published : Dec 14, 2021, 5:04 AM IST

Mirchi Raithu problems: అప్పులు చేసి మరీ మిర్చి పంట వేశారు. దిగుబడి బాగా వస్తే.. ఆ అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డారు. కానీ తామర పురుగు వారి ఆశలను అడియాసలు చేసింది. పంట చేతికొచ్చే సమయానికి కూడా కాయలు రాకపోవడంతో మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. పురుగును అరికట్టే మార్గం కానరాక.. పండించిన పంటను తామే తీసేస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల రాకపోగా.. పంట తీసేందుకూ ఖర్చులైతున్నాయంటూ మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారు.

Mirchi Raithu problems
మిర్చి రైతుల ఆవేదన

Mirchi Raithu problems: తామర కొత్త జాతి పురుగుతో.. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు పడే గోస అంతా ఇంతా కాదు. పురుగును నిర్మూలించే మార్గం తెలియక తల్లడిల్లుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా.. మిర్చి పంటలో తామర పురుగు ఉద్ధృతంగా వచ్చేసింది. పువ్వును తినేయడంతో.. చాలా చోట్ల కాయలే లేకుండా పోతున్నాయి. తేజ, చపాటా తదితర మేలైన రకం మిర్చి పండించే రైతులదీ ఇదే గోస. కాయలు లేకపోవడం.. ఉన్నా అవి సరైన పరిమాణంలో పెరగకపోవడంతో.. నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఎన్ని పురుగు మందులు కొట్టినా ఫలితం లేకపోవడంతో.. పండించిన చేతులతోనే పంటను పెకిలించి వేస్తున్నారు. ట్రాక్టర్లతో దున్నించేస్తున్నారు.


Tamara insects in warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లక్షా 50 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 27 వేల ఎకరాల్లో పంట సాగైంది. గత ఏడాది మిర్చికి అధిక ధరలు రావడంతో ఎక్కువ శాతం మంది రైతులు.. మిర్చి పంట వైపే మొగ్గు చూపారు. లాభాలు రాకపోగా.. తామర పురుగు కారణంగా రైతులంతా మూకుమ్మడిగా నష్టపోయారు. పురుగు నిర్మూలనకు.. ఇప్పటికైనా శాస్త్రవేత్తలు, అధికారులు మార్గం చూపిస్తే.. కనీసం వచ్చే ఏడాదికైనా నష్టాలు తప్పుతాయని అంటున్నారు.

తామర జాతి పురుగుతో బెంబేలు
Kothagudem district: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు వరికి బదులుగా ఈ ఏడాది మిరప పంటను అధిక మొత్తంలో సాగు చేశారు. మిర్చి సాగులో మునుపెన్నడూ లేని విధంగా కొత్తరకం నల్ల తామర పురుగు బెడద ఎక్కువయ్యింది. సాగుదారులు లెక్కకు మించి మందు పిచికారి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సొంత భూములు ఉన్నవారి వెతలు నాణానికి ఒకవైపు అయితే.. మరోవైపు కౌలుదారులు కౌలు చెల్లించేందుకు పడే అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పంట పొలాలను పరిశీలించి తగిన పరిష్కార మార్గాల్ని సూచించాలని రైతులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details