తెలంగాణ

telangana

Indian Ayurveda: ప్రపంచ విపణిలో ఆయుర్వేదం- భారత్‌కు మేలిమి అవకాశాలు

By

Published : Oct 12, 2021, 5:29 AM IST

Ayurveda
ఆయుర్వేదం

ఆయుర్వేదం (Indian Ayurveda) అనగానే సంప్రదాయ వైద్య విధానం అన్న భావన అందరిలో మెదులుతుంది. వాణిజ్య కోణంలో చూస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యాపార రంగం. 1930లో మొదలైన ఆధునిక పాశ్చాత్య వైద్య విధానం ఎంతో వేగంగా ఎదిగింది. కోట్ల మందిని వేధించే కొన్ని వ్యాధులకు అందులో నేటికీ సరైన మందులు లేవు. దాంతో రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తల దృష్టి ప్రకృతి ఔషధాలపై పడింది. అత్యంత పురాతనమైన భారతీయ ఆయుర్వేదం, చైనీస్‌ ఔషధాలపై విస్తృతంగా పరిశోధనలు మొదలయ్యాయి. వాటిలో ఆశాజనక ఫలితాలు కనపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ఔషధాల వినియోగం ఒక్కసారిగా పెరిగింది.

కరోనా మహమ్మారి వల్ల భారత్‌, చైనాల్లోని ప్రాచీన ఆయుర్వేద, మూలికా వైద్యంవైపు (Indian Ayurveda) ప్రపంచం దృష్టి మళ్ళింది. ఆయుర్వేదం అనగానే సంప్రదాయ వైద్య విధానం అన్న భావన అందరిలో మెదులుతుంది. వాణిజ్య కోణంలో చూస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యాపార రంగం. 1930లో మొదలైన ఆధునిక పాశ్చాత్య వైద్య విధానం ఎంతో వేగంగా ఎదిగింది. కోట్ల మందిని వేధించే కొన్ని వ్యాధులకు అందులో నేటికీ సరైన మందులు లేవు. దాంతో రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తల దృష్టి ప్రకృతి ఔషధాలపై పడింది. అత్యంత పురాతనమైన భారతీయ ఆయుర్వేదం, చైనీస్‌ ఔషధాలపై విస్తృతంగా పరిశోధనలు మొదలయ్యాయి. వాటిలో ఆశాజనక ఫలితాలు కనపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ఔషధాల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఈ మార్పును మనకంటే ముందుగా గుర్తించిన చైనా- తన మూలికలను ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉంచింది. మన ఆయుర్వేదం చాలా వెనకబడినా వివిధ దేశాల్లో భారీగానే అమ్మకాలు సాగుతున్నాయి.

కొవిడ్‌తో పెరిగిన గిరాకీ

భారత ఆయుర్వేద ఎగుమతుల విలువ 2019లో 446 మిలియన్‌ డాలర్లకు (దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు) (Indian Ayurvedic Market Size) చేరింది. 2020 నాటికి ప్రపంచ మూలికా ఔషధాల మార్కెట్‌ విలువ సుమారు 80 బిలియన్‌ డాలర్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు). సగటున సంవత్సరానికి ఏడు శాతం వృద్ధితో 2050 నాటికి ఈ మార్కెట్‌ ఆరు ట్రిలియన్‌ డాలర్ల (సుమారు 450 లక్షల కోట్ల రూపాయల) వ్యాపారంగా (Indian Ayurvedic Market) అవతరించబోతోందని ఎగ్జిమ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇందులో చైనా వాటా 90శాతం. నేడు ప్రపంచ మూలికా ఔషధాల ఎగుమతుల్లో 98శాతం చైనావే! ఒకప్పుడు ఆయుర్వేద ఎగుమతులంటే భారత ఉపఖండం వరకే పరిమితమై ఉండేవి. రెండు దశాబ్దాలుగా అమెరికా, ఆస్ట్రేలియాలకూ విస్తరించాయి. ఇటీవలి కాలంలో ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి ఐరోపా దేశాల్లోనూ ఆయుర్వేద ఉత్పత్తుల వాడకం పెరుగుతోంది. నిర్దిష్టమైన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి తయారీ, మార్కెటింగ్‌ విధానాల్లో అవసరమైన మార్పుచేర్పులు చేయగలిగితే ఇతర దేశాలకూ ఎగుమతుల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయుర్వేద మార్కెట్‌ రంగంలోకి 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. ప్రాధాన్యం గుర్తించిన అనేక దేశీయ అంకుర సంస్థలు ఈ రంగం వైపు రావడం మొదలైంది. ఆయుర్వేద మందుల తయారీలో బడా కంపెనీల సంఘటిత వ్యాపారం, మొత్తం వాణిజ్య విలువలో 20శాతమే. ఫేస్‌ప్యాక్‌లు, హెయిర్‌ క్రీములు వంటివి విక్రయించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కలిగిన అసంఘటిత రంగం వాటా మొత్తం వ్యాపారంలో 80శాతం. ఇదే లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఆయుర్వేద రంగంలో ప్రత్యక్షంగా పది లక్షల మంది, పరోక్షంగా అంతకు అయిదు రెట్లు ఉపాధి పొందుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోగనిరోధక శక్తిపై దృష్టి సారించడంతో ఆయుర్వేద పరిశ్రమలకు అసాధారణ డిమాండు ఏర్పడింది. రాబోయే కాలంలో ఈ పరిశ్రమ స్థాయిని అంచనా వేసిన కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఆయుర్వేద చికిత్సాలయాలు, ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నాయి. జీవనశైలి సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ఆయుర్వేదంలో రసాయన కాయకల్ప చికిత్స అనే ప్రత్యేక విభాగం ఉంది. వెల్నెస్‌ పేరుతో ఇది అనేక దేశాల్లో ప్రాచుర్యం సంతరించుకుంటోంది.

చిగురిస్తున్న ఆశలు

పాశ్చాత్య దేశాల చట్టాలకు అనుగుణంగా ఆమోదం పొందడం ఆయుర్వేదంలో ప్రధాన సమస్య. వీటిని పరీక్షించేందుకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధనశాలలు భారత్‌లో లేవు. కంపెనీలే సొంత ఖర్చుతో ఆయా దేశాల ప్రయోగశాలల్లో పరిశోధనలు జరిపించి అంగీకారం పొందుతున్నాయి. ఈ విషయంలో చైనా ముందుచూపుతో వ్యవహరించి ప్రపంచ విపణిని కైవసం చేసుకోగలిగింది. కొన్నేళ్లుగా భారత ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పులతో ఆయుర్వేద వ్యాపారంలో ఆశాజనక ధోరణి కనిపిస్తోంది. ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ గతేడాది ఈ రంగంలో పరిశోధన అవగాహన పెంపొందించేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది. అటవీ వైశాల్యం తగ్గుతుండటంతో మార్కెట్‌లో డిమాండుకు సరిపడా మూలికలు లభించకపోవడం మరో సమస్య. దీన్ని నివారించేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద 24 లక్షల ఎకరాల్లో ఆయుర్వేద మొక్కల పెంపకం కోసం భారత ప్రభుత్వం రూ.4000 కోట్లు కేటాయించింది. జాతీయ ఆయుష్‌ మిషన్‌ పథకం కింద ఒకటిన్నర లక్షల వెల్‌నెస్‌ సెంటర్లలో సౌకర్యాలు మెరుగుపరచడానికి రాబోయే అయిదేళ్లలో రూ.3,400 కోట్లు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేసే ఖర్చులో ఆయుర్వేదానికి సముచిత వాటా దక్కాలి. అలా జరిగితే, చైనాను దాటి మన ఉత్పత్తులు దేశ విదేశాల్లో కోట్ల డాలర్ల వ్యాపారం చెయ్యగలుగుతాయి. లక్షల మందికి ఉపాధి బాటగా నిలుస్తాయి.

- డాక్టర్‌ సూరి రఘురామ్‌

ఇదీ చూడండి:బాల్య వివాహాల వల్ల రోజుకు 60మంది బాలికలు బలి!

ABOUT THE AUTHOR

...view details