తెలంగాణ

telangana

'అన్నదమ్ములే సర్వస్వం!'.. పంత్​ను కలిసిన భజ్జీ, రైనా, శ్రీశాంత్​

By

Published : Mar 26, 2023, 12:43 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్​ను హర్భజన్​ సింగ్​, సురేశ్​ రైనా, శ్రీశాంత్ కలిశారు. పంత్​తో కాసేపు సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

suresh raina sreesanth harbhajan singh met team india cricketer rishabh pant
suresh raina sreesanth harbhajan singh met team india cricketer rishabh pant

ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్.. ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్నాడు. ఇటీవలే టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ వెళ్లి పంత్​ను కలవగా.. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లు అతడిని పరామర్శించారు. భారత క్రికెట్​ జట్టు మాజీలు హర్భజన్​ సింగ్​, సురేశ్​ రైనా, శ్రీశాంత్​.. పంత్​ ఇంటికి వెళ్లి అతడితో కాసేపు సరదాగా గడిపారు. బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆనంద క్షణాలను తమ సోషల్​ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.

"సోదరత్వమే సర్వస్వం.. కుటుంబం అంటే మన హృదయం.. మా సోదరుడు రిషబ్ పంత్ చాలా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని రైనా ట్వీట్ చేశాడు. మరో మాజీ శ్రీశాంత్.. పంత్ గురించి హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశాడు. "రిషబ్​ పంత్​.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సోదరా.. ధైర్యంగా ఉండు.. స్ఫూర్తిని ఇవ్వు.. సోదరత్వమే సర్వస్వం.. వన్​ లైఫ్​.. వన్​ వరల్డ్​" అంటూ రాసుకొచ్చాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.

గాయాల కారణంగా రిషభ్‌ పంత్‌ పలు సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌-2023 సీజన్​కు దూరమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ కోసం అతడి స్థానంలో టీమ్​ఇండియా తరఫున ఆడేందుకు ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్​ను రంగంలోకి దింపారు. ఇక ఐపీఎల్‌లో ప్రమాదానికి ముందు దిల్లీ క్యాపిటల్స్​కు పంత్​ సారథ్యం వహిస్తుండగా.. అతడి స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్​ బాధ్యతలు స్వీకరించాడు. మరోవైపు రానున్న వన్డే ప్రపంచకప్​కు కూడా పంత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.

గతేడాది డిసెంబర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలైన టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ రిషభ్ పంత్‌.. ప్రస్తుతం చికిత్స పొందుతూ​ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. శస్త్రచికిత్స అనంతరం బెడ్​కే పరిమితమైన పంత్​ ఆ తర్వాత కొద్ది కొద్దిగా కోలుకోవడం ప్రారంభించాడు. స్టిక్​ సహాయంతో ఇప్పుడిప్పుడే నడవడం కూడా మొదలుపెట్టాడు. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు.

పంత్​కు దిల్లీ టీమ్​ అరుదైన గౌరవం..
మరోవైపు, ఐపీఎల్‌కు దూరమైన రిషబ్‌ పంత్‌కు దిల్లీ క్యాపిటల్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్ అరుదైన గౌరవం ఇవ్వనుంది. ఈ సీజన్‌లో పంత్‌ జెర్సీ నంబర్‌ని ఆటగాళ్ల జెర్సీలు, క్యాప్‌లపై ధరించి బరిలోకి దిగాలని దిల్లీ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా ధ్రువీకరించాడు.

"రిషభ్‌ పంత్‌ను మేం చాలా మిస్‌ అవుతున్నాం. ప్రతీ మ్యాచ్‌కు అతడు డగౌట్‌లో నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నా. ఒకవేళ అది కుదరకపోతే మాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతడిని జట్టులో భాగం చేయాలనుకుంటున్నాం. మేం అతడి జెర్సీ నంబర్‌ను మా షర్టులు (జెర్సీలు) లేదా క్యాప్‌లపై ఉంచాలనుకుంటున్నాం. పంత్‌ జట్టుతో లేకపోయినా ఎప్పటికీ అతడే మా నాయకుడు అని తెలియజేయడం కోసమే ఇదంతా చేస్తున్నాం. పంత్‌ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే సర్ఫరాజ్ ఖాన్‌ మాత్రం మా జట్టులో చేరాడు. ఈ సీజన్‌ ప్రారంభం కావడానికి ముందు మేం కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాం" అని రికీ పాంటింగ్‌ వివరించాడు.

ABOUT THE AUTHOR

...view details