తెలంగాణ

telangana

పాక్​పై ఇంగ్లాండ్​ చిరస్మరణీయ విజయం.. జీవం లేని పిచ్​పై ఫలితం!

By

Published : Dec 6, 2022, 6:59 AM IST

Updated : Dec 6, 2022, 9:55 AM IST

సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్​దే పై చేయిగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్​లో బంతితో ప్రత్యర్థిని చుట్టేసిన ఇంగ్లీష్​ జట్టు 74 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

england vs pakistan first test
england vs pakistan first test

Eng Vs Pak Test : ఇంగ్లాండ్‌ సాధించింది! పరుగులు వరదలా పారిన జీవం లేని రావల్పిండి పిచ్‌పై ఫలితాన్ని రాబట్టి ఔరా అనిపించింది. పాకిస్థాన్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి త్వరగా డిక్లేర్‌ చేసి సాహసం చేసిన ఇంగ్లిష్‌ జట్టు.. సోమవారం బంతితో ప్రత్యర్థిని చుట్టేసి 74 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అండర్సన్‌ (4/36), రాబిన్సన్‌ (4/50) గెలుపులో కీలకమయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

343 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 80/2తో ఆఖరి రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ 268కే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఇమాముల్‌ హక్‌ (48) త్వరగా ఔటైనా.. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ షకీల్‌ (76) పోరాడాడు. అతడికి తోడు అజహర్‌ అలీ (40), రిజ్వాన్‌ (46) నిలవడంతో ఒక దశలో పాక్‌ 176/3తో మెరుగ్గానే కనిపించింది. అయితే తక్కువ వ్యవధిలో రిజ్వాన్‌, షకీల్‌, అజహర్‌ ఔట్‌ కావడంతో పాక్‌ పోరాటానికి తెరపడింది.

సల్మాన్‌ (30) నిలిచినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. పాకిస్థాన్‌ తన చివరి 7 వికెట్లను 92 పరుగులకే చేజార్చుకుంది. అండర్సన్‌, రాబిన్సన్‌ ఆ జట్టు పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 657 పరుగులు చేయగా.. పాక్‌ 579 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్‌ 264/7 వద్ద డిక్లేర్‌ చేసింది.

లివింగ్‌స్టోన్‌ ఔట్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లిమ్‌ లివింగ్‌స్టోన్‌ పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో కుడి మోకాలికి గాయం కావడంతో మిగిలిన రెండు టెస్టులకు అందుబాటులో లేకుండాపోయాడు. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన 29 ఏళ్ల లివింగ్‌స్టోన్‌ ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌లో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు.

Last Updated : Dec 6, 2022, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details