తెలంగాణ

telangana

అంతర్గత పోరులో మయన్మార్‌- కొనసాగుతున్న సైన్యం దాష్టీకాలు

By

Published : Feb 8, 2022, 7:02 AM IST

Myanmar Civil War: మయన్మార్‌లో కొనసాగుతున్న పరిణామాలు భారత్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆ దేశంలోని 'చిన్‌' రాష్ట్రం భారత్‌లోని మిజోరం సరిహద్దుగా ఉంది. చిన్‌లో మిలిటరీ జుంటాపై వేలమంది ఉద్యమిస్తున్నారు. దీంతో సైన్యం వారిపై దాడులు చేయడమే గాక, యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తోంది. చిన్‌కు చెందిన వేలాది ప్రజలు భారత్‌లోకి శరణార్థులుగా ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది వేలమందికి పైగా ఇండియాలోకి వచ్చినట్లు అంచనా.

Myanmar  civil war
మయన్మార్‌

Myanmar Civil War: మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి- సైన్యం అధికారాన్ని చేజిక్కించుకొని ఏడాది పూర్తయింది. గత ఫిబ్రవరి ఒకటో తేదీన అంతర్జాతీయ సమాజానికి ఎలాంటి అనుమానం రాకుండా ఒక్క రాత్రిలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ 'జుంటా' కర్కశంగా పాలన సాగిస్తోంది. ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న సైనిక అధిపతి మిన్‌ ఆంగ్‌ లెయింగ్‌ ప్రధానిగా ప్రకటించుకున్నారు. దేశంలో ప్రజలు సైనికపాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దీన్ని సహించలేని సైన్యం నిరాయుధులపై కాల్పులు, గృహదహనాలతో విరుచుకుపడుతోంది. అంతర్జాతీయ సమాజం ఎన్ని ఆంక్షలు విధించినా, హెచ్చరించినా సైన్యం తన తీరు మార్చుకోకపోవడం ఆందోళనకరం. ఎన్‌ఎల్‌డీ నేత ఆంగ్‌సాన్‌ సూచీని నిర్బంధించడంతో పాటు పలు కేసులు పెట్టడంతో దేశం నలుమూలలా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పౌరులు శాసనోల్లంఘన రూపంలో తమ నిరసనలను తెలుపుతున్నారు. దేశంలో సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 1800 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వాస్తవంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి.

Military Rule In Myanmar: గత ఏడాది ప్రవాసంలో ఉన్న కొందరు ఎన్‌ఎల్‌డీ నేతలు జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని (ఎన్‌యూజీ) నెలకొల్పారు. తొలినాళ్లలో అహింసాయుత పోరాటానికి నాంది పలికిన ఎన్‌యూజీ వర్గాలు సైనిక అరాచకాలను ఎదుర్కొనేందుకు ప్రజారక్షక దళాలను ఏర్పాటు చేశాయి. ఆ దళాల సభ్యులకు 'మిలీషియా' తరహాలో ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న ప్రజలపై సైన్యం పాశవికదాడులకు దిగడంతో ఆయుధాలు పట్టక తప్పడం లేదని ప్రజారక్షక దళాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబరు ఏడోతేదీన సైన్యం బలప్రయోగాన్ని అడ్డుకునేందుకు పోరాటం ప్రారంభమైనట్లు ఎన్‌యూజీ ప్రకటించింది. మరోవైపు ఆసియాన్‌ కూటమి పేర్కొన్న అయిదు అంశాలపై మయన్మార్‌ పాలకులు ఎలాంటి కార్యాచరణా చేపట్టకపోవడంపై కూటమి దేశాలు గుర్రుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆసియాన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాంబోడియా దీనిపై స్పందించింది. శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటే త్వరలో జరగనున్న ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల సమావేశానికి మయన్మార్‌ను ఆహ్వానిస్తామని, లేదంటే అనుమతించబోమని స్పష్టం చేసింది.

తాము మద్దతు ప్రకటించిన 'యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ' 2020 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో కంగుతిన్న సైన్యం- 2021 ఫిబ్రవరిలో ఆంగ్‌సాన్‌ సూచీ కీలకపాత్ర పోషిస్తున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సూచీతో పాటు ఎన్‌ఎల్‌డీకి చెందిన పలువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. వీరిపై రకరకాల కేసులను నమోదుచేసింది. మయన్మార్‌ సాధించిన ఆర్థికాభివృద్ధి సైనిక పాలనతో తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. 2021 ఆర్థికరేటు చాలావరకు తగ్గిపోయింది. కొవిడ్‌వల్ల దేశ ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలింది. వేలమంది ప్రజలు థాయ్‌లాండ్‌, భారత్‌... తదితర దేశాలకు వలస వెళ్లారు. 2023లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సైనికపాలకుల వాగ్దానాలను సామాన్య ప్రజలు విశ్వసించడం లేదు. రానున్న రోజుల్లో ప్రజారక్షక దళాలకు, సైన్యానికి మధ్య భీకరమైన పోరు జరిగే అవకాశముంది. ఈ పోరుతో దేశం అంతర్యుద్ధంలో మునిగిపోయే ప్రమాదముందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సైనిక ప్రభుత్వ అరాచకాలను నియంత్రించేందుకు వీలుగా అమెరికా చర్యలు చేపట్టింది. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేసింది. కానీ, మయన్మార్‌ పాలకులకు చైనా, రష్యా లోపాయికారీగా మద్దతు ఇస్తున్నాయి.

Myanmar Military Coup: మయన్మార్‌లో కొనసాగుతున్న పరిణామాలు భారత్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆ దేశంలోని 'చిన్‌' రాష్ట్రం భారత్‌లోని మిజోరం సరిహద్దుగా ఉంది. చిన్‌లో మిలిటరీ జుంటాపై వేలమంది ఉద్యమిస్తున్నారు. దీంతో సైన్యం వారిపై దాడులు చేయడంతో పాటు, యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తోంది. చిన్‌కు చెందిన వేలాది ప్రజలు భారత్‌లోకి శరణార్థులుగా ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది వేలమందికి పైగా ఇండియాలోకి వచ్చినట్లు అంచనా. వీరికి సదుపాయాలు కల్పించలేక స్థానిక యంత్రాంగం సతమతమవుతోంది. మయన్మార్‌లో సైనిక పాలన సుదీర్ఘకాలం కొనసాగితే శరణార్థుల రాకతో భారత్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. చారిత్రకంగా, భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మయన్మార్‌తో భారత్‌కు సుదీర్ఘమైన అనుబంధముంది. మయన్మార్‌లో తలదాచుకుంటున్న పలు భారత వ్యతిరేక వేర్పాటు ఉగ్రవాద సంస్థలను ఆ దేశ దళాలు గట్టిగా నియంత్రిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు మయన్మార్‌ తీరం నుంచి నిర్మిస్తున్న కాలదాన్‌ రహదారి ప్రాజెక్టుకు ఆ దేశం చేయూతనిస్తోంది. భారత్‌నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్ళే ఆ రహదారి ప్రాజెక్టు మయన్మార్‌ మీదుగా ఏర్పాటు కానుంది. మయన్మార్‌లో లక్షలాది భారతీయ సంతతివారు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారత్‌ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

- కొలకలూరి శ్రీధర్‌

ఇదీ చదవండి:Ukraine Tension: 'ఉక్రెయిన్​పై రష్యా ఏ రోజైనా దాడి చేయొచ్చు'

ABOUT THE AUTHOR

...view details