బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా నేడు మెల్బోర్న్ స్టార్స్-సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఓ హిట్ వికెట్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ బంతిని తప్పించుకునే క్రమంలో వికెట్లను చేతితో పడగొట్టాడు. అయితే థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. ఎవరైనా బ్యాట్స్‌మన్ వికెట్లను తాకి బెయిల్స్ పడితే హిట్ వికెట్‌గా ప్రకటిస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో ప్రకటించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ జరిగింది...!
మెల్బోర్న్ స్టార్స్ బౌలర్ హరిస్ రాఫ్ బౌన్సర్ సంధించగా... దాన్ని స్మిత్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే స్మిత్ అదుపు తప్పి వికెట్లపైకి వెళ్లాడు. వెంటనే బెయిల్స్ కిందిపడిపోయాయి. అప్పటికి ఇంకా ఆ స్టార్ ప్లేయర్ పరుగుల ఖాతా తెరవలేదు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్లు ఔట్‌పై థర్డ్ అంపైర్‌ను సంప్రదించగా అది నాటౌట్‌గా తేల్చాడు. స్మిత్ వికెట్లను తాకడానికి కంటే ముందుగానే గాలి కారణంగా బెయిల్స్ పైకి లేచినట్లు అతడు భావించాడు. ఫలితంగా నాటౌట్‌గా ప్రకటించాడు.