తెలంగాణ

telangana

ఆయన్ను చూశాకే సినిమాల్లోకి రావాలనిపించింది: చిరంజీవి

By

Published : Mar 31, 2022, 7:10 AM IST

Chiranjeevi Tapsee Mission impossible pre release event: తన సినీ ప్రయాణానికి బీజం ఎలా పడిందో చెప్పారు మెగాస్టార్​ చిరంజీవి. ఎనిమిదో తరగతిలోనే నటుడిని కావాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటే తాప్సీ నటించిన 'మిషన్​ ఇంపాజిబుల్'​ గురించి మాట్లాడారు. ఆ సంగతులను చూద్దాం..

chiru
చిరు

Chiranjeevi Tapsee Mission impossible pre release event:"చిన్నప్పుడు సినిమాల్లో బాలనటులు కనిపించారంటే వాళ్ల నటనని తదేకంగా గమనించేవాణ్ని. ‘బాలరాజు కథ’లో ప్రభాకర్‌ని చూశాకే నా నటన ప్రయాణానికి బీజం పడింది. ఏడు, ఎనిమిదో తరగతిలోనే నటుడిని కావాలని నిర్ణయం తీసుకున్నా. ఈ సినిమాలోనూ ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ల నటనతో నన్నెంతగానో ఆకట్టుకున్నార"ని చెప్పారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వరూప్‌.ఆర్‌.ఎస్‌.జె దర్శకత్వం వహించిన చిత్రమిది. తాప్సి ముఖ్యభూమిక పోషించారు. రోషన్‌, భానుప్రకాష్‌, జై కీలక పాత్రధారులు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. చిత్రం ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ "నిర్మాత నిరంజన్‌రెడ్డి ఒక పక్క ‘ఆచార్య’ చేస్తూ, మరో పక్క ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చేశారని తెలిసి ఆశ్చర్యపోయా. ఈ సినిమా చూశా, అద్భుతంగా అనిపించింది. తాప్సి శక్తివంతమైన పాత్రలో కనిపించింది. దర్శకుడు స్వరూప్‌ ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇందులో చిన్న పిల్లలు ఉండొచ్చు కానీ, ఇది చిన్న సినిమా కాదు. నిర్మాతలు కథలోనూ, సినిమా ప్రయాణంలోనూ లీనం కావాలి. నిర్మాత డబ్బు పెట్టే ఓ ఫైనాన్షియర్‌గా మారిపోతున్న రోజులివి. అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు, దేవీప్రసాద్‌... వీళ్లంతా సినిమాల్లో అన్నింట్లోనూ లీనమయ్యేవారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నిరంజన్‌ రూపంలో ఓ మంచి అభిరుచిగల నిర్మాతని చూశా. పెద్ద మనసుతో ఈ సినిమా చూస్తే ఇందులో మంచి హృదయం కనిపిస్తుంది. నన్ను నమ్మి వెళితే నిరుత్సాహపడరనే భరోసా ఇస్తున్నా. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ భారతీయ పరిశ్రమ గర్వించే సినిమా అయ్యింది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ తరహా సినిమాల్ని ఆదరిస్తే అందరిలోనూ ఉత్సాహం వస్తుంది" అన్నారు.

దర్శకుడు స్వరూప్‌.ఆర్‌.ఎస్‌.జె మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరిలోనూ ఒక అమాయకత్వం కనిపిస్తుంది. చిన్నప్పుడు త్వరగా పెద్దయిపోదాం అనుకుంటాం. ఒక వయసొచ్చాక ఒత్తిడి పెరిగిపోయి చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటాం. మిస్‌ అయిపోయిన ఆ రోజుల్లోకి మరోసారి వెళ్లిరావాలనిపిస్తుంది. అలాంటి అనుభవాన్ని పంచే చిత్రమే మా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’’ అన్నారు.

నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘స్వరూప్‌ తీసిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చూసి ఫోన్‌ చేశా. మంచి కథ ఉంటే చేద్దామని చెప్పా. ముగ్గురు పిల్లలతో కూడిన ఈ కథని చెప్పారు. స్వరూప్‌ ఇచ్చిన ఈ స్క్రిప్ట్‌ని చదువుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నా. తాప్సి లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు’’ అన్నారు.

తాప్సి మాట్లాడుతూ ‘‘రెండేళ్లుగా హిందీలో బిజీగా ఉన్నారు కదా, తెలుగు సినిమాలు ఎందుకు ఒప్పుకొంటుంటారని అడుగుతుంటారు. నాకు దానికి సరైన సమాధానం తెలియదు. మనం ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టామో అది చాలా ప్రత్యేకం. నేనెక్కడ సినిమాలు చేసినా తెలుగులో నటిస్తూనే ఉంటా’’ అన్నారు. సంగీత దర్శకుడు మార్క్‌ కె.రాబిన్‌, ఛాయాగ్రాహకుడు దీపక్‌తోపాటు, సుహాస్‌, రవీంద్ర విజయ్‌, సందీప్‌రాజ్‌, వెంకటేష్‌ మహా, వినోద్‌, విష్వక్‌, రాహుల్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Gani movie: 'అది చేయలేనందుకు చాలా బాధపడ్డా'

ABOUT THE AUTHOR

...view details