తెలంగాణ

telangana

ENG vs NZ T20: ఇంగ్లాండ్​పై ​ ప్రతీకారం.. ఫైనల్​ చేరిన కివీస్​

By

Published : Nov 10, 2021, 11:05 PM IST

Updated : Nov 11, 2021, 1:10 AM IST

టీ20 ప్రపంచకప్​లో తొలి సెమీస్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై గెలిచింది న్యూజిలాండ్. 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

NZ vs ENG
న్యూజిలాండ్

టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్‌ గండాన్ని న్యూజిలాండ్‌ ఎట్టకేలకు దాటింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లీష్ జట్టులో చేతిలోనే కంగుతిన్న కివీస్‌ ఈ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆ జట్టుని చిత్తు చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. మోర్గాన్‌ సేన నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించి పొట్టి ప్రపంచకప్‌లో మొదటిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. డారిల్ మిచెల్ (72; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. డేవిన్ కాన్వే (46; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, లివింగ్‌ స్టోన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అదిల్ రషీద్‌ ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన మిచెల్‌కు ప్లేయర్‌ ఆఫ్ ది అవార్డ్‌ వచ్చింది.

లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లో గప్తిల్ (4), మూడో ఓవర్‌లో కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ (5) వెనుదిరగడంతో న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది. కాన్వేతో కలిసి మిచెల్ ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో పది ఓవర్లకు 58/2తో నిలిచింది కివీస్‌. దీంతో న్యూజిలాండ్‌ ఓటమి దిశగా పయనిస్తోందని అంతా భావించారు. కానీ 11 ఓవర్‌ నుంచి కివీస్‌ ఆటగాళ్లు గేర్లు మార్చి ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే లివింగ్ స్టోన్‌ వేసిన 14 ఓవర్లో కాన్వే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ఫిలిప్‌ (2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఇంగ్లాండ్‌ మళ్లీ పోటీలోకి వచ్చినట్లు కనిపించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్‌ (27; 11 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు)తో కలిసి మిచెల్‌ వీరవిహారం చేశాడు. అదిల్‌ రషీద్‌ వేసిన 18 ఓవర్లో చివరి బంతికి నీషమ్‌ పెవిలియన్‌ చేరాడు. అయితే అప్పటికి న్యూజిలాండ్‌ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. వోక్స్‌ వేసిన 19 ఓవర్‌లో మిచెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదడంతో ఒక ఓవర్‌ మిగిలుండగానే న్యూజిలాండ్ విజయతీరాలకు చేరింది.

Last Updated : Nov 11, 2021, 1:10 AM IST

ABOUT THE AUTHOR

...view details