తెలంగాణ

telangana

నోరూరించే సెనగపిండి కూర.. ఇలా  చేయండి!

By

Published : Jul 2, 2021, 12:07 PM IST

Updated : Jul 2, 2021, 1:52 PM IST

సెనగపిండితో స్నాక్స్ ఎవరైనా చేస్తారు. కానీ దానితో కూర చేసుకోవడంలోనే అసలైన కిక్కు ఉంటుంది. సెనగపిండితో కూరలను ఎలా తయారు చేస్తారో ఓసారి తెలుసుకుందామా?

senagapindi recipes
సెనగ పిండి కూర

సెనగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఓ సారి చూద్దాం.

సెనగపిండి కూర

కావలసినవి
సెనగపిండి: కప్పు, జీలకర్ర: టీస్పూను, పసుపు: అరటీస్పూను, బేకింగ్‌సోడా: పావుటీస్పూను, కారం: టీస్పూను, ఉప్పు: అరటీస్పూను, దనియాలపొడి: టీస్పూను, పుదీనాతురుము: 2 టీస్పూన్లు, అల్లంతురుము: టీస్పూను, పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: కప్పు
గ్రేవీకోసం: నెయ్యి: టేబుల్‌స్పూను, నూనె: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: రెండు, లవంగాలు: ఆరు, దాల్చినచెక్క: ఒకటి, ఉప్పు: అరటీస్పూను, పసుపు: అరటీస్పూను, వెల్లుల్లితురుము: అరటీస్పూను, కారం: అరటీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము:
2 టీస్పూన్లు, పెరుగు: కప్పు, మంచినీళ్లు: 2 కప్పులు

తయారుచేసే విధానం

  • సెనగపిండిలో జీలకర్ర, పసుపు, బేకింగ్‌సోడా, కారం, ఉప్పు, దనియాలపొడి, పుదీనా, అల్లంతురుము, పెరుగు అన్నీ వేసి కలపాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని గట్టి ముద్దలా కలపాలి. తరవాత దీన్ని కొంచెంగా తీసుకుని రెండు అరచేతులతో పొడవాటి కడ్డీల్లా చేయాలి.
  • మందపాటి గిన్నెలో నీళ్లు పోసి మరిగించి చేసిన కడ్డీలను అందులో వేసి ఉడికించాలి. అవి పూర్తిగా ఉడికిన తరవాత చల్లారాక ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.
  • బాణలిలో నూనె వేసి కాగాక సెనగపిండి ముక్కలను వేసి వేయించి తీయాలి. అందులోనే టేబుల్‌స్పూను నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, దాల్చినచెక్క, లవంగాలు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేగాక, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
  • వెల్లుల్లి, కారం, దనియాలపొడి, కొత్తిమీర తురుము వేసి కలపాలి. పెరుగు కూడా వేసి కలిపిన తరవాత నీళ్లు పోసి మరిగించాలి. మిశ్రమం కాస్త చిక్కబడ్డాక సెనగముక్కలను వేసి కాసేపు ఉడికించి, కొత్తిమీర తురుము చల్లి దించాలి. ఇది అన్నం, రోటీ ఎందులోకైనా బాగుంటుంది.

సొరకాయ పెరుగు కూర

సొరకాయ పెరుగు కూర

కావలసినవి

సొరకాయ (చిన్నది): ఒకటి, నెయ్యి: 2 టీస్పూన్లు, ఉల్లిముక్కలు: అరకప్పు, పెరుగు: పావులీటరు, జీలకర్ర పొడి: 2 టీస్పూన్లు, శొంఠిపొడి: టీస్పూను, మీగడ: 4 టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, ఉప్పు: సరిపడా, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం

సొరకాయ తొక్కు తీసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత పెరుగు వేసి కలుపుతూ మరిగించాలి. జీలకర్ర, శొంఠిపొడి వేసి కలపాలి. మీగడ, దనియాలపొడి, ఉప్పు, జీలకర్రపొడి, యాలకులపొడి వేసి కలపాలి. సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. ముక్క ఉడికిన తరవాత కొత్తిమీర తురుము చల్లి దించాలి.

చేమదుంపల కడి

చేమదుంపల కడి

కావలసినవి

చేమదుంపలు: అరకిలో, కారం: అరటీస్పూను, సెనగపిండి: అరకప్పు, పుల్ల పెరుగు: అరకప్పు, కరివేపాకు: రెండు రెబ్బలు, జీలకర్ర: అరటీస్పూను, ఎండుమిర్చి: రెండు, జీలకర్ర తురుము: టేబుల్‌స్పూను, దనియాలపొడి: అరటీస్పూను, మంచినీళ్లు: 4 కప్పులు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

  • చేమదుంపల్ని ఉడికించి పొట్టు తీసి, మెత్తగా మెదపాలి. అందులోనే అరటీస్పూను ఉప్పు, కారం, సెనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీల పిండిలా కలపాలి.
  • ఇప్పుడు పావువంతు పిండిని పక్కన ఉంచి, మిగిలిన మిశ్రమాన్ని కాగిన నూనెలో పకోడీల్లా వేయాలి. విడిగా తీసిన పిండిలో పెరుగు కలపాలి. తరవాత కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలపాలి.
  • బాణలిలో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక అల్లంతురుము వేయాలి. ఇప్పుడు పెరుగు కలిపిన చేమదుంపల మిశ్రమాన్ని వేసి కలపాలి. ఉప్పు, దనియాలపొడి కూడా వేసి సిమ్‌లో మరిగించాలి. తరవాత వేయించిన పకోడీలు వేసి మరికాసేపు ఉడికించి కొత్తిమీర తురుము చల్లి దించాలి.

బెండకాయ క్రంచీ

బెండకాయ క్రంచీ

కావలసినవి

బెండకాయలు: అరకిలో, జీలకర్ర: 2 టేబుల్‌స్పూన్లు, దనియాలు: 2 టేబుల్‌స్పూన్లు, పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: ఎనిమిది, వెల్లుల్లి తురుము: టేబుల్‌స్పూను, కొబ్బరితురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: టీస్పూను

తయారుచేసే విధానం

  • జీలకర్ర, దనియాలు, పల్లీలు, సెనగపప్పు, ఎండుమిర్చి అన్నీ కలిపి వేయించాలి. చల్లారాక వీటిని మిక్సీలో వేసి పొడి చేయాలి. తరవాత అందులో ఉప్పు వేసి కలిపి ఉంచాలి.
  • బెండకాయలు కడిగి కాస్త ఆరాక అంచులు కోయాలి. తరవాత బాణలిలో నూనె పోసి బెండకాయల్ని వేయించి తీయాలి.
  • తరవాత వాటిమీద పొడి చల్లితే క్రంచీ క్రంచీ బెండీ రెడీ.

ఇదీ చూడండి:Maggi: మ్యాగీని ఇలా కూడా తింటారా!

Last Updated :Jul 2, 2021, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details