తెలంగాణ

telangana

రవిశాస్త్రి సేవలు అందుకోసం వాడుకుంటాం: దాదా

By

Published : Nov 1, 2019, 6:46 AM IST

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరభ్​ గంగూలీ... తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి గురించి మాట్లాడాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు రవిశాస్త్రి సేవలు వాడుకుంటామని దాదా చెప్పాడు.

టీమిండియా కోచ్​ రవిశాస్త్రిపై తొలిసారి దాదా మాటలు

భారత క్రికెట్​ జట్టు కోచ్‌గా ఉన్నంత వరకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు రవిశాస్త్రి సేవలు వాడుకుంటామన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. టీమిండియా, ఎన్‌సీఏ మధ్య సమన్వయం సృష్టించేందుకు ఆయన రెండు విధాలుగా ఉపయోగపడతాడని దాదా భావిస్తున్నాడు. భారత క్రికెట్​ బోర్డు అత్యున్నత పదవి అధిరోహించిన తర్వాత తొలిసారి రవిశాస్త్రి గురించి మాట్లాడాడు గంగూలీ.

" రవి కోచ్‌గా ఉన్నంత వరకు ఎన్‌సీఏకు మరింత సహకారం అందించేలా ఒక వ్యవస్థను సృష్టిస్తున్నాం. ఎన్‌సీఏను అత్యద్భుత కేంద్రంగా మార్చాలని అనుకుంటున్నాం. మాకిప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌, పరాస్‌ మహంబ్రే, భరత్‌ అరుణ్‌ సైతం ఉన్నారు"

--సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

రవిశాస్త్రి 2021 వరకు టీమిండియా కోచ్‌గా పనిచేయనున్నాడు. జాతీయ జట్టు సేవల కోసమే ఆయనకు ఏటా రూ.10 కోట్లను పారితోషికంగా చెల్లిస్తున్నారు.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బీసీసీఐ కొత్తగా ఎన్‌సీఏను నిర్మించనుంది. దీని కోసం కర్ణాటక ప్రభుత్వం ఇంతకుముందు 40 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలాన్ని పరిశీలించినగంగూలీ... నూతన జాతీయ అకాడమీ గురించిన ప్రణాళిక, విధి విధానాలపై ద్రవిడ్​తో​ చర్చించినట్లు చెప్పాడు. ఆయనతో సమావేశం దాదాపు రెండు గంటలు సాగిందని వెల్లడించాడు. అంతేకాకుండా ఎన్‌సీఏ మెరుగుదల, దేశంలో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను వెలుగులోకి తేవడం, సానబెట్టడం కోసం ఏం చేయాలనేదానిపై చర్చించినట్లు చెప్పాడు.

బీసీసీఐ అధ్యక్షుడైన వెంటనే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న గంగూలీ.. ఇటీవలే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వన్డే వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలను కలిశాడు. డేనైట్​ టెస్టు మ్యాచ్​కు వారిని ఒప్పించాడు. తొలిసారి టీమిండియా గులాబి బంతితో మ్యాచ్​ ఆడేలా బంగ్లాను ఒప్పించడంలో దాదా కీలకపాత్ర పోషించాడు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details