తెలంగాణ

telangana

ప్రపంచ ఛాంపియన్​ సంచలన నిర్ణయం.. ఇకపై ఆడనంటూ..

By

Published : Jul 21, 2022, 7:16 AM IST

magnus carlsen world championship: ప్రపంచ చెస్ ఛాంపియన్ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్​సన్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న చెస్ ఛాంపియన్​షిప్​లో తాను ఆడనని తెలిపాడు.

magnus carlsen retire
మాగ్నస్‌ కార్ల్‌సన్‌

magnus carlsen world championship: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌.. చదరంగంలో అత్యున్నత టోర్నీ. పెద్ద పెద్ద క్రీడాకారులు కూడా అందులో పోటీ పడడాన్నే గౌరవంగా భావిస్తారు. ఇక అందులో టైటిల్‌ గెలిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. అలా అని ఒకసారి విజేతగా నిలిస్తే అంతటితో సంతృప్తి పడిపోరు. మళ్లీ మళ్లీ గెలవాలనే చూస్తారు. కానీ నార్వే చెస్‌ మేధావి మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మాత్రం ప్రతిసారీ తనే గెలుస్తుండడం బోర్‌ కొట్టేస్తోందట. 2013 నుంచి రికార్డు స్థాయిలో అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నెగ్గిన కార్ల్‌సన్‌.. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు.

"నాకు మరో మ్యాచ్‌ ఆడేందుకు కావాల్సిన ప్రేరణ లభించట్లేదు. కొత్తగా నేనేం సాధిస్తాననే భావన కలుగుతోంది. ఇది నాకు నచ్చట్లేదు. కొన్ని చారిత్రక కారణాల వల్ల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. కానీ నాకైతే అందులో ఆడేందుకు ఎలాంటి ఆసక్తి లేదు. అందుకే దూరం కావాలని అనుకుంటున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి నేను దూరం కావాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. భవిష్యత్తులో ఇందులోకి పునరాగమనం చేసే అవకాశాలను కొట్టిపారేయలేను. అయితే ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. నేను చెస్‌ నుంచి రిటైర్‌ కావట్లేదు. ఆటలో చురుగ్గానే ఉంటా. ఇప్పుడు గ్రాండ్‌ చెస్‌ టూర్‌ కోసం క్రొయేషియాకు వెళ్లబోతున్నా. అక్కడి నుంచి చెస్‌ ఒలింపియాడ్‌ ఆడేందుకు చెన్నైకి చేరుకుంటా. అది చాలా ఆసక్తికరమైన టోర్నీ" అని ఒక పాడ్‌కాస్ట్‌లో కార్ల్‌సన్‌ ప్రకటించాడు.

పోటీ లేకే..: 2013 నుంచి ప్రతిసారీ ఎదురే లేకుండా తనే గెలుస్తుండడంతో కార్ల్‌సన్‌కు ఈ అత్యున్నత చెస్‌ టోర్నీపై ఆసక్తి పోయినట్లుగా కనిపిస్తోంది. 2013లో విశ్వనాథన్‌ ఆనంద్‌ను ఓడించి కార్ల్‌సన్‌ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాడు. అప్పటికతడి వయసు 22 ఏళ్లే. తర్వాతి ఏడాది కూడా ఆనంద్‌ను ఓడించి రెండో టైటిల్‌ ఖాతాలో వేసుకున్న మాగ్నస్‌.. ఆపై 2016లో కర్జాకిక్‌, 2018లో కరువానా, 2021లో నెపోనియాచిలపై విజయం సాధించాడు. 2011 నుంచి ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతుండమే కాదు.. ప్రపంచ చెస్‌ చరిత్రలోనే అత్యధిక ఎలో రేటింగ్‌ (2882)ను సాధించిన ప్లేయర్‌గానూ అతను అరుదైన ఘనత అందుకున్నాడు. వచ్చే ఏడాది జరగాల్సిన తర్వాతి ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్‌ను.. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత నెపోనియాచి ఢీకొనాల్సింది. కార్ల్‌సన్‌ తప్పుకోవడంతో క్యాండిడేట్స్‌ టోర్నీ రన్నరప్‌ డింగ్‌ లిరెన్‌తో నెపోనియాచి ప్రపంచ టైటిల్‌ కోసం తలపడే అవకాశముంది.కార్ల్‌సన్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంకా తమకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదని ఫిడె వెల్లడించింది. అయితే అతనే నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని పేర్కొంది.

ఇవీ చదవండి:కోహ్లీ ఉన్న జట్టు అంటే నాకు భయం: రికీ పాంటింగ్​

8రోజుల్లో కామన్వెల్త్‌ పోటీలు.. మనోళ్లు అదరగొడతారా?

ABOUT THE AUTHOR

...view details