తెలంగాణ

telangana

Umran Malik: అతడి వేగానికి.. పేదరికం క్లీన్‌బౌల్డ్‌

By

Published : Apr 23, 2022, 10:18 AM IST

Umran Malik: తొడుక్కోవడానికి బూట్లు కూడా లేని స్థితి నుంచి దేశంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్​గా ఘనత దక్కించుకునే స్థాయికి చేరాడు ఉమ్రాన్ మాలిక్. గుడి దగ్గర పండ్లు, కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు అతను. నేడు దేశ ప్రధాన పేసర్​ అయ్యే సత్తా ఉందని దిగ్గజాల మెప్పు పొందే స్థితికి ఎదిగాడు. ఇదీ ఉమ్రాన్ కథ!

Umran Malik
ipl 2022

Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌.. టీ20 మెగా టోర్నీ తాజా సంచలనం. 150కి.మీ.లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థులను వణికిస్తున్న ఆటగాడు. భారత ప్రధాన బౌలర్‌ అయ్యే సత్తా ఉందంటూ దిగ్గజాల మెప్పు పొందుతున్న బౌలర్‌. ఈ స్థాయికి చేరడం వెనక కఠోర తపస్సు ఉంది.

పండ్ల వ్యాపారి కొడుకు:జమ్మూలోని గుజ్జర్‌నగర్‌ శివాలయాలకు ప్రసిద్ధి. అక్కడే ఓ గుడి దగ్గర పండ్లు, కూరగాయలు అమ్ముతుంటాడు అబ్దుల్‌ మాలిక్‌. ఏ రోజు సంపాదన ఆరోజుకే సరిపోతుంది. అతడి కొడుకే ఉమ్రాన్‌ మాలిక్‌. ఇద్దరమ్మాయిల తర్వాత పుట్టడం వల్ల బాగా గారాబం చేసేవాళ్లు. దాంతో చిన్నప్పుడు బడి ఎగ్గొట్టి తిరిగేవాడు. చదువుకొమ్మని అంతా ఆ కుర్రాడ్ని తిట్టేవారు. ఇప్పుడు మాత్రం హీరోలా చూస్తున్నారు. స్థానికులంతా మావాడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 'ప్రౌడ్‌ ఆఫ్‌ ఉమ్రాన్‌ మాలిక్‌' అని వీధుల్లో బ్యానర్లు కట్టారు. ఎందుకంటే తనిప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా బంతులు విసిరే బౌలర్‌ మరి.

పది వదిలేసి..:ఉమ్రాన్‌ ఐదేళ్లకే సరదాగా బంతి, బ్యాటు పట్టుకున్నాడు. చదువుపై ధ్యాస తక్కువ. ఎప్పడు చూసినా క్రికెట్టే. ఈ మోజులో పడి పదోతరగతి మధ్యలోనే వదిలేశాడు. కన్నవాళ్లు పోరు పెట్టినా పట్టించుకోలేదు. చివరికి వాళ్లే వెనక్కి తగ్గి తనని ఆటకే వదిలేశారు. అప్పట్నుంచి టెన్నిస్‌ బంతితో నిరంతరం సాధన చేసేవాడు. జమ్మూ నగరంలో చెప్పుకోదగ్గ మైదానాల్లేవు. అయినా తారు, సిమెంట్‌ రోడ్లపైనే సాధన చేసేవాడు. మొత్తానికి 17ఏళ్ల వయసున్నప్పుడు జమ్మూకశ్మీర్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌లో చేరాడు. వినూ మన్కడ్‌ ట్రోఫీ, కూచ్‌బెహార్‌ ట్రోఫీల్లో సత్తా చూపించాడు.

కటిక పేదరికం:ఉమ్రాన్‌లోని ప్రతిభ, బౌలింగ్‌ వేగాన్ని గుర్తించింది కోచ్‌ రణ్‌ధీర్‌ మన్హాస్‌నే. తనని రోజూ మైదానానికి తీసుకెళ్లి సాధన చేయించేవాడు. అతడి బంతుల్లోని వేగానికి ఆశ్చర్యపోయి 'నువ్వు ఎప్పటికైనా భారత జట్టుకి ఆడతావు' అనేవాడు. ఆ మాటలతో తనకో లక్ష్యం ఏర్పడింది. అప్పట్నుంచి అలుపన్నదే లేదు. ఒక్కోసారి రోజుకి ఐదారు మ్యాచ్‌లు ఆడేవాడు. ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరేవాడు. 2019లో కూచ్‌బెహార్‌ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అప్పుడు తనకి కనీసం బూట్లు కూడా లేవు. స్నేహితుడివి తొడుక్కొని వెళ్లి అదరగొట్టాడు. తర్వాత చెన్నైలోని 'ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌'లో చేరాక మరింత రాటుదేలాడు. వేగంతోపాటు ఉమ్రాన్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ గాడిలో పడేలా చేశాడు భారత జట్టు మాజీ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌.

  • జస్‌ప్రీత్‌ బుమ్రాని ఆరాధిస్తాడు ఉమ్రాన్.
  • ఆట కోసం ఇష్టమైన స్వీట్లు, జంక్‌ఫుడ్‌ వదిలేశాడు.
  • హైదరాబాద్‌ జట్టు తనని రూ.4కోట్ల మొత్తానికి కొనుక్కుంది.
  • తన ఇన్‌స్టాగ్రామ్‌ 'బయో'లో 'త్వరలో ఇండియాకి ఆడబోతున్నాను' అని ఉంటుంది.

ఇదీ చూడండి:IPL 2022: 'అది సహజంగానే వస్తుంది.. నాకు నేనే ఆదర్శం'

ABOUT THE AUTHOR

...view details