భారత భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్టులను ఏదో రకంగా అడ్డుకునేందుకు చైనా పన్నుతున్న కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయి. భారత, జపాన్ భాగస్వామ్యంతో నిర్మించతలపెట్టిన 'ఈస్ట్ కంటెయినర్ టర్మినల్ (ఈసీటీ)' త్రైపాక్షిక ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం ఉన్నట్లుండి ఉపసంహరించుకోవడమే ఇందుకు నిదర్శనం. శ్రీలంక రాష్ట్రపతి మైత్రీపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘెల జమానాలో కొలంబో ఓడరేవులో ఈసీటీని అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై 2019లో సంతకం చేశారు. ఈ భాగస్వామ్యంలో శ్రీలంక వాటా 51శాతం, భారత్ జపాన్ల వాటా 49శాతంగా ఉంది. శ్రీలంకలో అంతకంతకూ పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేసే ఉద్దేశంతో భారత్, జపాన్‌లు అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి కనబరిచాయి.
కొలంబోకు సమీపంలోని ఈ ఓడరేవు ద్వారా ఆ ప్రాంతంలో 70శాతం వ్యాపారం జరుగుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కొలంబో ఓడరేవులో వాణిజ్య భాగస్వామ్యం స్థిరపడితే శ్రీలంకలో భారత్ ప్రాబల్యం విస్తరిస్తుందన్న భయం చైనా అధినాయకత్వానిది. చైనా అనుకూలురుగా ముద్రపడ్డ రాజపక్స సోదరులు ఈ త్రైపాక్షిక ఒప్పందానికి వ్యతిరేకంగా మొదటినుంచీ గళం విప్పుతూనే ఉన్నారు. నిరుడు జరిగిన ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని వారు బలంగా ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందారు. కొలంబో ఓడరేవులోని కార్మిక సంఘాలనూ ఆ మేరకు పరోక్షంగా రెచ్చగొట్టి, నిరసన జ్వాలలు ఎగిసేందుకు కారణమయ్యారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఈసీటీ త్రైపాక్షిక ఒప్పందాన్ని తిరగదోడతామని రాజపక్స కార్మికులకు వాగ్దానం చేశారు.
అందుకే నీడలా వెన్నాడుతోంది
శ్రీలంకను రుణ ఉచ్చులో బిగించి 140 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులో సింహభాగం దక్కించుకున్న చైనాకు- ఈసీటీలో భారత్ ప్రవేశం కంటగింపుగా మారింది. ఆసియా, ఐరోపాల్లో వివిధ దేశాలతో భాగస్వామ్యాలు నెలకొల్పుకొని ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు బీజింగ్ నాయకత్వం కొన్నేళ్లుగా వ్యూహాత్మకంగా కదులుతోంది. ఆ క్రమంలో అది తొలుత ఆసియాలోని చిన్న దేశాలపై దృష్టిపెట్టింది. బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమం, నౌకా వాణిజ్య మార్గ నిర్మాణాల రూపంలో ఏదోరకంగా ఆసియా, ఐరోపాల్లో ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భౌగోళిక పరిమాణం, రాజకీయ పలుకుబడి రీత్యా భారత్‌ను చైనా అతిపెద్ద సవాలుగా భావిస్తోంది. తాము ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా చలాయించుకునే క్రమంలో భారత్‌ను తమకు అతిపెద్ద అడ్డంకిగా బీజింగ్ నాయకత్వం పరిగణిస్తోంది. అందుకే అది భారత్‌ను నీడలా వెన్నాడుతోంది.