తెలంగాణ

telangana

మటన్ వెరైటీస్: తవా ఘోష్‌, హరియాలీ లాంబ్‌ చాప్స్‌!

By

Published : Jul 31, 2021, 1:48 PM IST

వేడివేడి అన్నం లేదా రోటీలకు తోడు మటన్‌ కూర ఉంటే. ఆ కాంబినేషన్​ అదుర్స్​ కదా. మరి ఇంకేదుకు ఆలస్యం వారాంతం వచ్చేసింది కదా. ఎంచక్కా మటన్ తీసుకొచ్చి, ఈ స్టోరీలో చూపించిన రెసిపీస్​ తయారు చేసుకుని ఆరంగించండి.

mutton varieties
మటన్ వెరైటీస్

మటన్​తో తయారుచేసిన పంజాబీ స్టైల్ కర్రీస్​ను రుచి చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కింది వంటకాల తయారీ విధానాన్ని చూసి.. మీరూ ట్రై చేసేయండి మరి..

తవా ఘోష్‌

తవా ఘోష్‌

కావలసినవి

మటన్‌ ముక్కలు: అరకేజీ, టొమాటోలు: మూడు (ఒకదాన్ని ముద్దలా చేసుకోవాలి), పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి, దాల్చినచెక్క: పెద్ద ముక్క, యాలకులు: మూడు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, పెరుగు:అరకప్పు, అల్లంతరుగు: టేబుల్‌స్పూను, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, వేయించిన జీలకర్రపొడి: చెంచా, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, క్రీమ్‌: పావుకప్పు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు, నెయ్యి: పావుకప్పు.

తయారీ విధానం

ముందుగా కుక్కర్‌ను స్టౌమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక మటన్‌ ముక్కల్ని రెండు నిమిషాలు వేయించి.. అల్లంవెల్లుల్లి ముద్ద, దాల్చినచెక్క, యాలకులు, ఉల్లిపాయముక్కలు, చెంచా ఉప్పు, మూడుకప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్​ వచ్చాక స్టౌ కట్టేసి ఆ నీటిని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు పాన్‌ స్టౌమీద పెట్టి నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేయించి టొమాటో ముక్కలు, టొమాటో ముద్ద, కారం, పసుపు, జీలకర్రపొడి, దనియాలపొడి, పెరుగు వేసి కలపాలి. ఇది గ్రేవీలా అవుతున్నప్పుడు మటన్‌ ముక్కలు ఉడికించిన నీరు, ఆ తరువాత మటన్‌ ముక్కలతోపాటు మిగిలిన పదార్థాలు వేసి కలిపి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.

హరియాలీ లాంబ్‌ చాప్స్‌

హరియాలీ లాంబ్‌ చాప్స్‌

కావలసినవి

మటన్‌ ముక్కలు ఎముకలతో సహా: అరకేజీ, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, దనియాలపొడి: రెండు చెంచాలు, జీలకర్రపొడి: అరచెంచా, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, గరంమసాలా: అరచెంచా, పెరుగు: అరకప్పు, కొత్తిమీర: గుప్పెడు, ఉప్పు: తగినంత.

మసాలాకోసం: కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: అరచెంచా, వెల్లుల్లి రెబ్బలు: రెండు, నిమ్మకాయ: సగం, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం

మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. కుక్కర్‌లో మిగిలిన పదార్థాలు తీసుకుని కాసిని నీళ్లు పోసి మూత పెట్టి మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఆ తరువాత కేవలం మటన్‌ ముక్కల్ని మాత్రమే తీసుకుని వాటికి ముందుగా చేసుకున్న మసాలా పట్టించాలి. ఇలా చేసుకున్న వాటిని గ్రిల్‌పాన్‌ పైన పదినిమిషాలు కాల్చుకుని తీసుకుంటే సరి.

పెప్పర్‌మటన్‌..

పెప్పర్ మటన్

కావలసినవి

మటన్‌: అరకేజీ, ఉల్లిపాయముక్కలు: కప్పు, టొమాటో: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: ఒక రెబ్బ, కారం: చెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, సోంపు పొడి: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, పసుపు: పావు చెంచా, నూనె: పావు కప్పు, కొత్తిమీర: కట్ట, మిరియాలపొడి: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం

స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముద్దను వేయించుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు వేయించి.. మటన్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తరువాత కారం, దనియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి మరోసారి కలిపి కప్పు నీళ్లు పోయాలి. నీళ్లన్నీ ఆవిరై మటన్‌ ఉడికాక మిగిలిన పదార్థాలు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.

పంజాబీ మటన్‌ మసాలా..

పంజాబీ మటన్‌ మసాలా..

కావలసినవి

మటన్‌ ముక్కలు: అరకేజీ, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, టొమాటో: ఒకటి (ముద్దలా చేసుకోవాలి), కారం: టేబుల్‌స్పూను, పసుపు: చెంచా, దనియాలు: మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: నాలుగు, మిరియాలు: టేబుల్‌స్పూను, యాలకులు: నాలుగు, లవంగాలు: మూడు, దాల్చినచెక్క: ఒక ముక్క, జాపత్రి: ఒకటి, పెరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, కసూరీమేథీ: టేబుల్‌స్పూను, నెయ్యి: టేబుల్‌స్పూను, ఆవనూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం

స్టౌమీద బాణలి పెట్టి దనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జాపత్రి వేసి దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. మటన్‌ ముక్కలపైన ఈ మసాలా, పసుపు, కారం, అల్లంవెల్లుల్లిముద్ద, పెరుగు వేసి కలిపి నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఇప్పుడు మటన్‌ ముక్కలు వేయించి టొమాటో ముద్ద, సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో తీసుకుని కాసిని నీళ్లు పోసి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. తరువాత కూరను మళ్లీ పొయ్యిమీద పెట్టి మిగిలిన పదార్థాలు వేసి చిక్కగా అయ్యాక స్టౌ కట్టేయాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details