తెలంగాణ

telangana

కనిపించిన ప్రతి వస్తువు కాన్వాసే.. వేసే ప్రతిబొమ్మ అద్భుతమే!

By

Published : Dec 26, 2020, 1:56 PM IST

కొందరికి సంగీతమంటే ఇష్టం. మరికొందరికి గానమంటే ప్రాణం. ఇంకొందరికి చిత్రలేఖనం అంటే అభిమానం. మనిషి మనిషికి అభిరుచి మారుతున్నప్పుడు.. అందరిని మెప్పించాలంటే.. కాస్తంతా కష్టమే. ఏదో ప్రత్యేకత.. ఇంకేదో కొత్తదనం ఉంటేనే.. ప్రపంచాన్ని ఆకర్షించగలం. బెంగళూరుకు చెందిన సుమలత ఇదేరీతిలో ఆలోచించింది. చిత్రకళకు ఉన్న హద్దుల్ని చెరిపేస్తూ.. వినూత్నమైన బొమ్మలతో ఆకట్టుకుంటోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.

sumalatha holds Indian book of records for her painting skill
కనిపించిన ప్రతి వస్తువు కాన్వాసే

ప్రతి మనిషిలోనూ ప్రతిభ ఉంటుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనా ఉంటుంది. అందుకు అనుగుణంగా పట్టుదలతో ప్రయత్నిస్తే.. మంచి ఫలితం వస్తుంది. తనదైన వినూత్న చిత్రాలతో ఇదే నిరూపిస్తోంది.. వోలేటి వెంకటకృష్ణ సుమలత. బెంగళూరులో స్థిరపడిన ఈ హైదరాబాద్‌ కళాకారిణి.. అరుదైన చిత్రాలకు రూపమిస్తూ.. చిత్రకారిణిగా ప్రత్యేక చాటుకుంటుంది.

కనిపించిన ప్రతి వస్తువు కాన్వాసే

ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో చోటు

చిత్రలేఖనం అనగానే కాగితం, వస్త్రం తదితర కాన్వాస్‌లపై వేసిన అందమైన బొమ్మలు కళ్లముందు మెదులుతాయి. అయితే సృజనాత్మకతే పెట్టుబడిగా సాగే ఈ కళలో వైవిధ్యం చాటేందుకు పప్పుదినుసుల పై బొమ్మలు వేస్తూ.. అబ్బురపరుస్తోంది సుమలత. అతిచిన్న కాన్వాస్‌పై అనుకున్న విధంగా చిత్రాలు వేసేందుకు స్వయంగా బ్రష్‌లు తయారుచేసుకుని.. సూక్ష్మచిత్రాలకు రూపమిచ్చింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

పప్పుదినుసులపై ప్రకృతి ఘట్టాలు

ప్రకృతిలోని అరుదైన, అద్భుత ఘట్టాలకు.. పప్పుదినుసులపై తన బొమ్మలతో ప్రాణం పోసింది..సుమలత. సూర్యోదయం, వెన్నెల రాత్రి, ఆకాశంలో నక్షత్రాలు, పారే నది, ఎత్తైన పర్వతాలు, సముద్రతీరం ఇలా సహజసిద్ధ అందాలన్నింటికీ..తన చిత్రకళతో సరికొత్త రూపునిచ్చింది. రంగు రంగుల పువ్వులు, సీతాకోక చిలుకలతో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి..అభినందనలందుకుంటోంది.

చిత్రలేఖనంలో డిప్లొమో

పాఠశాల దశ నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న సుమలత.. అనేక పోటీల్లో బహుమతులు గెల్చుకుంది. చిత్రలేఖంలో డిప్లొమో సైతం చేసిన ఆమె.. విభిన్న రకాల చిత్రలేఖనంలో పట్టు సాధించింది. గ్లాస్ పెయింటింగ్, క్రేయాన్స్, ఆయిల్ కలర్స్, వాటర్‌ కలర్స్‌, ఆక్రిలిక్, మురల్ ఆర్ట్, ఆల్కహాల్ ఇంక్ ఆర్ట్‌, తంజావూర్ పెయింటింగ్స్‌లోనూ సుమలత చక్కని నైపుణ్యంతోనే ఆకట్టుకునే బొమ్మలు వేస్తోంది.

చిత్ర ఆర్ట్స్ స్టార్టప్

సుమలత.. వివాహానికి ముందు హైదరాబాద్‌ ఇన్ఫోటెక్‌లో కొంతకాలం విధులు నిర్వహించింది. ఆ తరువాత భర్తతో పాటు బెంగళూరు వెళ్లిన ఆమె.. ఇష్టమైన చిత్రలేఖనంపై మళ్లీ దృష్టి సారించింది. విభిన్న రకాల చిత్రాలు వేయటమే కాకుండా .. ఈ చిత్రకళను చిన్నారులకూ అందించాలని నిర్ణయించుకుంది. ఆ ఆలోచన నుంచే చిత్ర ఆర్ట్స్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ ప్రారంభించింది. ప్రతిభ ఉన్న కళాకారులతో నాణ్యమైన సేవలందిస్తూ.. చిత్ర ఆర్ట్స్‌ను ఉత్తమ అంకుర సంస్థగా నిలిపింది. 2019 ఏడాదికి ఇండియా 500 స్టార్టప్‌ పురస్కారాన్ని అందుకుంది.. సుమలత.

వ్యర్థాలకు అర్థం

గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. ఆసక్తి ఉన్న చిత్రలేఖనంలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపుతోంది.. సుమలత. ఇంట్లో ఉండే వ్యర్థ వస్తువులైన ప్లాస్టిక్ డబ్బాలు, బల్బులు, పీవీసీ పైపులు, పాత సీసాలు, పగిలిన కుండలపై అరుదైన చిత్రాల్ని రూపొందిస్తోంది. లాక్‌డౌన్ సమయం నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తోంది. ఉత్తమ కళాకారులుగా పిల్లల్ని తీర్చిదిద్దుతోంది.

వ్యాపారవేత్తగా

అవకాశం ఉన్న ప్రతి వస్తువును కాన్వాస్‌గా మలుచుకుంటున్న సుమలత.. దిండు కవర్లు, చేతిరుమాలు, హ్యాండ్‌బ్యాగులు, పర్సులు ఇలా అనేక వస్తువులపై అందమైన చిత్రాలు వేస్తోంది. వీటిని ఆన్‌లైన్ కామర్స్ సంస్థల ద్వారా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కళాకారిణిగా, వ్యాపారవేత్తగా తనదైన పంథాలో ముందుకు సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details