తెలంగాణ

telangana

కశ్మీరి చిల్లీ మటన్​.. చూస్తేనే నోరూరెన్..!

By

Published : Jan 31, 2021, 11:25 AM IST

మెర మెర మెలితిప్పిన మీసంలా ఉంటుంది మిర్చి. ఎండినా.. కారం మెండుగా ఉంటుంది. తాలింపుల్లో పడగానే చిటపటలాడుతుంది. పంటికిందికి రాగానే కరకర కారం పంచుతుంది. ఇంకెందుకాలస్యం మిర్చితో తీర్చిదిద్దిన ఈ కశ్మీరి చిల్లీ మటన్​ను ఆదివారం మెనూలో మీరూ ట్రై చేయండి మరి..!

how to prepare Kashmiri Chili Mutton recipe
కశ్మీరి చిల్లీ మటన్​.. చూస్తేనే నోరూరెన్

కశ్మీరి చిల్లీ మటన్ :

కావాల్సిన పదార్థాలు : మాంసం- అరకేజీ, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- అరటేబుల్‌ స్పూన్‌, బటర్‌- యాభై గ్రాములు, నల్ల యాలకులు- మూడు, మిరియాలు- అర టేబుల్‌స్పూన్‌, గరంమసాలా- అర టేబుల్‌ స్పూన్‌, పెరుగు- రెండు టేబుల్‌ స్పూన్లు, కుంకుమ పువ్వు- చిటికెడు, ఉప్పు- తగినంత, మధ్యస్థంగా ఉండే ఉల్లిపాయలు- రెండు, కశ్మీరీ కారం- టేబుల్‌ స్పూన్‌, ధనియాల పొడి - టేబుల్‌ స్పూన్‌, నీళ్లు- కప్పు.

తయారీ: ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో బటర్‌ వేసుకుని యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి పది సెకన్లపాటు వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి రెండు నిమిషాలు వేయించి మటన్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని పావుగంటపాటు ఉడికించాలి. దీంట్లో కశ్మీరీ కారం, ధనియాల పొడి, ఉప్పు, పెరుగు, కప్పు నీళ్లు పోసుకుని మధ్యస్థంగా ఉండే మంట మీద మూడు, నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారిన తర్వాత ముందే పాలలో నానబెట్టుకున్న కుంకుమపువ్వు వేసుకుని వడ్డించాలి. అన్నం లేదా చపాతీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది.

ఇదీ చూడండి :ఆహా అనిపించే 'కట్టా ఆలూ'.. వండేయండిలా..

ABOUT THE AUTHOR

...view details