తెలంగాణ

telangana

RRR songs: 'కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో'

By

Published : Dec 27, 2021, 8:24 AM IST

RRR songs: గోండు వీరుడు కొమురం భీమ్​ ధీరత్వానికి అద్దం పట్టిన పాట 'ఆర్​ఆర్ఆర్​'లోని 'కొమురం భీముడో'.. మాండలికం ఏదైనా స్వచ్ఛమైన భావం పలికేలా తెలంగాణ వాడుక మాటల్ని వాడుతూ ఈ పాటను రాశారు సుద్దాల అశోక్​తేజ. ఈ పాట ప్రయాణం గురించి ఆయన ఏమన్నారంటే..

rrr movie
ఆర్​ఆర్ఆర్

RRR songs: పల్లె పదాలతో పాటకి సరికొత్త సొబగులు అద్దుతుంటారు సుద్దాల అశోక్‌తేజ. మాండలికం ఏదైనా సరే... పదం పదంలోనూ ఆ సంస్కృతి ఒలుకుతుంది. స్వచ్ఛమైన భావం పలుకుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం ఆయన రాసిన 'కొమురం భీముడో...' పాటలోనూ అంతే. గోండు వీరుడు కొమురం భీమ్‌ ధీరత్వానికీ అద్దం పట్టిందీ పాట. తెలంగాణ వాడుక మాటల్లోని పదనిసల్ని మరింత అందంగా ఆవిష్కరించిందీ పాట. సామాజిక అనుసంధాన వేదికల్లో మార్మోగుతున్న ఈ పాట ప్రయాణం గురించి ప్రముఖ రచయిత సుద్దాల అశోక్‌తేజ 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...

సుద్దాల అశోక్ తేజ

"కొమురం భీమ్‌ని ఆంగ్లేయులు చిత్రహింసలు పెడుతున్నప్పుడు... వాటికి భయపడి లొంగిపోతే వీరుడివి ఎలా అవుతావు? అడవి తల్లి బిడ్డవి ఎలా అవుతావు? అన్న మాటలతో సాగే పాట ఇది. ఒక వైపు వాళ్ల హింసలు సాగుతుంటే, మరోవైపు తనకి తానే ధైర్యం చెప్పుకొనే సందర్భంలో ఈ పాట వస్తుంది. మనం ఏకాంతంలో ఉన్నప్పుడు 'ఏం భయపడొద్దు' అంటూ మనకు మనమే వెన్ను తట్టుకుంటాం.. అలాంటి పాటే ఇది. తనని తాను ఉద్దేశించి పాడుకోవాలన్నప్పుడు ఆ పాటలో ఓ ధైర్యాన్ని, అడవి వీరుల వారసత్వాన్ని, కొమురం భీమ్‌ నేపథ్యాన్ని, భయపడని ధీరోధాత్తమైన ఆయన జీవితాన్ని ఓ 17 లైన్లలో చెప్పే ప్రయత్నం చేశా.

ఎన్టీఆర్

కొమురం భీమ్‌ మీద 'పరమవీరచక్ర'లో ఎనిమిది నిమిషాల కథని గేయ రూపకంలో రాశా. నాగబాల సురేష్‌కుమార్‌ దర్శకత్వం వహించిన కొమురం భీమ్‌ సీరియల్‌ వస్తే దానికీ పాట రాశా. ఇది మూడోసారి ఆయనపై పాట రాయడం. అయితే వాటితో పోలిస్తే ఈ సినిమాలోని నేపథ్యం వేరు. దర్శకుడు రాజమౌళి చెప్పింది ఒక్కటే... భీముడి వ్యక్తిత్వంతోపాటు, తెలంగాణ సంస్కృతిలోని ఆ పదాలు ఈ పాటలో కావాలన్నారు. తుడుము అన్నది గోండు ప్రజలు వాయించే వాయిద్యం పేరు. ఆ వాయిద్యం పేరు తప్ప మిగతాదంతా తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే భాషతోనే రాశా.

కొమురం భీమ్​గా ఎన్టీఆర్

పల్లవిలో 'కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో, రగరగ సూరీడై రగలాలి కొడుకో' అని రాశా. తెలంగాణలో పొయ్యిలో కట్టెని కొరకాసు, కొర్రాసు అంటారు. నెగడోలే అంటే మంట అని అర్థం. కొర్రాసు నెగడోలే అంటే అగ్గి కణిక అని అర్థం వచ్చేలా రాశా. భగ భగ ధగ ధగ భుగ భుగ అంటుంటాం నేను ఇక్కడ రగలడాన్ని గుర్తు చేస్తూ రగ రగ సూరీడై రగలాలి అంటూ కొత్త ప్రయోగం చేశా. చరణంలో కాల్మొక్త బాంచెనని ఒంగితోగాల అని రాశా. ఒంగితోగాల అంటే ఒంగితే ఒకవేళ అని అర్థం. ఇదే చరణంలోనే జులుము గద్దెకు తలను ఒంచితోగాల తుడుము తల్లీ పేగున పెరుగనట్టేరో అని రాశా. జులుము అంటే దౌర్జన్యం, గద్దె అంటే బ్రిటిష్‌వాళ్ల గద్దె అని అర్థం. దానికి తలని వంచితే ఒక వేళ తుడుము తల్లి పేగున నువ్వు పెరుగనట్టే అని రాశా. తుడుము అనేది చర్మంతో చేసిన ఓ వాయిద్యం, భీమ్‌ ఆ తుడుము ధ్వని వినుకుంటూనే పెరిగాడు కాబట్టి దాన్నే ఓ గర్భసంచిలా చెబుతూ ఆ పేగున నువ్వు పెరగనట్టే అని చెప్పా. రెండో చరణంలో 'సెర్మమొలిసే దెబ్బకి అబ్బంటోగాలా' అని ఉంటుంది. మనకు దెబ్బ తగలగానే అబ్బ, అమ్మ అంటాం కదా, అదీ అనొద్దనేది ఈ వాక్యం ఉద్దేశం. దెబ్బకి అబ్బ అంటే ఒకవేళ, ఆ దెబ్బకి రక్తం చిలికితే, భయంతో కన్నీరు ఒలికితే, నువ్వు భూమి తల్లి సనుబాలు తాగనట్టేరో అని రాశా. భీమ్‌ భూమిపుత్రుడై పెరిగినోడు కాబట్టి తనకి భూమాతని తల్లిని చేసి, ఆ తల్లి సనుబాలు తాగనట్టేరో అని ఓ కొత్త రకమైన వ్యక్తీకరణ చేశా. ఆ భూమి తల్లి మట్టిని తీసి బొట్టు పెట్టుకోరా అంటుంటారు గ్రామీణ ప్రజలు. ఆ మాటని ఇక్కడ నేను మరో కోణంలో 'కాలువై పారే నీ గుండె నెత్తురూ, నేలమ్మకే నుదిటి బొట్టైతుంది సూడు' అని రాశా. ఈ జన్మ అంకితం అనే మాటని మనం సాధారణంగా వాడే పదం. కానీ ఈ పాట ఆఖర్లో 'పుడమి తల్లికి జనమ అరణ మిస్తివిరో' అని రాశా. తెలంగాణలో మంగళ ప్రదమైన సందర్భాల్లో ఇచ్చే ఓ శుభ ప్రదమైన కానుక అరణము. అదీ జీవంతో కూడుకున్న కానుకని అర్థం. పెళ్లి తర్వాత పిల్లకి సొమ్ములతోపాటు, ఓ ఆవుని ఇచ్చి పంపుతుంటారు. పూర్వ కాలంలో రాజులు తమ కుమార్తెలతోపాటు చెలికత్తెల్ని అరణముగా పంపేవారు. నీ జన్మనే భూమి తల్లికి అరణంగా ఇస్తివిరో అని చెబుతూ ఈ పాటని ముగించా. ఒకరికి లొంగకూడదనే ధీరత్వాన్ని, తెలంగాణ వారసత్వాన్ని ప్రతీ అక్షరంలో పెట్టే ప్రయత్నం చేశాం.

'కొమురం భీముడో'.. పాట లిరిక్స్​

దర్శకుడు రాజమౌళి ఈ సినిమా సెట్లో వేసుకున్న కుటీరంలోనే కూర్చుని ఒకొక్క చరణాన్ని రాయడం, ఆయనకి వినిపించడం ఇలా ఈ పాటని రెండు రోజుల్లో పూర్తి చేశా. ఎనిమిది రోజులు కీరవాణి, రాజమౌళితో ప్రయాణం చేస్తూ మూడు పాటల్ని పూర్తి చేశా. వేగంగా రాస్తూ చాలా లోతైన అర్థంతో రాశాడని కీరవాణి సర్‌ ట్వీట్‌ చేశారు. పాట విడుదల తర్వాత చక్కటి స్పందన లభించింది. ఈ పాటని ఆలపించడానికి బాలు గారైతే బాగుండేదనుకున్నాను. ఆయన ఉండుంటే ఆ పాట విని కౌగిలించుకునేంత గొప్పగా పాడాడు కాలభైరవ. ఈ పాటని ఇతర భాషల్లో రాసేటప్పుడు ఆయా రచయితలూ నాతో మాట్లాడారు. ఇందులో నేను వాడిన పదాలు, తెలంగాణ సంస్కృతి తెలుసుకుని చక్కటి అనుభూతికి గురయ్యారు".

చిత్రం: ఆర్‌.ఆర్‌.ఆర్‌
గానం: కాలభైరవ
రచన: సుద్దాల అశోక్‌తేజ
సంగీతం: ఎం.ఎం.కీరవాణి

ఇదీ చూడండి:నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్

ABOUT THE AUTHOR

...view details