తెలంగాణ

telangana

ఆ రికార్డుకు సమయం పడుతుంది: ఇషాంత్​

By

Published : Feb 23, 2021, 6:29 AM IST

Updated : Feb 23, 2021, 6:44 AM IST

అతడి గణాంకాలు అంత గొప్పగా ఉండకపోవచ్చు! అతడి పేరిట చెప్పుకోదగ్గ రికార్డులు లేకపోవచ్చు! భారత క్రికెట్‌ చరిత్రలో ఉత్తమ ఫాస్ట్‌బౌలర్ల గురించి మాట్లాడుకున్నపుడు అతడి ప్రస్తావన రాకపోవచ్చు! కానీ ఇషాంత్‌ శర్మ భారత క్రికెట్‌కు చేసిన సేవల్ని మాత్రం తక్కువ చేయలేం. కపిల్‌ దేవ్‌ తర్వాత వంద టెస్టులు ఆడిన భారత ఫాస్ట్‌బౌలర్‌గా ఇషాంత్‌ అరుదైన ఘనత అందుకోబోతుండటం వెనుక అతడి ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు.

Ishant on '100': It was important that I understood captain's psyche than other way round
ఇషాంత్​ శర్మ

అది 2007.. బెంగళూరులో పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌. అప్పటికి ఒక్క టెస్టు మాత్రమే ఆడి, అందులో ఒక్క వికెట్‌ మాత్రమే తీసిన కుర్ర ఫాస్ట్‌బౌలర్‌ ఎంతో ఒత్తిడి మధ్య మైదానంలోకి అడుగు పెట్టాడు. స్పిన్నర్ల స్వర్గధామం అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆ కుర్రాడు.. తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత అతడికి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం దక్కింది. పెర్త్‌లో రెండో టెస్టులో అప్పటికి ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరున్న రికీ పాంటింగ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఔట్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. తర్వాత నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వస్తే.. రికీని రెండు టెస్టుల్లో నాలుగుసార్లు ఔట్‌ చేసి ఔరా అనిపించాడు.

ఇలా కెరీర్‌ ఆరంభంలోనే తనపై అంచనాల్ని భారీగా పెంచేసిన ఆ ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ అని అభిమానులకు అర్థమయ్యే ఉంటుంది. అయితే తర్వాతి రోజుల్లో ఆ అంచనాల్ని అందుకోవడంలో ఇషాంత్‌ విఫలమయ్యాడు. ఆరున్నర అడుగుల పొడగరి అయిన ఈ దిల్లీ బౌలర్‌.. బంతి నుంచి బౌన్స్‌ రాబట్టడం, నిలకడగా మంచి వేగంతో బంతులేయడంలో నేర్పరే. కానీ బౌలింగ్‌లో వైవిధ్యం లేకపోవడం వల్ల, పేస్‌కు అనుకూలంగా లేని పిచ్‌ల మీద పెద్దగా ప్రభావం చూపలేని బలహీనత వల్ల ఇషాంత్‌ క్రమంగా ప్రభ కోల్పోయాడు. దీనికి తోడు గాయాలు ఇషాంత్‌ కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టాయి. విదేశాల్లో పేస్‌ పిచ్‌లపై ఆడాల్సినపుడు మాత్రమే ఇషాంత్‌కు ప్రాధాన్యం దక్కేది.

అయితే టెస్టుల్లో ఓపిగ్గా సుదీర్ఘ స్పెల్స్‌ వేయడంలో ఇషాంత్‌కున్న సామర్థ్యం అతడి కాలంలో మరే ఫాస్ట్‌బౌలర్‌కూ లేదనడంలో అతిశయోక్తి లేదు. పేస్‌ పిచ్‌లపై కొన్ని మెరుపు ప్రదర్శనలతోనూ ఇషాంత్‌ తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు.

రిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు పోవడం వల్ల నాకు మంచే జరిగింది. ఓ క్రీడాకారుడు ఖాళీ దొరికితే ఏం చేస్తాడు. సాధనలో మునిగిపోతాడు. నేనూ అదే చేశా. టెస్టు క్రికెట్లో మెరుగు పడేందుకు అది ఉపయోగపడింది. అందువల్లే నేను వందో టెస్టు ఆడగలుగుతున్నానేమో. వన్డేలు, టీ20లు ఆడుతుంటే ఈ మైలురాయిని అందుకోవడం ఆలస్యమయ్యేది. కపిల్‌ దేవ్‌ 131 టెస్టుల ఘనతను అధిగమించాలంటే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి నా దృష్టంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మీదే. నా దృష్టిలో ఇది ప్రపంచకప్‌ గెలవడం లాంటిదే. ఆటకు అవసరమైన తీవ్రత చూపించగలిగినన్ని రోజులు భారత్‌కు ఆడతాను. ప్రస్తుత బౌలర్లలో నా తర్వాత పేస్‌ దళాన్ని నడిపించగల సత్తా బుమ్రాకే ఉంది. అతను భారత్‌కు చాలా మ్యాచ్‌లు ఆడగలడు.

- ఇషాంత్‌ శర్మ

అతను మారాడు..

99 టెస్టులు.. 302 వికెట్లు.. 32.22 సగటు.. ఇదీ ఇషాంత్‌ ప్రదర్శన. ఇవేమంత గొప్ప గణాంకాలు కావు. వంద టెస్టులాడిన బౌలర్లు పడగొట్టిన వికెట్ల జాబితా తీస్తే.. ఇషాంత్‌ స్థానం చిట్టచివరన ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే గత కొన్నేళ్లలో ఇషాంత్‌ ప్రదర్శన ఎంతో మారింది. ఇషాంత్‌ టెస్టు కెరీర్‌ను మూడు భాగాలుగా విభజించి చూస్తే.. తొలి 33 టెస్టుల్లో అతడి సగటు 32.6. సాధారణంగా సాగిన కెరీర్‌ మధ్య దశలో 33 టెస్టుల్లో 41.34 సగటు నమోదు చేశాడు. అయితే చివరి 33 టెస్టుల్లో ఆశ్చర్యకరంగా ఇషాంత్‌ సగటు 23.42 కావడం విశేషం. 2016 నుంచి ఇషాంత్‌ 22.91 సగటుతో వికెట్లు తీస్తుండటం గమనార్హం.

2018 ఆరంభం నుంచి చూస్తే ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్‌ ఫాస్ట్‌బౌలర్‌ కమిన్స్‌ కంటే మెరుగ్గా ఇషాంత్‌ సగటు 19.34గా ఉండటం విశేషం. ఈ కాలంలో ఆడిన 20 టెస్టుల్లో అతను 76 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌ వందో టెస్టు.. ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టేడియంగా అవతరించబోతున్న మొతేరాలో, అది కూడా గులాబి బంతితో జరగనుండటం విశేషం. ఈ డేనైట్‌ టెస్టులో పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఇషాంత్‌ చక్కటి ప్రదర్శనతో తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకుంటాడేమో చూడాలి.

ఇదీ చూడండి:15 ఏళ్ల తర్వాత శ్రీశాంత్​ 5 వికెట్ల ఘనత

Last Updated :Feb 23, 2021, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details