తెలంగాణ

telangana

బుల్లితెరపై తారల జోరు.. వీక్షకుల్లో హుషారు!

By

Published : Sep 4, 2021, 11:16 AM IST

చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్​ సహా పలువురు అగ్రహీరోలు టీవీ రియాలిటీ షోల్లో అదరగొట్టి కుటుంబ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందారు. తెలుగులో ఇప్పుడు మళ్లీ వాటి హవా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగులో పలువురు తారలు చేస్తున్న రియాలిటీలు షోలు ఏంటో తెలుసుకుందాం..

reality shows
రియాలిటీ షో, సినీతారలు

వెండితెరపై నీరాజనాలు అందుకునే అగ్రతారలు టీవీ షోల్లో సందడి చేస్తే వచ్చే కిక్కే వేరు. సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ టీవీలకు అతుక్కునేలా చేయడంలో ఈ షోలు విజయవంతం అవుతున్నాయి. వెండితెర వేల్పులుగా వెలిగిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌లాంటి అగ్రహీరోలు ఈ టీవీ రియాలిటీ షోల్లో అదరగొట్టి కుటుంబ ప్రేక్షకుల ప్రేమాభిమానాలూ పొందారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో వాటి హవా మొదలైంది. ఈ సందర్భంగా తెలుగులో సెలబ్రిటీలు చేస్తున్న రియాలిటీ షోలపై ఓ కథనం.

నాగార్జున- బిగ్‌బాస్‌ సీజన్‌ 5

నాగార్జున

పక్కవాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం మనిషికుండే సహజ లక్షణం. దీని ఆధారంగానే ఓ పెద్ద రియాలిటీ షోనే రూపొందింది. అదే 'బిగ్‌బాస్‌'(Bigg Boss Season 5 Telugu). విదేశాల్లో సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ కాన్సెప్ట్‌ను ఇండియాకు తీసుకొస్తే ఇక్కడా ఆకట్టుకుంటోంది. మొదట హిందీలో అలరించిన 'బిగ్‌బాస్‌ ప్రస్తుతం ఏడు భారతీయ భాషల్లో బుల్లితెర ప్రేక్షకుల మనసు రంజింపచేస్తోంది. తెలుగులో మొదటిసారి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా 'బిగ్‌బాస్‌' మొదలైంది. అది విజయవంతమవడంతో ఆ తర్వాత సీజన్లను అదే ఊపుతో కొనసాగించారు. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదో సీజన్‌లో మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా మెప్పిస్తే, ఆ తర్వాత రెండు సీజన్లలో నాగార్జున తనదైన స్టైల్‌తో షోను నడిపించారు. మధ్యలో సమంత, రమ్యకృష్ణ మెరుపులూ చూశాం. ఐదో సీజన్‌ ఈ నెల 5 నుంచి మా టీవీలో ప్రసారం కానుంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఎన్టీఆర్‌- ఎవరు మీలో కోటీశ్వరులు

జూనియర్ ఎన్టీఆర్

సామాన్యులను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో హిందీలో అమితాబ్‌బచ్చన్‌ 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'(KBC 2021) గేమ్‌ షోని ప్రారంభించారు. అది కనీవినీ ఎరుగని రీతిలో హిట్టయింది. చాన్నాళ్లకు అదే కాన్సెప్ట్‌తో నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'గా(Evaru Meelo Koteeswarudu) తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రశ్నలు, భావోద్వేగాలు, సెలబ్రిటీల ముచ్చట్లతో రసవత్తరంగా సాగే ఈ గేమ్‌ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా చేశారు. నాలుగో సీజన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి నడిపించారు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'గా పేరు మార్చుకొని సరికొత్తగా ముందుకొచ్చింది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న స్టార్‌ హీరో ఎన్టీఆర్‌(Jr NTR) తనదైన శైలిలో షోను రక్తికట్టిస్తున్నారు. రామ్‌ చరణ్‌తో చేసిన మొదటి ఎపిసోడ్‌ ద్వారా మొదటి రోజు రికార్డు టీఆర్పీ నమోదైంది. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ఈ గేమ్‌ షో మరింతగా అలరిస్తుందని చెబుతున్నారు షో నిర్వాహకులు.

తమన్నా- మాస్టర్‌ చెఫ్‌

తమన్నా

ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన కుకింగ్‌ రియాలిటీ షో 'మాస్టర్‌ చెఫ్‌'(Master Chef Telugu). ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో సూపర్‌ హిట్టయింది. భారతదేశంలోనూ బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకునేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు మొదలయ్యాయి. హిందీలోనూ ఇప్పటికే ఈ షో సూపర్‌ హిట్‌. ప్రపంచవ్యాప్తంగా దీనికి అభిమానులు కూడా ఎక్కువే. ఇప్పుడీ వంటల పోటీ కార్యక్రమం దక్షిణాదిన కూడా అలరిస్తోంది. ఇందులో జరిగే వంటల పోటీలను రక్తికట్టించడంలో హోస్టులదే కీలక పాత్ర. తెలుగులో వారం క్రితమే జెమిని టీవీలో ప్రారంభమైంది. మిల్కీబ్యూటీ తమన్నా హోస్ట్‌గా చేస్తుండటంతో 'మాస్టర్‌ చెఫ్‌' మరింత ఆసక్తికరంగా మారింది. తమిళంలో విజయ్‌ సేతుపతి చేస్తుండగా, కన్నడంలో సుదీప్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌ చేస్తారని సమాచారం. నాలుగు భాషల్లో టెలికాస్ట్‌ కాబోతున్న కార్యక్రమానికి దర్శకుడు ఒకరే కావడం ఓ విశేషం.

లక్ష్మీ మంచు- ఆహా భోజనంబు

మంచు లక్ష్మి

తెలుగు ఓటీటీ ఆహాలో మంచు లక్ష్మి చేస్తున్న మరో వంటల కార్యక్రమమే 'ఆహా భోజనంబు'(Aha Bhojanambu). సెలబ్రిటీలతో సరదాగా సాగిపోతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. విష్వక్‌శేన్‌, మేఘా ఆకాష్‌, అలీ, ఆనంద్‌ దేవరకొండ లాంటి తారలు ఇప్పటికే ఈ కార్యక్రమంలో సందడి చేశారు. మంచు లక్ష్మి ఈ షోను తనదైన శైలితో నడిపిస్తున్న విధానం పసందైన వినోదాన్ని అందిస్తోంది. ఇది వరకు సమంత కూడా ఆహాలో ఓ షో చేసింది. తారల ముచ్చట్లతో సాగే 'సామ్‌ జామ్‌'(Sam Jam) కార్యక్రమం అందరినీ అలరించింది. త్వరలో సెకండ్‌ సీజన్‌ ప్రారంభిస్తారని వినికిడి. రానా కూడా 'నెం. 1 యారీ' తో(Rana no 1 Yaari) అలరించారు. ఇక ఈటీవీలో 'ఆలీతో సరదాగా'ను హాస్యనటుడు అలీ, 'వావ్‌'ను సాయికుమార్‌ దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:Liger movie: 'లైగర్'​ దూకుడు.. గోవాకు చిత్రబృందం

ABOUT THE AUTHOR

...view details