తెలంగాణ

telangana

టీమ్​ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్​లో గట్టెక్కేనా..?

By

Published : Sep 25, 2022, 7:38 AM IST

India Australia T20 Series

India Australia T20 Series : టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోంది.. పొట్టి కప్పు సంగ్రామానికి సరిగ్గా నెల కూడా లేదు.. కానీ ఇప్పటికీ టీమ్‌ఇండియాను సమస్యలు వదలడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేమి. బౌలింగ్‌లో నిలకడగా వైఫల్యం జట్టు సన్నద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక సమరానికి సిద్ధమైంది భారత జట్టు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్‌ ఆదివారమే.

India Australia T20 Series : ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం అందుకు వేదిక కానుంది. తొలి టీ20లో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్‌ (ఇన్నింగ్స్‌కు ఎనిమిది ఓవర్ల చొప్పున కుదించిన)లో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. బలమైన ఆసీస్‌ కూడా విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. టీ20 ప్రపంచకప్‌ ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై సిరీస్‌ నెగ్గితే అది టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.

.

ఈ సమస్యలు..: సిరీస్‌ అవకాశాలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంతితో అక్షర్‌, బ్యాట్‌తో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సత్తా చాటారు. వాళ్లిద్దరు జోరందుకోవడం ఉత్సాహపరిచే అంశమే కానీ.. ఇంకా సమస్యలు చాలానే ఉన్నాయి. టాప్‌ఆర్డర్‌లో నిలకడ లోపించింది. రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లి త్రయం కలిసికట్టుగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. ఒక మ్యాచ్‌లో మెరిసిన ఆటగాడు.. మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. సూర్యకుమార్‌, హార్దిక్‌లదీ అదే పరిస్థితి. లెగ్‌స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో భారత బ్యాటర్ల బలహీనత కొనసాగుతోంది. దీన్ని ఆసీస్‌ స్పిన్నర్‌ జంపా సొమ్ము చేసుకుంటున్నాడు.

.

గత మ్యాచ్‌లో అదనపు బ్యాటర్‌గా పంత్‌ను జట్టులోకి తీసుకున్న టీమ్‌ఇండియా.. హార్దిక్‌ మినహా నలుగురు ప్రధాన బౌలర్లతోనే ఆడింది. అది ఎనిమిది ఓవర్ల మ్యాచ్‌ కావడంతో ఇబ్బంది కలగలేదు. కానీ మూడో టీ20లో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్‌ కసరత్తు చేయాల్సి ఉంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో బౌలింగ్‌ సమస్యగా మారింది. తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్‌, రెండో టీ20లో హర్షల్‌ పటేల్‌.. ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.

.

గాయం నుంచి కోలుకున్న హర్షల్‌ ఇంకా కుదురుకోలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఆరు ఓవర్లలో 13.50 ఎకానమీతో 81 పరుగులు సమర్పించుకున్నాడు. తన బౌలింగ్‌ వైవిధ్యంతో చివరి ఓవర్ల స్పెషలిస్ట్‌ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతను పుంజుకోవడం జట్టుకు అవసరం. స్పిన్నర్‌ చాహల్‌ కూడా తేలిపోతున్నాడు. పునరాగమనంలో ఉత్సాహంగా కనిపించిన బుమ్రా లయ అందుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో జట్టు అయిదుగురు ప్రధాన బౌలర్లను ఆడించొచ్చు. పంత్‌ స్థానంలో మళ్లీ భువనేశ్వర్‌ వచ్చే అవకాశముంది. చాహల్‌కు బదులు అశ్విన్‌కు ఛాన్స్‌ ఇవ్వొచ్చు.

.

వేడ్‌తో జాగ్రత్త..: ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ భారత్‌కు ప్రమాదకరంగా పరిణమించాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అతను.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ మెరుపు ఇన్నింగ్స్‌ (21 బంతుల్లో 45, 20 బంతుల్లో 43)లు ఆడాడు. భారత బౌలర్లు అతణ్ని ఎంత త్వరగా పెవిలియన్‌ చేరిస్తే అంత మంచిది. ఇక గత మ్యాచ్‌లో కెప్టెన్‌ ఫించ్‌ కూడా ఫామ్‌ అందుకున్నట్లు కనిపించాడు. ఆసీస్‌కూ పేస్‌ బౌలింగ్‌లోనే సమస్యలున్నాయి. గాయంతో ఎలిస్‌ దూరమవడం, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌, సామ్స్‌ విఫలమవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఈ మ్యాచ్‌కు ఎలిస్‌ అందుబాటులో ఉండే అవకాశముంది. బౌలింగ్‌లో జంపాతో మన బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలి. విధ్వంసక హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ను అదుపు చేయకపోతే కష్టమే.

జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌/అశ్విన్‌
ఆస్ట్రేలియా: ఫించ్‌, గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇంగ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌, వేడ్‌, కమిన్స్‌, నాథన్‌ ఎలీస్‌/అబాట్‌, జంపా, హేజిల్‌వుడ్‌

పిచ్‌ ఎలా ఉంది?
ఉప్పల్‌ స్టేడియంలో చివరిగా 2019, డిసెంబర్‌ 6న జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఆ టీ20 మ్యాచ్‌లో మొదట వెస్టిండీస్‌ 207/5 స్కోరు చేస్తే.. అనంతరం టీమ్‌ఇండియా 209/4తో గెలిచింది. ఆ తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. ఈ సారి కూడా పిచ్‌ బ్యాటింగ్‌కే ఎక్కువగా సహకరించే అవకాశముంది. పిచ్‌పై గడ్డి కనిపించడం లేదు. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. పెద్దగా వర్షం పడే సూచనలు లేవు.
20
ఓ క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్‌ రికార్డును భారత్‌ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే 21 విజయాలతో చరిత్ర సృష్టిస్తుంది. గతేడాది పాక్‌ 20 మ్యాచ్‌ల్లో గెలిచింది.

3
ఉప్పల్‌ స్టేడియంలో ఇది మూడో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. 2017లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. 2019లో వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది.

75.87
ఉప్పల్‌ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి నమోదు చేసిన సగటు. మూడు ఫార్మాట్లలో కలిపి 8 మ్యాచ్‌ల్లో అతను 607 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి:జులన్​కు ఘనంగా వీడ్కోలు.. ఇంగ్లాండ్​ సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేసిన భారత్​

హైదరాబాద్​లో టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ సందడి.. హోటళ్లకు చేరుకున్న ఆటగాళ్లు

ABOUT THE AUTHOR

...view details