తెలంగాణ

telangana

చైనా హెచ్చరికలు బేఖాతరు.. తైవాన్ విషయంలో పెలోసీ తగ్గేదేలే!

By

Published : Aug 1, 2022, 9:57 PM IST

Nancy Pelosi Taiwan

Nancy Pelosi Taiwan: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం తైవాన్​కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడిని పెలోసీ కలవనున్నట్లు అమెరికా వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

Nancy Pelosi Taiwan: తైవాన్ పర్యటన విషయంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఆసియా పర్యటనలో ఉన్న పెలోసీ.. తైవాన్​లో అడుగుపెట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం తైవాన్​కు వెళ్లి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పెలోసీ సమావేశమవుతారని అమెరికా వాల్​స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. తైవాన్ అధ్యక్షుడు తాయి ఇంగ్ వెన్​తోనూ భేటీ కానున్నట్లు తెలిపింది. మంగళవారం అక్కడే ఉండి.. బుధవారం తిరుగుపయనం కానున్నట్లు పేర్కొంది.

తైవాన్​లో పర్యటిస్తానని పెలోసీ చేసిన ప్రకటన.. చైనా- అమెరికాల మధ్య అగ్గిరాజేసింది. తైవాన్​లో పెలోసీ అడుగుపెడితే.. అత్యంత తీవ్రమైన పర్యవసనాలు ఉంటాయని చైనా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం.. తైవాన్ వెళ్లొద్దని పెలోసీకి సలహా ఇచ్చారు. అయినప్పటికీ స్పీకర్ వెనక్కి తగ్గడం లేదు. అయితే, ఆదివారం విడుదలైన ఆసియా పర్యటన వివరాల్లో మాత్రం తైవాన్ ప్రస్తావన లేదు. సింగపూర్‌, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లలో మాత్రమే పర్యటించనున్నట్లు ఆమె కార్యాలయం వెల్లడించింది. చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ నేతలు పెలోసీ పర్యటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై అమెరికాలో రాజకీయ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ వర్గం ఆమె తైవాన్‌లో పర్యటించాలని కోరుతోంది.

చైనాకు ఎందుకు అంత భయం?
నాన్సీపెలోసీ.. ఈ ఫైర్‌బ్రాండ్‌ పేరు వింటేనే చైనా అధి నాయకత్వం అప్రమత్తమైపోతుంది. ఎంతకైనా తెగించే మొండి రాజకీయ నాయకురాలిగా ఈమెకు పేరు. చైనాను ఇబ్బంది పెట్టడంలో మిగిలిన అమెరికా నాయకులతో పోలిస్తే ఈమె తీరు చాలా భిన్నం. అమెరికా నాయకులు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనకాడుతుంటే.. ఈమె అది చేసి చూపిస్తారు. అది బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ కావచ్చు.. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటన కావచ్చు. అమెరికాలో డెమొక్రాట్లను ట్రంప్‌ ఓ ఆట ఆడుకొంటున్న రోజుల్లో ఈ 82ఏళ్ల వృద్ధ మహిళ మళ్లీ చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతినిధుల సభ స్పీకర్‌గా విజయం సాధించి.. ట్రంప్‌ వార్షిక ప్రసంగంలోనే స్పీకర్‌ స్థానంలో కూర్చొని కాగితాలు చించి సంచలనం సృష్టించారు. తాజాగా తైవాన్‌కు అండగా.. రంగంలోకి దిగారు.

అసలేం జరిగింది..?
తైవాన్‌ ప్రజలకు.. అమెరికా ప్రజలు, కాంగ్రెస్‌ మద్దతు ఉంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే ఆమె తైవాన్​కు వెళ్లాల్సింది. కానీ, కొవిడ్‌-19 సోకడంతో ఆ పర్యటన వాయిదా పడింది. 1997లో రిపబ్లికన్‌ స్పీకర్‌ న్యూట్‌ గింగ్రిచ్‌ తర్వాత అక్కడికి వెళ్లిన స్పీకర్‌గా రికార్డు సృష్టించనున్నారు. నాన్సీ తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చైనా విషయంలో ఎప్పుడూ కఠువుగానే వ్యవహరించారు. అటువంటి నేత ఇప్పుడు తైవాన్‌ వెళ్లడం డ్రాగన్‌ను భయపెడుతోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details