తెలంగాణ

telangana

ఎడాపెడా పెట్రో బాదుడు- చొరవ చూపేదెన్నడు?

By

Published : Feb 22, 2021, 6:37 AM IST

petrol prices petrol price hike centre need to take initiative to Sorting of petrol prices

దేశంలో పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. ఎడాపెడా ధరలు పెంచడం వల్ల సామాన్య జనం భీతిల్లుతున్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రేట్లు ఉంటాయంటున్న వ్యాఖ్యలు అర్ధసత్యం. అడ్డగోలుగా ఎక్సైజ్‌ సుంకాల్ని పెంచి సామాన్యుడికి బదిలీ కావాల్సిన లాభాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జుర్రేసుకొన్నాయన్నదే వాస్తవం. ఈ నేపథ్యంలో.. చమురు ధరల క్రమబద్ధీకరణకు కేంద్రం చొరవ చూపి, రాష్ట్రాలనూ ఆ దిశగా ప్రోత్సహించాలి.

బంకుల దగ్గరకు వెళితే చాలు, జేబులు భగ్గుమనేలా మండుతున్న పెట్రోధరలు దేశవ్యాప్తంగా జనసామాన్యాన్ని భీతిల్లజేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 24 విడతలుగా నిన్న మినహాయించి అంతక్రితం వరసగా 12 రోజులపాటు పెరుగుతూ పోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల ఉరవడి మున్నెన్నడూ కనీవినీ ఎరుగనిది. నిరుడు విరుచుకుపడిన కొవిడ్‌ మహమ్మారి జనజీవనాన్ని దుర్భర దుఃఖభాజనం చేసిన నేపథ్యంలో- కాలూచేయీ కూడదీసుకొనే వీల్లేకుండా సామాన్యులపై పెట్రో ధరాఘాతాలు సామాజిక ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి.

విత్తమంత్రి ధర్మసంకటం!

ధరల తగ్గింపు వినా వేరే సమాధానం ఏదీ ఎవరికీ రుచించదంటూనే తాను మహా ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటున్నట్లు కేంద్ర విత్తమంత్రి నిర్మల సెలవిచ్చారు. పెట్రో ఉత్పాదనల రేట్లను అంతర్జాతీయ ధరవరలతో అనుసంధానించినందున వాటి నియంత్రణ తమ చేతుల్లో లేదంటూ రిటైల్‌ రేట్లను హేతుబద్ధ స్థాయికి తెచ్చేందుకు కేంద్రం రాష్ట్రాలూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషించారు. 2017 లగాయతు పెట్రో ధరల రోజువారీ సవరణకు పచ్చజెండా ఊపిన కేంద్రం- అంతర్జాతీయ విపణి ఆటుపోట్లు అంటూ చెబుతున్నది అర్ధసత్యం. కొవిడ్‌ కారణంగా నిరుడు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ కుంగి చమురు పీపా ధర 20 డాలర్లకు పడిపోయినప్పుడు- ఆ మేరకు దేశీయంగా ధరలు దిగిరాకుండా అడ్డగోలుగా ఎక్సైజ్‌ సుంకాల్ని పెంచి సామాన్యుడికి బదిలీ కావాల్సిన లాభాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జుర్రేసుకొన్నాయన్నదే వాస్తవం. కొవిడ్‌ రాకముందు లీటరు పెట్రోలుపై రూ.19.98గా ఉన్న ఎక్సైజ్‌ సుంకాన్ని కరోనా కాలంలో రూ.32.98కి, అదే డీజిల్‌పై రూ.15.83గా ఉన్నదాన్ని రూ.31.83కు కేంద్రం పెంచేయగా- రాష్ట్రాలూ తమ హస్తలాఘవం ప్రదర్శించాయి. 89శాతం ముడిచమురు, 53శాతం గ్యాస్‌ కోసం దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితుల్లో కొద్దిపాటి సర్దుబాట్లకు సిద్ధపడే జనవాహిని నేడు ప్రశ్నిస్తోంది- కరవులో అధిక మోసాన్ని!

రామ జన్మభూమిలో ఇలా..

సీతామాత జన్మస్థలి నేపాల్‌లో కన్నా, రావణుడి లంకలో కన్నా రామ జన్మభూమి ఇండియాలో పెట్రో ధరలు అధికమన్న మాన్య ఎంపీ మాట అక్షరసత్యం. ఇచ్చే రాయితీలు, విధించే సుంకాలపై ఆధారపడి దేశాల మధ్య రేట్లలో వ్యత్యాసాలు సహజమేనని కేంద్ర మంత్రి చెబుతున్నా- లీటర్‌ వందకు చేరుతున్న పెట్రోల్‌ ధర మాత్రం మున్నెన్నడెరుగని వైపరీత్యం! గత యూపీఏ జమానాలో 51శాతంగా ఉన్న పెట్రో సుంకాలు నేడు 64.9శాతానికి పెరిగాయి. కాబట్టే 2014లో ఎన్‌డీఏ సర్కారు అధికారానికి వచ్చినప్పుడు ముడి చమురు ధర 110 డాలర్లు కాగా దేశీయంగా లీటర్‌ పెట్రోలు సుమారు రూ.71, డీజిల్‌ రూ.57కు లభ్యమయ్యాయి. అదే ఇప్పుడు బ్యారెల్‌ చమురు 65 డాలర్లలోపే ఉన్నా పెట్రోలు అప్పటికంటే 26శాతం, డీజిల్‌ 42శాతం పెరిగి భీతిల్లజేస్తున్నాయి. పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్న వంటగ్యాస్‌ ధరా ప్రతి ఇంటి బడ్జెట్‌కూ సెగ పెడుతోంది.

జీఎఎస్​టీ చట్రంలోకి తేవాలి

దిగుమతులపై ఆధారపడే దుస్థితిని గత ప్రభుత్వాలు తప్పించలేకపోవడమే ప్రస్తుత దురవస్థకు కారణమంటున్న ప్రధాని మోదీ- పెట్రో ఉత్పాదనలపై పన్నులు సుంకాల హేతుబద్ధీకరణకు చొరవ చూపాల్సిన తరుణమిది. సహజ వాయువును జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం నిబద్ధమై ఉందన్న ప్రధాని- పెట్రోల్‌ డీజిల్‌నూ ఆ చట్రంలో చేర్చాలన్న చిరకాల విన్నపాల్ని సూచనల్ని మన్నించాలి. అంతకంటే ముందు, కొవిడ్‌ కాలంలో రాబడి కోల్పోకుండా కాచుకొనేందుకు పెంచిన సుంకాల్ని తక్షణం తగ్గించడంద్వారా సామాన్య జనావళికి ఉపశమనం కలిగించాలి. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆత్మ నిర్భర్‌ భారత్‌ లక్ష్యం నెరవేరాలంటే, సహేతుక స్థాయిలో చమురు ధరల క్రమబద్ధీకరణకు కేంద్రమే చొరవ చూపి, రాష్ట్రాలనూ ఆ దిశగా ప్రోత్సహించాలి!

ఇదీ చదవండి:భారత సైన్యంలో ఈ కుర్రాడెవరు..!

ABOUT THE AUTHOR

...view details