తెలంగాణ

telangana

ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

By

Published : Feb 2, 2020, 4:38 PM IST

Updated : Feb 28, 2020, 9:48 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతోన్న ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. చివరిదైన ఐదో టీ20లోను గెలిచి 5-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, రాహుల్​కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్​ అవార్డు లభించింది.

New Zealand
New Zealand

మౌంట్ మాంగనుయ్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​లో టీమిండియా మరో విజయం ఖాతాలో వేసుకుంది. చివరిదైన ఐదో టీ20లోనూ కివీస్​కు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రాహుల్ 45 పరుగులతో రాణించాడు.

అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ తడబడుతూ ఆరంభించింది. గప్తిల్ (2), మున్రో (15), బ్రూస్(0) నిరాశపర్చగా 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన టేలర్, సీఫెర్ట్​లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

శివం దూబే చెత్త రికార్డు

శివం దూబే వేసిన 10వ ఓవర్లో ఏకంగా 34 పరుగులు పిండుకున్నారు టేలర్, సీఫెర్ట్. ఈ ఓవర్లో నాలుగు సిక్సులు, రెండు పోర్లూ వచ్చాయి. ఫలితంగా టీ20ల్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారతీయ ఆటగాడిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు దూబే.

జోరుమీదున్న సీఫెర్ట్​ (50), రాస్ టేలర్ (53)ను నవదీప్ సైనీ పెవిలియన్ పంపి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత కివీస్ ఏ దశలోనూ కోలుకోలేదు. చివరి ఓవర్లో సోధి రెండు సిక్సులు కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసి ఓటమిపాలైంది న్యూజిలాండ్. 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్​ను క్లీన్ స్వీప్ చేసింది.

భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో సత్తాచాటగా, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. మూడు వికెట్లతో రాణించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేసిన రాహుల్​కు మ్యాన్ ఆఫ్ సిరీస్​ లభించాయి.

మరోసారి రోహిత్-రాహుల్ షో

టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన భారత్​ ఆరంభంలోనే ఓపెనర్ శాంసన్(2) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రాహుల్-రోహిత్ జోడీ.. రెండో వికెట్​కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఔటయ్యాడు. కోహ్లీ విశ్రాంతి కారణంగా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ మరోసారి అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో గాయం కారణంగా 60 పరుగులు చేసి రిటైర్డ్​హర్ట్​గా వెనుదిరిగాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో శ్రేయస్ అయ్యర్ 33, మనీశ్ పాండే 11, శివమ్ దూబే 5 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కుగ్లిజన్ 2, బెన్నెట్​ ఓ వికెట్ తీశారు.

ఛాంపియన్స్

ఇవీ చూడండి.. దూబే ఖాతాలో చెత్త రికార్డు.. ఓవర్​లో 34 రన్స్​

Last Updated : Feb 28, 2020, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details