తెలంగాణ

telangana

సన్​రైజర్స్ జట్టులో వివక్ష లేదు: ఇర్ఫాన్

By

Published : Jun 13, 2020, 8:08 PM IST

వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామీ ఐపీఎల్​లో ఆడేటప్పుడు జాతివివక్షను ఎదుర్కొన్నానని ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు అప్పటి సన్​రైజర్స్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్.

Irfan Pathan
ఇర్ఫాన్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడేటప్పుడు జాతివివక్ష ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ మాజీ సారథి డారెన్‌ సామీ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, ఒకప్పటి సన్​రైజర్స్ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. అప్పట్లో విండీస్‌ క్రికెటర్‌ ఈ విషయాన్ని జట్టు దృష్టికి తీసుకురాలేదని చెప్పాడు. తాజాగా మహ్మద్‌ షమీతో కలిసి సలాం క్రికెట్‌ 2020 కార్యక్రమంలో పాల్గొన్న పఠాన్‌.. సన్‌రైజర్స్‌ జట్టులో జాతివిద్వేషాలు లేవని తెలిపాడు.

సామీ, ఇషాంత్‌ శర్మ అప్పట్లో మంచి స్నేహితులుగా ఉండేవాళ్లని, ఇతర ఆటగాళ్లు కూడా స్నేహపూర్వకంగానే మెలిగేవారని అప్పటి సన్‌రైజర్స్‌ బౌలర్‌ షమీ గుర్తుచేసుకున్నాడు. విండీస్‌ క్రికెటర్‌ ఒక్కోసారి బిర్యానీ కోసం తన గదికి కూడా వచ్చేవాడని పఠాన్‌ అన్నాడు.

సామీ సోమవారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేసి.. 2013, 2014 సీజన్లలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడేటప్పుడు తనతో పాటు శ్రీలంక క్రికెటర్‌ తిసారా పెరెరాను సహచర ఆటగాళ్లు కొందరు 'కాలు' అని పిలిచేవారని చెప్పాడు. తనకు అప్పట్లో దాని అర్థం తెలియకపోవడం వల్ల పట్టించుకోలేదని, ఇటీవలే అది జాతివివక్షకు సంబంధించిన పదమని తెలిసిందన్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం ఆ వ్యాఖ్య ఇషాంత్ చేసినట్లుగా ఓ పోస్టు నెట్టింట ప్రత్యక్షమైంది. తాజాగా తనని అలా పిలిచిన వారిలో ఒకరితో మాట్లాడానని, ప్రేమ పూర్వకంగానే అలా పిలిచారని తనతో చెప్పినట్లు వివరించాడు సామీ. అతడిపై పూర్తి నమ్మకముందన్నాడు. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదాస్పద అంశానికి తెరపడింది.

ABOUT THE AUTHOR

...view details