తెలంగాణ

telangana

బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆర్సీబీ బౌలర్​ వినూత్న రనౌట్​

By

Published : Jan 19, 2020, 7:37 AM IST

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్​బాష్​ లీగ్​లో దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​, ఐపీఎల్​లో ఆర్సీబీ ఆటగాడు క్రిస్​ మోరిస్​ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ఫుట్​బాల్​ నైపుణ్యాన్ని క్రికెట్​లో ఉపయోగించి ప్రత్యర్థి బ్యాట్స్​మన్​ను ఔట్​ చేశాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

Chris Morris showed his football skills
క్రికెట్‌లో ఫుట్‌బాల్‌ ఆడి.. వికెట్‌ తీశాడు

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాడు క్రిస్‌మోరిస్‌ వినూత్న రీతిలో వికెట్‌ తీశాడు. ఫుట్‌బాల్ తరహాలో బంతిని తన్ని పరుగు తీసేందుకు ప్రయత్నించిన బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేశాడు.

శనివారం సిడ్నీ సిక్సర్స్-సిడ్నీ థండర్స్‌ జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. సిక్సర్స్‌ జట్టు బ్యాటింగ్‌ ఆరంభించగా థండర్స్‌ జట్టు క్రిస్‌ మోరిస్‌కు బంతినిచ్చింది. తొలి ఓవర్‌ వేసిన మోరిస్‌.. ఓపెనర్‌ డానియల్‌ హ్యూస్‌ను విచిత్రంగా ఔట్‌ చేశాడు. పేసర్​ మోరిస్​ వేసిన బంతిని వికెట్ల వద్దే ఆడిన హ్యూస్‌.. పరుగు కోసం యత్నించగా వెంటనే అప్రమత్తమైన బౌలర్​ బంతి వద్దకు పరుగెత్తి ఫుట్‌బాల్‌ని తన్నినట్టు బంతి వికెట్ల వైపు తన్నాడు.

మోరిస్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల హ్యూస్‌ ఔటయ్యాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగానే నెట్టింట వైరల్​గా మారింది. ఆర్సీబీ ఆటగాడు మోరిస్‌ వైవిధ్యం చూసిన ఆ జట్టు అభిమానులు... ఈసారి కోహ్లీ జట్టుకు కప్పు ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.

డీఎల్​ఎస్​తో ఫలితం...

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన థండర్స్‌.. సిక్సర్స్‌ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే తొలి రెండు ఓవర్లలోనే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం 26 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బెన్‌ డ్వార్షిస్‌, జస్టిన్‌ అవెన్‌డానో బాధ్యతాయుతంగా ఆడి ఏడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం జోడించారు. చివరికి సిడ్నీ సిక్సర్స్‌ 76 పరుగులకు ఆలౌటవ్వగా.. లక్ష్య ఛేదనలో 5.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 28 రన్స్​ సాధించింది. అయితే డక్​వర్త్​ లూయిస్ (డీఎల్ఆ​ఎస్​) ఆధారంగా థండర్స్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన మోరిస్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్నాడు.

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ఈసారి ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున ఆడనున్నాడు. డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో బెంగళూరు జట్టు అతడిని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details