తెలంగాణ

telangana

ప్రమాణాల సాధనకు ప్రణాళిక కీలకం

By

Published : Feb 9, 2021, 8:04 AM IST

భారత్‌లో కరోనా కేసుల నమోదు క్రమేపీ తగ్గుతుండటం వల్ల తరగతి గది ప్రత్యక్ష బోధన తిరిగి ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ- విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. దేశంలో దాదాపు 25కోట్ల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌, డిజిటల్‌, రేడియో పాఠాలు విన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

education amid covid-19 restrictions in the country
ప్రమాణాల సాధనకు ప్రణాళిక కీలకం

కరోనా వైరస్‌ సృష్టించిన సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి తరగతి గదులకు దూరమయ్యారు. నిరుడు మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభమైన తర్వాత గత విద్యాసంవత్సరం(2020-21)లో స్తబ్ధత నెలకొంది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పాఠశాలల్లో పై తరగతులకు దశలవారీగా పరీక్షలు నిర్వహించగా, దిగువ తరగతుల విద్యార్థుల ఉత్తీర్ణతకు అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. 2021-22 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన అనేక దేశాలు- తరగతులు, పరీక్షలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. భారత్‌లో కేసుల నమోదు క్రమేపీ తగ్గుతుండటంతో తరగతి గది ప్రత్యక్ష బోధన తిరిగి ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ- విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. దేశంలో దాదాపు 25కోట్ల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌, డిజిటల్‌, రేడియో పాఠాలు విన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

పరీక్షలకు సన్నాహాలు

కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్రం ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఆన్‌లైన్‌, డిజిటల్‌, రేడియో పాఠాలను ప్రారంభించింది. తెరుచుకోని పాఠశాలల్లో బహుళ నమూనా విధానంలో బోధనను దీక్ష, స్వయం, కమ్యూనిటీ రేడియోల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, కళాశాలలు దశలవారీగా పరీక్షలను నిర్వహించి గత విద్యాసంవత్సరాన్ని గట్టెక్కించాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి శ్రీకారం చుట్టాయి. స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకున్న విశ్వవిద్యాలయాలు స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతి గది బోధనను ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల్లో వైద్యవిద్య తరగతులు మొదలయ్యాయి. ఇంటర్మీడియట్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డులు తమ విద్యాప్రణాళికల్లో మార్పుచేర్పులు చేసుకున్నాయి.

కేంద్రం సూచన మేరకు సిలబస్‌ తగ్గిస్తూ ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల తేదీలను ఇప్పుడిప్పుడే ప్రకటిస్తున్నాయి. మే నెలలో ఒకే షెడ్యూల్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు సైతం ఒకే షెడ్యూల్‌లో మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇటీవలే వెల్లడించింది. కేంద్రీయ సిలబస్‌ (సీబీఎస్‌ఈ) అనుసరిస్తున్న పాఠశాలల్లో 10, 12వ తరగతులకు బోర్డు పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతికి నవంబర్‌ రెండో తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది పదో తరగతి పేపర్లను ఏడుకు కుదించి జూన్‌లో పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశోధన శిక్షణ మండలి ప్రకటించింది.

తెలంగాణలో ఆరు పేపర్లతో పదోతరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భౌతిక వృక్ష శాస్త్రాలను కలిపేసి తెలంగాణలో ఒకే పేపరు కింద పరీక్ష నిర్వహిస్తుండగా- ఏపీలో వాటిని వేర్వేరు పేపర్లుగా పరిగణించనున్నారు. పాఠశాల కనీస పనిదినాలు 160 ఉండేలా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాలు ఈ ఏడాది వేసవి సెలవులు రద్దు చేసినట్లు ప్రకటించాయి. ఇప్పటికే ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించిన తెలుగు రాష్ట్రాలు ఒకటి నుంచి అయిదో తరగతి వరకు- తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తీసుకుని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించాయి. ఒక తరగతికి 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నాయి. కొంత ఆన్‌లైన్‌ మరికొంత ఆఫ్‌లైన్‌ విధానంలో సాగుతున్న ఈ విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్‌ బోధన పూర్తిస్థాయిలో జరగలేదు. కేంద్రప్రభుత్వ సూచన మేరకు ప్రాక్టికల్స్‌లోనూ 30శాతం పాఠ్యప్రణాళిక తగ్గింది. వచ్చే (2022-23) విద్యాసంవత్సరానికల్లా కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగినా- విద్యార్థులు పూర్తిస్థాయి పాఠ్యప్రణాళికను అనుసరించడం కష్టమైన విషయమే. గడచిన ఏడాది అభ్యసనం కనిష్ఠ స్థాయికి చేరినందువల్ల విద్యార్థుల్లో ఆ మేరకు సృజనాత్మకత తగ్గే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలతో ఈ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.

ప్రత్యేక శ్రద్ధ అవసరం

నెలల తరబడి గృహాలకు పరిమితమైన విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేస్తూ వారికి ఇచ్చే ఇంటి పని, ప్రాజెక్టు పని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల ఆన్‌లైన్‌ అభ్యసనాన్ని ఆఫ్‌లైన్‌గా మార్చి, వారిని తరగతి గది బోధనకు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొత్త తరగతిలో పాఠాలు ప్రారంభించే ముందు గత తరగతి పాఠాలు ఒకసారి పునశ్చరణ చేయడం అవసరం. ఈ విద్యాసంవత్సరాన్ని కుదించినందువల్ల- ఉపాధ్యాయులు బోధనా ప్రణాళికను ప్రత్యేకంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు జారీచేసిన కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమార్గం. ఆటపాటలతో పిల్లలు పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక ప్రణాళికలను అనుసరిస్తూ సమన్వయంతో వ్యవహరిస్తే- ఉన్నంతలో నాణ్యమైన విద్యాసంవత్సరం అందించడం సాధ్యమే!

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి,(అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం).

ఇదీ చదవండి:భాజపాపై కాంగ్రెస్​ 'సోషల్​ మీడియా' ఎటాక్​!

ABOUT THE AUTHOR

...view details