తెలంగాణ

telangana

కోహ్లీని ఇంకెప్పుడూ కెప్టెన్​గా చూడలేమా?

By

Published : Mar 8, 2022, 7:21 AM IST

Virat Kohli: ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు కొత్త సారథి ఎవరనేదానిపై ఫ్యాన్స్​లో తీవ్ర ఆసక్తి నెలకొంది. విరాట్​ కోహ్లీ జట్టు పగ్గాలను వదిలేసిన తర్వాత.. ఆ స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ ఖరారు చేయలేదు. అయితే కోహ్లీనే మరోసారి కెప్టెన్సీ చేయాలని అభిమానులు కోరుకుంటున్న తరుణంలో అందుకు అవకాశమే లేదని తెలుస్తోంది.

Virat Kohli
rcb new captain

Virat Kohli: ఐపీఎల్‌లో ఆరంభం నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతోనే ఉన్న విరాట్‌ కోహ్లీ.. వచ్చే సీజన్‌ నుంచి కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. గత సీజన్‌లోనే అతను ఆర్సీబీ పగ్గాలు వదిలేశాడు. కానీ మళ్లీ అతనికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ తిరిగి కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేదని ఆర్సీబీ మాజీ సారథి వెటోరి అభిప్రాయపడ్డాడు.

"ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీని చూస్తామని అనుకోవడం లేదు. అతను ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మళ్లీ అతడినే నాయకుణ్ని చేయాలని పట్టుబట్టడం సరికాదేమో. అది ఫలితాన్ని ఇవ్వదు. ఫ్రాంఛైజీ లేదా అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు ఒక్కసారి సారథ్యం వదిలేశాక వాళ్లను స్వేచ్ఛగా సాగనివ్వాలి. అదే సరైంది. డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసి కోహ్లీని నాయకత్వ బృందంలో భాగంగా జట్టు చూస్తుందని అనుకుంటున్నా. దినేశ్‌ కార్తీక్‌నూ అందులో చేర్చుకోవచ్చు. మూడేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాక్స్‌వెల్‌ను జట్టు జాగ్రత్తగా గమనించే అవకాశం ఉంది. గత సీజన్‌లో లాగా అతను ఫామ్‌ కొనసాగిస్తే మూడేళ్ల పాటు అతనే కెప్టెన్‌గా ఉండే ఆస్కారం ఉంది. మరోవైపు మ్యాక్సీకి బదులుగా డుప్లెసిస్‌పైనా జట్టు దృష్టి సారించే అవకాశాలను కొట్టిపారేయలేం"

- వెటోరి, ఆర్సీబీ మాజీ సారథి

కెప్టెన్సీ అనుభవం ఉన్న డుప్లెసిస్‌, దినేశ్‌ కార్తీక్‌ను మెగా వేలంలో వరుసగా రూ.7 కోట్లు, రూ.5.5 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. మరోవైపు బిగ్‌బాష్‌ లీగ్‌లో జట్టును నడిపించిన అనుభవం మ్యాక్స్‌వెల్‌కు ఉంది. మరి వీళ్లలో జట్టు ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేస్తుందో చూడాలి.

ఇదీ చూడండి:IPL 2022: కోహ్లీకి జోడీగా స్టార్‌ బ్యాటర్​!

ABOUT THE AUTHOR

...view details