తెలంగాణ

telangana

కథ డిమాండ్ చేస్తే కుర్ర హీరోలతోనూ సై!

By

Published : Sep 5, 2020, 6:27 AM IST

కథ నచ్చాలే కానీ అక్కడున్న హీరో ఎవరనేది ఆలోచించడం లేదు కొందరు భామలు. వారిలో కీర్తి సురేశ్, తమన్నా, రకుల్​ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు ఉన్నారు.

కథ డిమాండ్ చేస్తే కుర్ర హీరోలతోనూ సై!
టాలీవుడ్ హీరోయిన్లు

స్టార్‌ హీరోయిన్​కు జోడీగా ఎవరు కనిపిస్తారు? ఇంకెవరు.. స్టార్‌ హీరోనే! తారలకు ఒక్కసారి స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందంటే చాలు... ఆ తర్వాత ప్రయాణం అందుకు తగ్గట్టుగా సాగాల్సిందే! స్టార్‌ హోదా ఉన్న నటులతో తెరను పంచుకోవడంపైనే మక్కువ చూపుతారు. స్టార్‌ దర్శకుడు, అగ్ర నిర్మాణ సంస్థ... ఇలా అన్నీ వారికి తగ్గట్టుగా కుదిరితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. సొంతం చేసుకున్న ఇమేజ్‌ను కాపాడుకోవడంలో భాగమే అది! అయితే అప్పుడప్పుడూ కొద్దిమంది తారలు కొంచెం కొత్తగానూ ప్రయత్నిస్తుంటారు. కథలు డిమాండ్‌ చేస్తున్నట్టు అనిపిస్తే ఇమేజ్‌ను పక్కనపెట్టి మరీ రంగంలోకి దిగుతుంటారు.అలాంటప్పుడే ఇలా ప్రత్యేకమైన కలయికలు తెరపై సందడి చేస్తుంటాయి.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ - వైష్ణవ్‌ తేజ్‌

వైష్ణవ్‌ తేజ్‌ నటించిన 'ఉప్పెన' ఇంకా ప్రేక్షకుల ముందుకే రాలేదు. అప్పుడే స్టార్‌ భామ రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి ఆడిపాడుతున్నాడు. క్రిష్‌ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. అటవీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓ నవల ఆధారంగా తీస్తున్నారు. కథ నచ్చడం వల్ల, పక్కన నటించేది కుర్ర హీరోనే అయినా రకుల్‌ ఓకే చెప్పేసింది. ఇప్పుడీ కలయిక ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తమన్నా - సత్యదేవ్‌

ఇలాంటి కలయికల్ని అంత సులభంగా ఊహించలేం. కానీ కథలు వాళ్లని అలా కలిపేస్తుంటాయి. ఏ పాత్రని ఎవరు చేయాలో ఆ కథలే నిర్ణయిస్తాయని సినీ పండితులు చెబుతుంటారు. అలా ఈమధ్య కొన్ని కథలు భిన్నమైన కలయికల్ని సెట్‌ చేశాయి. అగ్ర కథానాయకుల సరసన ఆడిపాడుతూనే, అవకాశం వచ్చినప్పుడు కుర్రాళ్లతో కలిసి సందడి చేస్తోంది తమన్నా. ఆమధ్య సందీప్‌కిషన్‌తో 'నెక్ట్స్‌ ఏంటి?' చిత్రంలో నటించిందామె. ప్రస్తుతం 'లవ్‌ మాక్‌టైల్‌' తెలుగు రీమేక్‌లో సత్యదేవ్‌తో జోడీ కట్టింది. సత్యదేవ్‌ కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. ఆయనతో తమన్నా జోడీ కడుతోందనగానే ప్రేక్షకులు ఆ కలయిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.

'మహానటి'తో స్టార్‌ అనిపించుకున్న కీర్తి సురేశ్, సీనియర్‌ భామలు అనుష్క తదితరులు నాయికా ప్రధానమైన కథలతో ప్రయాణం చేస్తుంటారు. ఆ కథల్లో హీరో ఎవరనే విషయం కంటే కూడా ఆ కథలపైనే ప్రేక్షకులు దృష్టి పెడుతుంటారు. హీరోలుగా కుర్రాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న 'గుడ్‌లక్‌ సఖి'లో కథానాయకుడు ఆది పినిశెట్టి నటిస్తున్నారు.

రెండు విధాలా లాభం

కుర్ర హీరో సినిమాలో స్టార్‌ భామ అంటే కచ్చితంగా ప్రేక్షకుల దృష్టి ఈ కలయిక మీద పడుతుంది. అది సినిమాకు చాలా మేలు చేస్తుంది. కథానాయికలకూ ఈ తరహా ప్రయత్నం లాభసాటి వ్యవహారమే. పారితోషికం ఎక్కువగా డిమాండ్‌ చేసేందుకు వీలుంటుంది. కుర్ర హీరోలతో జోడీ కడుతున్న కొద్దీ కథానాయికలు తామింకా కుర్ర భామలమే అనే సంకేతాలు ఇచ్చినట్టవుతుంది. అలా కెరీర్‌ను మరింత పొడిగించుకునే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి కలయికలు ఎక్కువగా కుదరడానికి మారిన ప్రేక్షకుల అభిరుచులూ ప్రధాన కారణం అంటున్నారు సినీ పండితులు. ప్రేక్షకులు ఇటీవల కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మంచి కథ అనిపిస్తే చాలు.. హీరో ఎవరన్నది పట్టించుకోకుండా కథానాయికలు ఆ సినిమాలకు సై అంటున్నారు. అలా భిన్నమైన కలయికలతో సినిమాలు సెట్స్‌పైకి వెళుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details