తెలంగాణ

telangana

ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

By

Published : Aug 4, 2020, 8:12 AM IST

cyber crimes using social media
వేధించేందుకు అంతర్జాలంలో కాచుకొని కూర్చున్న సైబర్‌ నేరస్థులు

సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ల్లో అపరిచితుల వ్యాఖ్యలు, ఫొటోలు చూసి బాగున్నాయని ఆసక్తి చూపితే అప్పటి నుంచే ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా యువతులు, విద్యార్థినులపైనే సైబర్‌ నేరస్తులు ఎక్కువ దృష్టిపెట్టారు. ఇలా లైక్‌ కొట్టిన వారి చిరునామాల ఆధారంగా వ్యక్తిగత వివరాలు సేకరించి వెంటాడుతున్నారు. మానసికంగా వేధిస్తున్నారు. భరించలేని కొందరు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలున్నాయి. అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

యువతులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్‌ నేరస్తులు మాయమాటలతో ఆకర్షించి పరిచయం చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఫొటోలు, చరవాణి నంబర్లను తీసుకుని వారు చెప్పినట్లు వినకపోతే ఆ చిత్రాలను అసభ్యంగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామంటూ హెచ్చరిస్తున్నారు. లొంగని వారిపై తయారు చేసిన ఫొటోలను, అశ్లీల వీడియోలను వారి స్నేహితుల ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేస్తున్నారు.

దిల్లీ ఉండే ఈ సైబర్‌ నేరస్తులు మెట్రో నగరాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు ఉంచుతున్నారు. అందంగా ఉండే విదేశీ యువతుల ఫొటోలతో ఖాతాలు ప్రారంభించి రోజుకు 20-25 మంది యువకులను ఆకర్షిస్తున్నారు. కొద్దిరోజులు ప్రేమాయణం నడిపాక పెళ్లిచేసుకుందామని ప్రతిపాదిస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోగానే దిల్లీకి వచ్చాను.. ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నాను.. భారతదేశ నగదు లేదు.. రూ.లక్ష పంపించమంటూ ప్రారంభించి, సాధ్యమైనంత వరకు రాబట్టుకొని ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగిస్తున్నారు. ఫోన్లు ఆపేస్తున్నారు.

సామాజిక మాధ్యమాలు కేసులు

2016- 232

2017- 249

2018- 298

2019- 359

2020- 281(జులై 31 వరకు)

యువతులు, విద్యార్థులు జాగ్రత్త: సైబర్‌ పోలీసులు

  • ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలున్న యువతులు, విద్యార్థులు సైబర్‌ నేరస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కేవలం ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ ద్వారా మొత్తం సమాచారాన్ని తస్కరిస్తున్నారని వివరిస్తున్నారు.
  • నేరస్తులు, మోసగాళ్లు 95 శాతం సొంత పేర్లతో ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరవరు. అందులో వారి వివరాలన్నీ కల్పితాలే. తప్పని పరిస్థితుల్లోనే వారి అసలు వివరాలను బయటపెడతారు.
  • ఫేస్‌బుక్‌ స్నేహాల్లో 60 శాతానికిపైగా యువతుల పేర్లతో నకిలీ ఖాతాలు నిర్వహించే సైబర్‌ నేరస్తులే ఉంటారు. వీరివలలో పడకండి. అన్నీ రుజువు చేసుకున్నాకే స్నేహాన్ని కొనసాగించండి.
  • మెట్రో నగరాల్లో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో 70 శాతం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఈవ్‌టీజింగ్‌, బెదిరింపుల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
  • హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో ఫేస్‌బుక్‌ ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలా వేధిస్తున్న నేరస్తుల్లో 60 శాతం విద్యార్థినులు, యువతులకు తెలిసిన వారే ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details