తెలంగాణ

telangana

WPL 2023 : ముంబయి X దిల్లీ​.. లీగ్​ తొలి విజేత ఎవరో?

By

Published : Mar 26, 2023, 7:55 AM IST

Updated : Mar 26, 2023, 11:33 AM IST

మహిళల ప్రీమియర్​ లీగ్​ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో లీగ్​ విజేత ఎవరో తేలనుంది. ఫైనల్​ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​, దిల్లీ క్యాపిటల్స్​ తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలను చూద్దాం.

wpl 2023 final match between mumbai indians delhi capitals
wpl 2023 final match between mumbai indians delhi capitals

మొట్టమొదటి మహిళ ప్రీమియర్​ లీగ్​ రసవత్తర సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్​ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు తలపడనుంది. రెండు జట్లకు స్టార్​ క్రికెటర్లు కెప్టెన్లుగా ఉండడం వల్ల ఈ ఫైనల్​ మ్యాచ్​పై మరింత ఆసక్తి పెరిగింది.

అయితే లీగ్​లో విజయ యాత్ర జోరును కొనసాగిస్తూ ట్రోఫీని చేజిక్కించుకోవాలనుకుంటున్న ముంబయికి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌ కాస్త ఆందోళన కలిగిస్తోంది. టోర్నీ ఆరంభంలో మూడు అర్ధశతకాలు సాధించిన హర్మన్‌ ప్రీత్​.. ఆ తర్వాత మ్యాచుల్లో తన ఫామ్‌ను కోల్పోయింది. యూపీ వారియర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్​లో హర్మన్‌ 14 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హర్మన్‌ను లానింగ్‌ జట్టు ఫైనల్లోనూ తక్కువ స్కోరుకు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.

కాగా, ముంబయి జట్టుకు పక్కకు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించిన దిల్లీకి కెప్టెన్‌ మెగ్​ లానింగ్‌ గొప్ప బలం అని చెప్పొచ్చు. లీగ్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మెగ్​ లానింగ్‌ 310 పరుగులతో అగ్రస్థానంలో ఉంది. ఆల్‌రౌండర్‌ మరియన్‌ కాప్‌ కూడా దిల్లీకి ప్రత్యేక బలం. అయినప్పటికీ రెండు జట్లలో ఫేవరెట్‌ను ఎంచుకోవడం కష్టమే. ఇప్పటివరకు లీగ్​లో రెండు జట్లు కూడా అద్భుతంగా ఆడాయి.

సీవర్‌పైనే మొత్తం భారం!
ముంబయి ఇండియన్స్​ జట్టు కెప్టెన్​ హర్మన్‌ప్రీత్‌ కౌర్​ పరుగుల సాధించడంలో కాస్త తడబడుతున్న నేపథ్యంలో ఫైనల్​లో మరో బ్యాటర్​ నాట్‌ సీవర్‌పై బాధ్యత పెరిగింది. ఆమె మరోసారి అద్భుతంగా ఆడాలని ముంబయి ఆశిస్తోంది. టోర్నీలో 54.40 సగటుతో 272 పరుగులు చేసిన సీవర్‌.. 10 వికెట్లు కూడా పడగొట్టి ముంబయి ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఫైనల్​లో ఆమెను అడ్డుకోవడం దిల్లీకి సవాలే! మరో ఆల్‌రౌండర్‌ హేలీ మాథ్యూస్‌ (258 పరుగులు, 13 వికెట్లు) కూడా ముంబయి జట్టులో అత్యంత కీలక ప్లేయర్‌. సైకా ఇషాక్‌ (16 వికెట్లు), వాంగ్‌ (13), అమేలియా కెర్‌ (12)లతో ముంబయి బౌలింగ్‌లో కూడా కాస్త బలంగానే కనిపిస్తోంది.

కాప్‌ చెలరేగితే ఇంకంతే!
దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఆల్‌రౌండర్‌ కాప్‌ కూడా ఫైనల్​ మ్యాచ్‌లో సత్తా చాటాలని దిల్లీ కోరుకుంటోంది. మిడిల్‌ ఓవర్లలో క్యాప్సీ పవర్‌ హిట్టింగ్‌ ఆ జట్టుకు సానుకూలాంశం. భారత స్టార్​ ప్లేయర్లు జెమీమా, షెఫాలి, శిఖా పాండే, రాధా యాదవ్‌ కూడా ఆఖరి పోరులో మెరవాలని దిల్లీ ఆశిస్తోంది. మొత్తం మీద సమవుజ్జీలుగా కనిపిస్తున్న దిల్లీ, ముంబయి మధ్య ఫైనల్‌ హోరాహోరీగా సాగడం ఖాయం.

లీగ్​ దశల్లో..
లీగ్‌ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గింది దిల్లీ. పాయింట్​ టేబుల్‌ టాపర్‌గా ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. ముంబయి కూడా 12 పాయింట్లతో దిల్లీకి సమంగా ఉన్నా.. రన్‌రేట్‌ తక్కువ ఉండడంతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఎలిమినేటర్‌ మ్యాచ్​ ఆడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో యూపీపై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది.

లీగ్‌ దశలో రెండు సార్లు తలపడ్డ ముంబయి, దిల్లీ చెరోసారి విజయం సాధించాయి. మొదట మ్యాచ్​లో దిల్లీ 9 వికెట్ల తేడాతో ముంబయిని చిత్తు చేసింది. తర్వాత మ్యాచ్​లో ముంబయి కూడా అంతే తేడాతో నెగ్గి లెక్క సరి చేసింది. ఫైనల్‌ వేదిక బ్రబౌర్న్‌ స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి నెగ్గగా.. దిల్లీ రెండు గెలిచి, ఒకటి ఓడింది.

Last Updated :Mar 26, 2023, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details