తెలంగాణ

telangana

MSMEలకు 'ఓకెన్'​ వరం- తక్కువ వడ్డీకే 10నిమిషాల్లో రుణం!

By

Published : Jul 3, 2023, 10:00 AM IST

Ocen framework : పేజీల కొద్దీ దరఖాస్తులు, ధ్రువపత్రాలు.. బ్యాంకుల చుట్టూ చక్కర్లు.. అధికారుల ఆమోదం కోసం రోజుల తరబడి ఎదురుచూపులు.. అయినా రుణం వస్తుందన్న ఆశలు అంతంతే! ప్రస్తుతం దేశంలోని కోట్లాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానుల పరిస్థితి ఇది. అలా కాకుండా.. మొబైల్​లోనే లోన్​ కోసం అప్లై చేసే ప్రక్రియ క్షణాల్లో పూర్తయితే? దరఖాస్తు చేయగానే.. మా దగ్గర రుణం తీసుకోండంటూ బ్యాంకులే పోటీపడి మరీ తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తే? నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమైతే? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆ రోజు ఎంతో దూరంలో లేదు! ఇందుకు కారణం.. ఓకెన్.

ocen framework india
ocen framework india

Ocen Framework India : 1.64కోట్ల యూనిట్లు.. సుమారు 11కోట్ల ఉద్యోగాలు.. జీడీపీలో 30% వాటా.. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల-ఎంఎస్​ఎంఈ రంగం స్వరూపం ఇది. ఉత్పత్తి రంగంలో 45%, ఎగుమతుల్లో 40% వాటాలతో భారత దేశ ప్రగతి రథానికి ఇంజిన్​లా పనిచేస్తోంది ఎంఎస్​ఎంఈ రంగం. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న కల సాకారానికి ఊతమివ్వగల ఎంఎస్​ఎంఈలకు.. బ్యాంకు రుణాలు పొందడం అతిపెద్ద సమస్య. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్​-ఐఎఫ్​సీ నివేదిక ప్రకారం.. దేశంలోని 80% ఎంఎస్​ఎంఈలకు సంఘటిత బ్యాంకింగ్​ వ్యవస్థ నుంచి రుణం అందడం లేదు. ఆయా పరిశ్రమలకు అవసరమయ్యే రుణాల విలువ ఏకంగా రూ.16.66లక్షల కోట్లని అంచనా.

Msme Loan Scheme : ఈ దుస్థితికి కారణం.. సంక్లిష్టమైన బ్యాంకింగ్ నిబంధనలు. రుణం ఇవ్వాలంటే బ్యాంకులు క్రెడిట్ హిస్టరీ చూస్తాయి. నగదు లావాదేవీలు ఎక్కువగా జరిపే ఎంఎస్​ఎంఈలకు ఇది పెద్ద సమస్య. లోన్ ఇస్తే దేనిపై పెట్టుబడి పెడతారు, ఎంత వ్యాపారం చేయగలరు, లాభం ఎంత వస్తుంది, రిస్క్ సంగతేంటి అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. బ్యాంకు అధికారుల్ని ఒప్పించడం చిన్నకారు సంస్థలకు సవాలే. బ్యాంకులకు భరోసా కల్పించేలా ఆస్తులు తనఖా పెట్టే స్థాయీ ఉండదు. ఒకవేళ ఈ అవరోధాలన్నీ దాటుకుని వచ్చినా.. బ్యాంకు రుణం మంజూరయ్యేందుకు పట్టే సమయం చాలా ఎక్కువ. ఇతర రుణాలతో పోల్చితే.. ఇలాంటి రిస్క్​తో కూడిన పరిశ్రమల వద్ద బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటూ అధికమే. ఫలితంగా.. అనేక ఎంఎస్​ఎంఈలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలే దిక్కు. అధిక వడ్డీల రుణ చట్రంలో చిక్కుకుని అవి ఎప్పటికీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలగానే మిగిలిపోతున్నాయి.

దారి చూపే ఓకెన్..
Ocen India Msme : డిజిటలీకరణ.. భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది. చిరు పరిశ్రమలకు రుణాల విషయంలోనూ ఇదే దారి చూపనుంది. ఓకెన్​ది​.. ఇందులో ముఖ్య భూమిక! ఓకెన్ అంటే ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్​మెంట్ నెటవర్క్​(ఓసీఈఎన్​). ఐరోపాలో ఇప్పటికే ఉన్న ఓపెన్ బ్యాంకింగ్ వ్యవస్థకు భారతీయ వెర్షన్​ ఇది. రుణగ్రహీతలు, రుణదాతల మధ్య వారధిగా పనిచేస్తుంది. భారతీయ ఐటీ రంగం పురోగతి కోసం పనిచేసే మేధో సంస్థ అయిన ఇండియన్ సాఫ్ట్​వేర్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ రౌండ్​టేబుల్​(ఐస్పిరిట్).. ఈ వికేంద్రీకృత క్రెడిట్ నెట్​వర్క్​ను అభివృద్ధి చేసింది. 2020 జులై 22న ఓకెన్​ను లాంఛ్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నందన్ నీలేకని గ్లోబల్ ఫిన్​టెక్ ఫెస్టివల్ వేదికగా ప్రకటించారు.

ఓకెన్​ ఎలా పనిచేస్తుంది?
ఓకెన్​ అంటే ప్రత్యేకంగా ఓ వెబ్​సైట్​ లేదా యాప్​ ఏమీ ఉండదు. ఇదొక డిజిటల్ ప్లాట్​ఫామ్. ఏపీఐ సాంకేతికత ఆధారంగా నిర్దేశిత నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. రుణగ్రహీతలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. లోన్ల సమాచారాన్ని పారదర్శకంగా, సురక్షితంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. రుణ మంజూరు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఏకైక వేదికగా నిలుస్తుంది.

  • ఓకెన్​లో 3 ప్రధాన లేయర్లు ఉంటాయి. మొదటిది.. ఐడెంటిటీ లేయర్. ఆధార్, డిజీలాకర్ సాయంతో నిర్ధరించిన రుణగ్రహీతల సమాచారం ఇందులో ఉంటుంది. డిజిటల్ విధానంలో ఒక్కసారి ఇందులో చేరితే చాలు.. ఎన్నిసార్లైనా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిసారీ గుర్తింపు పత్రాలు సమర్పించాల్సిన పని ఉండదు.
  • ఓకెన్​లో మరో ప్రధాన వ్యవస్థ.. పేమెంట్ లేయర్. పూర్తిగా యూపీఐ ఆధారితం. రుణం మంజూరైతే తక్షణమే రుణదాత నుంచి యూపీఐ ద్వారా రుణగ్రహీత ఖాతాలోకి జమవుతుంది. అదే యూపీఐ ద్వారా అప్పును తిరిగి కట్టొచ్చు. ఒక్కసారి కూడాబ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉండదు!
  • ఓకెన్​లోని మూడో లేయర్.. డెపా. అంటే.. డేటా ఎంపవర్​మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్. రుణం కావాల్సిన వ్యక్తులు, సంస్థల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ఇందులో భద్రంగా నిక్షిప్తమై ఉంటుంది. రుణగ్రహీతలు అంగీకరిస్తేనే.. లోన్లు ఇచ్చే బ్యాంకులు, సంస్థలు ఈ వివరాలు చూడగలవు.

లోన్ కోసం​ ఎలా అప్లై చేయాలి? మంజూరు ఎలా?
చిరు వ్యాపారులు ఇప్పటికే ఉపయోగిస్తున్న జెమ్ సహాయ్, జీఎస్​టీ సహాయ్​ యాప్​ల ద్వారా రుణ దరఖాస్తు చేయొచ్చు. ఆధార్, డిజీలాకర్ అథెంటికేషన్ అప్పటికే పూర్తయి ఉండడం వల్ల.. కొత్తగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు.

లోన్​ రిక్వెస్ట్ పంపాక.. ఆ సమాచారం అకౌంట్ ఆగ్రిగేటర్​కు వెళ్తుంది. అనంతరం డెపాలో ఉన్న రుణగ్రహీత సమాచారం(ఐటీ రిటర్న్స్, జీఎస్​టీ ఫైలింగ్స్​, ఇతర వివరాలు).. ఆర్​బీఐ ఆమోదం పొందిన లోన్​ ప్రోడక్ట్ ప్రొవైడర్లకు చేరుతుంది. దాని ఆధారంగా.. ఆయా బ్యాంకులు/సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. వడ్డీరేటు, వ్యవధిపై.. రుణగ్రహీత ప్రొఫైల్​ను బట్టి ఆఫర్లు ఇస్తాయి. నచ్చిన ఆఫర్​ను ఓకే చేస్తే.. ఆ బ్యాంక్​ నుంచి వెంటనే యూపీఐ ద్వారా డబ్బులు రుణగ్రహీత ఖాతాలో జమవుతాయి. ఈ ప్రక్రియ మొత్తానికి పట్టే సమయం కొన్ని నిమిషాలే!

లాభాలతో పాటు సవాళ్లు కూడా..
ఓకెన్​లో ఇప్పుడిప్పుడే రుణదాత సంస్థలు వరుసగా చేరుతున్నాయి. యూగ్రో క్యాపిటల్, ఐసీఐసీఐ బ్యాంక్, 121 ఫైనాన్స్, టాటా క్యాపిటల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎక్స్​వైజెడ్​ఓ, క్రెడబుల్, లెండింగ్​కార్ట్​ ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నాయి. రుణగ్రహీతల కోసం పేటీఎం, స్విగ్గీ వంటి ప్రజాదరణ పొందిన యాప్​లలోనూ ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓకెన్​ లాంఛ్ అయ్యాక.. పైలట్ విధానంలో 2022 డిసెంబర్ నాటికి రూ.15కోట్ల రుణాలు మంజూరయ్యాయి. సగటు రుణం విలువ రూ.40వేలు కాగా.. గరిష్ఠంగా ఇచ్చిన మొత్తం రూ.10లక్షలు. 90రోజుల వ్యవధితో కేవలం రూ.160 రుణం కూడా మంజూరవడం విశేషం. ఐస్పిరిట్ ప్రతినిధుల ప్రకారం రుణ మంజూరుకు పడుతున్న సమయం 10నిమిషాలకన్నా తక్కువ.
ఇంతటి సరళమైన, వేగవంతమైన రుణ మంజూరు ప్రక్రియ ఎంఎస్​ఎంఈలకు వరంలా మారుతుందనేది నిపుణుల మాట. వ్యాపార విస్తరణకు అవసరమైన పెట్టుబడి సులువుగా సమకూరి.. ఆ పరిశ్రమకు, దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకంగా ఉంటుందనేది వారి విశ్లేషణ.

అయితే.. ఓకెన్​తో సవాళ్లూ ఉన్నాయి. రుణగ్రహీతల సంఖ్య పెరిగా కొద్దీ.. ఎగవేతలూ ఎక్కువయ్యే ప్రమాదముంది. ఈ సమస్య తీవ్రత తగ్గించేలా.. రుణఎగవేతదారులు మరోసారి అప్పు పొందకుండా చూసే యంత్రాంగం అవసరం. వివాదాల పరిష్కారానికి ఆన్​లైన్​ ఫోరం, డిజిటల్ అంబుడ్స్​మెన్ ఏర్పాటు తప్పనిసరి. లక్షలాది పరిశ్రమలు, వ్యక్తుల సమాచారాన్ని సైబర్ దాడుల నుంచి కాపాడడం పెద్ద సవాల్. ఆన్​లైన్ మోసాల బారిన పడకుండా చిరు పరిశ్రమల యజమానుల్ని డిజిటల్ అక్షరాస్యుల్ని చేయడం మరో కీలకాంశం. అప్పుడే ఓకెన్​ లక్ష్యం సాకారం!
-జీఎస్​ఎన్​ చౌదరి, ఈటీవీ భారత్.

ABOUT THE AUTHOR

...view details