తెలంగాణ

telangana

ఇళయరాజా అలా అరిచే సరికి షాకయ్యా: దర్శకురాలు

By

Published : Dec 4, 2021, 7:54 AM IST

Gamanam movie shreya: నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితోనే 'గమనం' సినిమా తెరకెక్కించినట్లు తెలిపింది దర్శకురాలు సుజనా రావు. ఈ సినిమా కథ విన్నప్పుడు నటి శ్రియ భావోద్వేగానికి గురైనట్లు గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇళయరాజా గమనం సినిమా, Ilayaraja gamanam movie
ఇళయరాజా గమనం సినిమా

Gamanam music director Ilayaraja: "పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పరిపూర్ణమైన జీవన ప్రయాణం గురించి చెప్పే సినిమానే ఈ 'గమనం' " అన్నారు దర్శకురాలు సుజనా రావు. ఆమె తెరకెక్కించిన తొలి చిత్రమిది. శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు సుజనా రావు. ఆ విశేషాలు..

"నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చిన సంఘటనల స్ఫూర్తితోనే నేనీ కథ రాసుకున్నా. ఇందులో మూడు నాలుగు కథలుంటాయని కాదు. ఓ పరిపూర్ణమైన జీవన చక్రాన్ని ఇందులో చూపించాలని అనుకున్నా. ఈ కథను తొలుత ఓ డ్రాఫ్ట్‌లా రాసుకున్నా. దాన్ని నిర్మాత జ్ఞానశేఖర్‌ సర్‌కు పంపాను. ఆయనకది బాగా నచ్చింది. తొలుత ఈ చిత్రాన్ని చిన్నగానే తీయాలనుకున్నాం. కానీ, ఒకొక్కరిగా అగ్ర తారలందరూ వచ్చి చేరడం వల్ల పెద్ద సినిమాగా మారిపోయింది".

"ఈ కథను శ్రియా వద్దకు తీసుకెళ్లే వరకు నా కమల ఆమె అని తెలియదు. సగం కథ చెప్పిన తర్వాత తనే నా కమల అని నిర్ణయించుకున్నాను. ఆమె కథ మొత్తం విన్నాక.. అలా లేచి నన్ను గట్టిగా హత్తుకుని ఏడ్చేశారు. ఇందులో శివ కందుకూరి క్రికెటర్‌ అవ్వాలనుకునే అలీ అనే కుర్రాడిగా కనిపిస్తారు. అతన్ని ప్రేమించే యువతిగా ప్రియాంక కనిపిస్తుంది. నిత్యామేనన్‌ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. వీటిలో ప్రతీ పాత్రకు ఓ జర్నీ ఉంటుంది".

"నా కలలకు మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. నాన్న జి.పద్మారావు మాజీ నిర్మాత. చిన్నప్పుడు ఆయనతో కలిసి షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. ఆ ఇష్టంతోనే ఓవైపు దిల్లీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకుంటూ.. మరోవైపు డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టా. ఇప్పుడీ చిత్రంతో దర్శకురాలిగా తెరపై మెరుస్తున్నా. నా తదుపరి చిత్రం కోసం ఇప్పటికే ఓ కథ సిద్ధం చేసుకున్నా. త్వరలో వివరాలు తెలియజేస్తా".

"ఈ చిత్రం కోసం ఇళయరాజా కావాలని అడిగినప్పుడు నిర్మాతలు షాకయ్యారు. నేను ఆయనకు కథ చెప్తుండగా.. 'హే ఆపు' అన్నారు. ఆయనలా అరిచే సరికి చాలా షాకయ్యా. తర్వాత నా పక్కన వచ్చి కూర్చొని... ‘ఓ ఫొటో తీయండి.. మేం సినిమా చేయనున్నామ’న్నారు. ఇందులో తక్కువ మాటలే ఉన్నా.. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ సినిమా ఒప్పుకొని చేసినందుకు సాయిమాధవ్‌ బుర్రా సర్‌కు చాలా థ్యాంక్స్‌"

ఇదీ చూడండి:పూరీ జగన్నాథ్‌ వల్లే ఇది సాధ్యమైంది: కేతిక

ABOUT THE AUTHOR

...view details